ITR filing penalty: ఆదాయపన్ను రిటర్ను దాఖలు తుది గడువు సమీపిస్తోంది. 2022-23 అసెస్‌మెంట్‌ ఏడాదికి గాను ఐటీఆర్‌ ఫైల్‌ చేసేందుకు 2022, జులై 31 చివరి తేదీ. ఆ లోపు పన్ను చెల్లింపు దారులు ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఆలస్య రుసుము చెల్లించాల్సి వస్తుంది. కొందరికి మాత్రం చట్టం మినహాయింపు ఇచ్చింది. వీరు గుడువు దాటిన తర్వాత సమర్పించినా ఎలాంటి పెనాల్టీ ఉండదు.


వీరికి పెనాల్టీ ఉండదు


ఆదాయపన్ను చట్టాల (Income Tax) ప్రకారం ప్రతి ఒక్కరూ ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ఆదాయం కనీస మినహాయింపు పరిమితిని (Basic Excemption Limit)  దాటకపోతే వారు తుది గడువు తర్వాత ఐటీఆర్‌ ఫైల్‌ (ITR filing) చేసినా పెనాల్టీ ఉండదు. 'కనీస మినహాయింపు పరిమితికి మించని ఆదాయం ఉండి, ఐటీఆర్‌ను ఆలస్యంగా సమర్పించినా సెక్షన్‌ 234F ప్రకారం వారికి ఆలస్య రుసుము వర్తించదు. సెక్షన్‌ 80సి నుంచి 80యూ కింద డిడక్షన్లను (Income Tax Deductions) తీసుకోకముందు ఉండే మొత్తం ఆదాయాన్ని గ్రాస్‌ ఇన్‌కమ్‌గా (Gross Income) పరిగణనలోకి తీసుకుంటారు' అని టాక్స్‌2విన్‌ సీఈవో అభిషేక్‌ సోని అంటున్నారు.


అర్హులు ఎవరు?


ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం ప్రకారం కనీస మినహాయింపు పరిమితిని రెండు రకాలు ఎంచుకుంటారు. కొత్త ఆదాయ పన్ను విధానాన్ని (New Tax Regime) ఎంచుకుంటే వయసుతో సంబంధం లేకుండా కనీస మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా ఉంది. పాత ఐటీ పద్ధతినే (Old Tax Regime) ఎంచుకుంటే మాత్రం వయసును పరిగణనలోకి తీసుకుంటారు. దీని ప్రకారం 60 ఏళ్లలోపు వారికి కనీస మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలు. 60-80 ఏళ్ల మధ్య వారికి ఇది రూ.3 లక్షలుగా ఉంది. 80 ఏళ్లు పైబడిని సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు రూ.5 లక్షలుగా ఉంది.



వీరికి పెనాల్టీ తప్పదు!


పై నిబంధనలకూ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కనీస మినహాయింపు పరిమితిని మించి ఆదాయం లేకున్నా కొందరు వ్యక్తులు కచ్చితంగా ఐటీఆర్‌ను సమర్పించాలి. సెక్షన్‌ 139(1) ఏడో ప్రావిజన్‌ షరతులకు లోబడే వ్యక్తులు 2021-22 ఆర్థిక ఏడాదికి తుది గడువు లోపే కచ్చితంగా ఐటీఆర్‌ దాఖలు చేయాలని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. లేదంటే సెక్షన్‌ 234F కింద పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. వారు ఎవరంటే?


1) ఏదైనా బ్యాంకు లేదా సహకార బ్యాంకులో ఒకటి లేదా అంతకుమించి కరెంటు ఖాతాల్లో ఏక మొత్తంలో లేదా అగ్రిగేట్‌గా రూ.కోటికి మించి జమ చేస్తే ఐటీఆర్‌ సమర్పించాలి. 


2) విదేశీ ప్రయాణాల్లో రూ.2 లక్షల కన్నా ఎక్కువ ఖర్చైతే ఐటీఆర్‌ దాఖలు చేయాలి. వారి తరఫున రెండో వ్యక్తి వెళ్లినా సమర్పించాల్సిందే.


3) ఏక మొత్తంలో లేదా విడతల వారీగా లక్ష రూపాయలకు మించి విద్యుత్‌ బిల్లు దాటితే ఐటీఆర్‌ సమర్పించాలి.


4) భారత్‌లో కనీస మినహాయింపు పరిమితిలోపు ఆదాయం ఉండి విదేశీ కంపెనీ షేర్లు ఉన్నా అందులో వాటాలు ఉన్నా, ఆస్తులున్నా, వాటిద్వారా ఆదాయం వస్తున్నా ఐటీఆర్‌ కచ్చితంగా దాఖలు చేయాలి.