Financial Planning: ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరం. వ్యక్తిగత, కుటుంబ అవసరాలు తీరడానికి అందరికీ ప్రతి నెలా డబ్బు కావాలి. అయితే... చాలామంది జీతగాళ్లు నెలాఖరు నాటికి అప్పుల కోసం చేతులు చాస్తున్నారు. చిరుద్యోగులే కాదు, భారీ జీతం ఉన్న వ్యక్తులు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. మంచి జీతం ఉన్నప్పటికీ, ఆ డబ్బు నెలాఖరు వరకు రావడం లేదంటే 'ప్రాపర్‌ ప్లానింగ్‌' లేదా 'ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌' లేకపోవడామే కారణం.


ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ మీ వల్ల కాదు అనుకుంటున్నారా?. భారత ప్రభుత్వం 143 కోట్ల మంది కోసం బడ్జెట్ రూపొందిస్తోంది, మీ కుటుంబం కోసం మీరు ప్లాన్‌ చేసుకోలేరా?. దేశం కోసం బడ్జెట్‌ వేయడానికి కష్టపడాలిగానీ, కుటుంబం కోసం ప్లాన్‌ చేయడం పెద్ద కష్టమేమీ కాదు, కాస్త లోకజ్ఞానం ఉంటే చాలు. డబ్బును పక్కా ప్లాన్‌ చేసి ఖర్చు చేస్తే మీ ఇంట్లో సమస్యలు సగం పైనే తగ్గుతాయి. ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని నేర్చుకుని, అమలు చేస్తే డబ్బుకు కొరత ఉండదు.


1. లాభనష్టాలను అర్థం చేసుకోండి


అన్ని కంపెనీలు తమ నికర లాభం లేదా నష్టాన్ని తెలుసుకోవడానికి, కంపెనీ చేసే ఖర్చులు & కంపెనీకి వచ్చే ఆదాయాలను విడివిడిగా లిస్ట్‌ చేస్తాయి. అదేవిధంగా, మీరు మీ ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేసి, అర్ధం చేసుకోవడానికి ఈ పద్ధతిని ఫాలో కావచ్చు.


2. మీ ఆదాయం & ఖర్చులను రాసుకోండి


మీకు ఉన్న అన్ని ఆదాయ వనరులను (జీతం, వ్యాపార ఆదాయం, అద్దె ఆదాయం, డిపాజిట్లపై వడ్డీలు వంటివి) & మీ కుటుంబం కోసం చేసే ప్రతి ఖర్చును (ఇంటి అద్దె, కిరాణా సరుకులు, బిల్లులు వంటివి) ఒక పుస్తకంలో రాయడం ప్రారంభించండి. ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి. మీ ఖర్చులను 'ముఖ్యమైనవి' & 'ముఖ్యం కానివి' అనే వర్గాలుగా విభజించాలి.


ముఖ్యమైన ఖర్చులు: ఈ లిస్ట్‌లో... విద్యుత్ బిల్లులు, మొబైల్ బిల్లులు, పిల్లల స్కూల్‌ ఫీజులు, కిరాణా సరుకులు, ఇతర గృహావసరాలు వంటి స్థిర ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చులను ఆపలేం.


ముఖ్యం కాని ఖర్చులు: వీటిలో... బయటి నుంచి ఆహారం ఆర్డర్‌ పెట్టడం, అనవసరమైన వాటి కోసం షాపింగ్ చేయడం, ఇతర విచక్షణపూరిత ఖర్చులు ఉంటాయి. నియంత్రించగల ఖర్చులు ఇవి.


3. అనవసరమైన ఖర్చులను తగ్గించండి


మీ వ్యక్తిగత, ఇంటి ఖర్చులను ఒకచోట రాసుకున్న తర్వాత, వాటిలో అనవసరమైన/ అంతగా ముఖ్యం కాని ఖర్చులను తగ్గించడంపై దృష్టి పెట్టండి. తరచుగా ఫుడ్‌ ఆర్డర్‌ చేయడం లేదా అనవసరమైన షాపింగ్ వంటి అలవాట్లను క్రమంగా మానుకోండి. దీనివల్ల మీ ఖర్చుల్ని చాలా వరకు తగ్గించొచ్చు.


4. అత్యవసర నిధిని సృష్టించండి


జీవితంలో ఎవరికైనా అత్యవసర పరిస్థితులు ఎదురు కావడం సహజం. అనుకోని పరిస్థితులు ఆర్థిక భారాన్ని పెంచుతాయి. ఈ సిట్యుయేషన్‌ను ఎదుర్కోవాలంటే.. ప్రతి నెలా మీ ఆదాయంలో కొంత భాగాన్ని అత్యవసర పరిస్థితుల కోసం పక్కన పెట్టడం చాలా ముఖ్యం. ఇదే ఎమర్జెన్సీ ఫండ్‌ (Emergency Fund). ఊహించని ఖర్చులను ఎమర్జెన్సీ ఫండ్‌ నుంచి చూసుకోవచ్చు. ఈ ఫండ్ మీ కుటుంబానికి రక్షణ కవచంలా పని చేస్తుంది, మీ నెలవారీ బడ్జెట్‌కు ఇబ్బంది లేకుండా చూస్తుంది.


5. లెక్కలు చూసుకోండి & సర్దుబాటు చేసుకోండి


మీ ఆదాయాలు, ఖర్చులను లిస్ట్‌గా రాసుకోవడంతోనే సరిపోదు, వాటన్నింటినీ ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలి. అప్పుడు... ఏ ఖర్చు అవసరం, ఏది అనవసరం, దేనిని సర్దుబాటు చేయొచ్చు వంటి విషయాలు మీకు ఈజీగా అర్ధం అవుతాయి. దానిని బట్టి మీ హోమ్‌ బడ్జెట్‌ ఎఫెక్టివ్‌గా మారుతుంది, అనవసర ఖర్చులు తగ్గి డబ్బు మిగులుతుంది. అప్పుడు, మీ జీతం నెలాఖరు వరకు వస్తుంది. కాబట్టి, మీ బడ్జెట్‌ను క్రమం తప్పకుండా సమీక్షించడం చాలా కీలకం.


మరో ఆసక్తికర కథనం: బజాజ్ హౌసింగ్‌ ఐపీవోలో బిడ్‌ వేశారా?, షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్‌ను ఇలా చెక్ చేయండి