Nine Types Of Bank Cheques: సాధారణంగా, బ్యాంకులు కరెంట్ అకౌంట్ హోల్డర్లు, సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు ఇద్దరికీ చెక్కులు జారీ చేస్తాయి. బ్యాంకింగ్ విస్తరిస్తున్న కొత్తల్లో, బ్యాంక్ చెక్‌బుక్ ఉండడం హోదాకు నిదర్శనంగా భావించేవాళ్లు. ఆ తర్వాత, భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుని బ్యాంకింగ్ లావాదేవీలు పెరిగిన తర్వాత, చెక్‌బుక్ ఉండడం అవసరంగా మారింది. అయితే, ఈ యూపీఐ (UPI) & డిజిటల్ లావాదేవీల యుగంలో, చెక్కుల ప్రాముఖ్యత తగ్గింది. కొన్నేళ్ల క్రితం వరకు, బ్యాంక్ చెక్‌లను విరివిగా వాడిన ప్రజలు ఇప్పుడు వాటిని పక్కనపెట్టారు. ప్రస్తుతం, పెద్ద లావాదేవీల కోసమే చెక్కులను ఉపయోగించడానికి ఇష్టపడతున్నారు. బ్యాంక్ చెక్, ఏదైనా లావాదేవీకి రుజువుగా ఉంటుంది. మనలో చాలా మంది చెక్ ద్వారా ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉండొచ్చు లేదా స్వీకరించి ఉండొచ్చు. అయితే, 9 రకాల బ్యాంక్ చెక్కులు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా?. వాటిని ఎక్కడ & ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసుకుందాం.
9 రకాల బ్యాంక్ చెక్కులు
1. బేరర్ చెక్ (Bearer cheque): సాధారణంగా, మనం బేరర్ చెక్‌ను ఎక్కువగా చూస్తాం, డబ్బును చెల్లించడానికి దీనిని ఉపయోగిస్తారు. చెక్‌పై పేరు ఉన్న వ్యక్తి నగదుగా మార్చుకునేందుకు వీలు కల్పించే చెక్ ఇది. బేరర్ చెక్కును 'పేయబుల్ టు బేరర్' చెక్ అని కూడా అంటారు.
2. ఆర్డర్ చెక్ (Order check): చెల్లింపుదారు పేరు తర్వాత "ఆర్ టు ఆర్డర్" అని రాసి ఉన్న చెక్ ఇది. దీనిని "పేయబుల్ టు ఆర్డర్" చెక్ అని కూడా పిలుస్తారు.
3. క్రాస్డ్ చెక్ (Crossed cheque): చెక్ జారీ చేసే వ్యక్తి "a/c పేయీ" అని రాసి, చెక్ పైమూల భాగంలో ఐమూలగా రెండు సమాంతర గీతలు గీస్తాడు. ఈ చెక్‌ను జారీ చేసిన వ్యక్తి బ్యాంక్‌లో, చెక్ మీద పేరు ఉన్న వ్యక్తి మాత్రమే కాకుండా ఎవరైనా సబ్మిట్ చేయొచ్చు. అయితే, చెక్‌లో పేరు ఉన్న వ్యక్తి ఖాతాలో మాత్రమే డబ్బు జమ చేస్తారు. క్రాస్డ్ చెక్ ప్రయోజనం ఏమిటంటే, అనధికార వ్యక్తి దీనిని క్యాష్ చేసుకునే ప్రమాదాన్ని నివారిస్తుంది.
4. ఓపెన్ చెక్ (Open Check): ఓపెన్ చెక్‌లను అన్‌క్రాస్డ్ చెక్‌లు అని కూడా అంటారు. క్రాస్ చేయని చెక్ ఓపెన్ చెక్ కేటగిరీ కిందకు వస్తుంది. ఈ చెక్‌ను బ్యాంక్‌లో సమర్పించినప్పుడు, దానిని సమర్పించిన వ్యక్తికి డబ్బు చెల్లిస్తారు.
5. పోస్ట్ డేటెడ్ చెక్ (Post-dated cheque): జారీ చేసిన తేదీన కాకుండా, ఆ తర్వాతి కాలంలో క్యాష్‌గా మార్చుకునేందుకు జారీ చేసే చెక్‌ను పోస్ట్-డేటెడ్ చెక్ అంటారు. ఈ చెక్కును జారీ చేసిన తర్వాత ఎప్పుడైనా బ్యాంక్‌కు సమర్పించవచ్చు. అయితే, చెక్కుపై పేర్కొన్న తేదీ లోపులో చెల్లింపుదారు ఖాతా నుంచి నిధులు బదిలీ జరగదు.
6. స్టేల్ చెక్ (Stale Check): చెల్లుబాటు వ్యవధి ముగిసిన చెక్ ఇది, ఇప్పుడు ఎన్‌క్యాష్ చేయడం సాధ్యం కాదు. ఒకప్పుడు, ఈ వ్యవధి చెక్ జారీ చేసిన తేదీ నుంచి ఆరు నెలలు ఉండేది, ఇప్పుడు మూడు నెలలకు తగ్గించారు.
7. ట్రావెలర్స్ చెక్ (Traveller's cheque): ఇది, ప్రపంచవ్యాప్తంగా ఆమోదం ఉన్న & కరెన్సీకి మారోరూపంగా గుర్తింపు ఉన్న చెక్. ట్రావెలర్స్ చెక్ దాదాపు ప్రతిచోటా అందుబాటులో ఉంటుంది, వివిధ డినామినేషన్లలో వస్తుంది. ఒక వ్యక్తి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లినప్పుడు చెల్లింపులు చేయడానికి వీలుగా నేరుగా బ్యాంక్ జారీ చేసే చెక్కు. ట్రావెలర్స్ చెక్‌కు ముగింపు గడువు తేదీ ఏదీ ఉండదు, తదుపరి పర్యటన సమయంలోనూ ఉపయోగించవచ్చు. ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత దాన్ని ఎన్‌క్యాష్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
8. సెల్ఫ్ చెక్ (Self Check): ఒక వ్యక్తి తనకు తాను జారీ చేసుకునే చెక్ ఇది. పేరు దగ్గర "సెల్ఫ్" అని రాస్తారు. ఒక వ్యక్తి, తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బు తీసుకోవడానికి సెల్ఫ్ చెక్ రాసుకుంటాడు.
9. బ్యాంకర్స్ చెక్ (Bankers cheque): ఖాతాదారుని తరపున, అదే నగరంలో ఉన్న మరొక వ్యక్తికి నిర్దిష్ట మొత్తంలో డబ్బు చెల్లించాలనే ఆర్డర్‌తో నేరుగా బ్యాంక్ జారీ చేసే చెక్ ఇది.
మరో ఆసక్తికర కథనం: దొంగిలించిన ఐఫోన్‌లు ఎక్కడికి వెళ్తాయి? వాటిని ఎవరు, ఎలా ఉపయోగిస్తారు?