Stolen iPhones Are Taken To China: ఆపిల్‌ కంపెనీ తయారు చేసే ఐఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా డైహార్డ్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు. దాని క్వాలిటీ, ఫీచర్లు అలాంటివి. మిగిలిన అన్ని బ్రాండ్స్‌ ఒక ఎత్తయితే, ఐపిల్‌ మాత్రమే మరొక ఎత్తు. ఐఫోన్‌ మోడళ్ల ఖరీదు కూడా అదే స్థాయిలో ఉంటుంది. ప్రపంచంలో, ఎక్కువ మంది కొంటున్న & ఎక్కువ దొంగతనానికి గురవుతున్న ఫోన్‌ బ్రాండ్లలో ఐఫోన్‌ ముందంజలో ఉంటోంది. అయితే, దొంగిలించిన ఐఫోన్‌ను ఏం చేస్తారు అని కొంతమంది ప్రశ్నించవచ్చు. ఎందుకంటే, ఐఫోన్ భద్రత లక్షణాలు బలంగా ఉంటాయి. పేరు మోసిన టెక్నీషియన్లు కూడా దానిని అన్‌లాక్‌ చేయలేరు. ఫోన్ అన్‌లాక్ కాకపోతే, దొంగ మాత్రం దానిని ఏం చేసుకుంటాడు?.


కొన్ని నివేదికల ప్రకారం, దొంగిలించిన ఐఫోన్‌లను మన పొరుగు దేశం చైనాకు పంపిస్తారు. చైనాలోని షెన్‌జెన్‌ నగరానికి చోరీ ఐఫోన్లు (Stolen iphones) వెళతాయి. అక్కడ, ఐఫోన్‌ టెక్నీషియన్లు ఉంటారు. వాళ్లు, మొదట ఐఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఐపోన్‌ అన్‌లాక్‌ అయితే, దాని పిన్‌ మార్చి, డేటా చెరిపేసి, సెకండ్‌ హ్యాండ్‌ గూడ్‌ కింద అమ్ముతారు. ఒకవేళ, ఐఫోన్‌ అన్‌లాక్‌ కాకపోతే, దానిని విప్పదీసి విడిభాగాలను తొలగించి, మార్కెట్‌లో విక్రయిస్తారు.


చైనా సిలికాన్ వ్యాలీలో చీకటి కోణం
షెన్‌జెన్‌ నగరాన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ చైనా అని కూడా పిలుస్తారు. ఇది చైనాలో ప్రధాన సాంకేతికత కేంద్రం. ఇక్కడ అత్యంత భారీ సంఖ్యలో MSMEలు (Micro, Small and Medium Enterprises), సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి. ఇది నాణేనికి ఒకవైపు అయితే, రెండో వైపున ఐఫోన్ల స్మగ్లింగ్‌ చీకటి కనిపిస్తుంది. చైనాతో పాటు, ప్రపంచంలోని వివిధ నగరాల్లో దొంగిలించిన ఐఫోన్లు ఇక్కడకు చేరుకుంటాయి. ఐఫోన్లలోని ఒరిజినల్‌ విడిభాగాలు ఇక్కడి షాపింగ్ మాల్స్ & ఇతర షాపులలో చాలా సులభంగా, తక్కువ ధరకు లభిస్తాయి. ప్రపంచ నగరాల్లో దొంగిలించిన ఐఫోన్‌లను సముద్రం ద్వారా షెన్‌జెన్‌కు రవాణా చేస్తారు. 



ఆపిల్‌ భద్రత వలయాన్ని ఛేదించడం కష్టం     
ఆపిల్‌ బలమైన భద్రత వలయం కారణంగా ఐఫోన్‌లోకి బలవంతంగా చొరబడటం కష్టం అవుతుంది. ఎవరైనా అలా చొరబడటానికి ప్రయత్నిస్తే అతనిని ట్రాక్ చేయవచ్చు. ఈ కారణంగా, దొంగిలించిన ఐఫోన్లను బలవంతంగా ఓపెన్‌ చేయరు. లాక్‌ ప్యాట్రన్‌ కనిపెట్టి ఓపెన్‌ చేస్తారు లేదా విడిభాగాలు తీసి విక్రయిస్తారు. ఈ కారణంగా, దొంగిలించిన ఐఫోన్‌ను, దొంగను ట్రాక్ చేయడం సాధ్యం కాదు. వాస్తవానికి, ఐఫోన్‌ విడిభాగాలు ఖరీదైనవి. కాబట్టి, దొంగిలించిన ఐఫోన్‌ నుంచి విడిభాగాలను వేరు చేసి విక్రయించడం కూడా దొంగలకు లాభసాటిగా మారింది. ఐఫోన్ నుండి ఏదైనా భాగాన్ని తొలగించడం ప్రమాదకరంగా మారినా లేదా కష్టమైనా, ఆ భాగంలోని మెటీరియల్ కరిగించి ఉపయోగించుకుంటారు. షెన్‌జెన్‌లో ఇలాంటి ఛోర్‌ బజార్‌లు చాలా ఉన్నాయని రిపోర్ట్స్‌ చెబుతున్నాయి.


మరో ఆసక్తికర కథనం: డబ్బులు సంపాదించే ట్రిక్‌ - ఈ బడా ఇన్వెస్టర్ల సీక్రెట్‌ ఎవరూ మీకు చెప్పి ఉండరు!