Right Investment Tips: సంపద పెంచుకోవడానికి పెట్టుబడి పెట్టడం ముఖ్యం. ఇన్వెస్ట్ చేయగానే సరిపోదు, దానిలో వృద్ధిని కొలవడం కూడా అంతే కీలకం. మీ లక్ష్యాలకు అనుగుణంగా మీ వ్యూహాలను సర్దుబాటు చేయడానికి ఇది మీకు దిశానిర్దేశం చేస్తుంది. అయితే, మీరు పెట్టుబడి వృద్ధిని ఖచ్చితంగా ఎలా కొలుస్తారు?. దీని కోసం "కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్" (CAGR) ఉంది. బడా ఇన్వెస్టర్లు దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది, పెట్టుబడి వార్షిక వృద్ధిని కొలుస్తుంది. మీరు మ్యూచువల్ ఫండ్‌లు, షేర్లు లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టినా, మీ పెట్టుబడిలో నిజమైన వృద్ధిని అంచనా వేయడానికి CAGR మీకు సహాయపడుతుంది.
CAGR ఎలా లెక్కిస్తారు?
CAGRని లెక్కించడానికి సూత్రం (FV/PV)1/n-1. ఇక్కడ, 'FV' అనేది పెట్టుబడి తుది విలువ, 'PV' అనేది పెట్టుబడి ప్రారంభ విలువ. 'n' అనేది పెట్టుబడిని ఉంచిన సంవత్సరాల సంఖ్యను (లేదా కాలం) సూచిస్తుంది. ఉదాహరణకు, మీరు రూ.1 లక్ష పెట్టుబడి పెట్టారు, అది మూడేళ్లలో రూ.1,40,493 అయిందనుకోండి. ఈ పెట్టుబడి నిజమైన వృద్ధిని CAGR చూపుతుంది. ఇక్కడ CAGR = (100000/1,40,493)1/3-1 = 12 శాతం. అంటే మీ పెట్టుబడి ఏడాదికి 12 శాతం చొప్పున పెరిగింది. CAGR, మీ పెట్టుబడి వార్షిక వృద్ధికి సంబంధించిన స్పష్టమైన పిక్చర్ చూపుతుంది. పెట్టుబడి పనితీరును అంచనా వేయడంతో పాటు ద్రవ్యోల్బణాన్ని మించి రిటర్న్ ఇచ్చిందో, లేదో తెలుసుకోవడాన్ని సులభంగా మారుస్తుంది.
సింపుల్ రిటర్న్స్ కంటే CAGR ఎందుకు ఉపయోగించాలి?
CAGR మీ పెట్టుబడిపై చక్రవడ్డీ రాబడిని ప్రతిబింబిస్తుంది. మీరు మీ లాభాలను తిరిగి పెట్టుబడిగా పెడితే, మీ డబ్బు కాలక్రమేణా మీరు ఊహించనంత వేగంగా పెరుగుతుంది, CAGR దీనికి ఉపకరిస్తుంది. కానీ సాధారణ రాబడిలో ఇది ఉండదు.
మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి CAGR ఒక కీలకమైన మెట్రిక్. ఉదాహరణకు, మీరు ఆరేళ్లలో మీ మూలధనాన్ని రెట్టింపు చేయాలని భావిస్తే, దాదాపు 12 శాతం CAGR వచ్చేలా పెట్టుబడి పెట్టాలి. 12 శాతం CAGRను ఇవ్వగల పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవాలి. దీనిని అర్థం చేసుకుంటే మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవచ్చు.
CAGR - చక్రవడ్డీ మధ్య వ్యత్యాసం
పెట్టుబడి విషయాలలో, CAGR లాగే చక్రవడ్డీ (Compound Interest)కి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. కాలం గడిచే కొద్దీ మీ పెట్టుబడులు ఎలా పెరుగుతాయో అర్థం చేసుకోవడానికి ఇవి సాయపడతాయి. వీటి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం అనేది ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో కీలకమైన దశ. పెట్టుబడులకు వర్తించే విధానంలో ఈ రెండింటికి తేడా ఉంటుంది.
CAGR | చక్రవడ్డీ | |
నిర్వచనం | పెట్టుబడి వార్షిక వృద్ధి రేటును కొలుస్తుంది, కాంపౌండింగ్ ప్రభావాన్ని చూపుతుంది. | ప్రారంభ మూలధనంపై వడ్డీతో పాటు గతంలో వచ్చిన వడ్డీపై సంపాదించిన వడ్డీని చూపుతుంది. |
ప్రయోజనం | మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లేదా పోర్ట్‌ఫోలియోల వంటి పెట్టుబడుల పనితీరును అంచనా వేయడానికి, సరిపోల్చడానికి సాయపడుతుంది. | ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పొదుపులు, రుణ వ్యయాల్లో పెరుగుదలను లెక్కించడానికి ఉపయోగిస్తారు. |
ఫ్లెక్సిబిలిటీ | ఒకే వార్షిక వృద్ధి రేటును సూచిస్తుంది, కాలక్రమేణా వచ్చే హెచ్చుతగ్గులను పట్టించుకోదు | రోజువారీ, నెలవారీ లేదా వార్షికం వంటి వివిధ కాల వ్యవధులను లెక్కిస్తుంది. |
అనుకూలత | స్థిరంగా ఉండకుండా కాలక్రమేణా రాబడులు మారుతూ ఉండే దీర్ఘకాలిక పెట్టుబడులకు ఉత్తమం. | స్థిరమైన రాబడిని ఇచ్చే పెట్టుబడులకు అనువైనది. |
భారతదేశంలో వినియోగం | మ్యూచువల్ ఫండ్‌ల పనితీరు, సంపద వృద్ధి వ్యూహాలను విశ్లేషించడంలో ఫేమస్ అయింది. | ఫిక్స్‌డ్ డిపాజిట్ రాబడులు, పొదుపుల వృద్ధి, రుణ చెల్లింపులను నిర్ణయించడానికి విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. |
CAGR అనేది మీ పెట్టుబడుల వృద్ధిని ట్రాక్ చేయడానికి సులభమైన & శక్తివంతమైన సాధనం. వివిధ పెట్టుబడులను సరిపోల్చేటప్పుడు రాబడులను మాత్రమే చూడడం మానేయండి. మీ డబ్బు నిజంగా ఎలా పెరుగుతోందో అర్థం చేసుకోవడానికి CAGRని కూడా లెక్కించండి. పెట్టుబడి విషయాల్లో మీ అవగాహన మెరుగ్గా ఉంటే, డబ్బు మీ కోసం పని చేసేలా మీరు చేయగలరు.
మరో ఆసక్తికర కథనం: ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ విషయాలను విస్మరిస్తున్నారా?, లక్షలాది రూపాయలు నష్టం!