Home Construction Tips For Saving Money: సొంత ఇల్లు ఉండడం ప్రజలందరి కల. ఈ కలను సాకారం చేసుకునేందుకు, కొంతమంది భూమిని కొని ఇల్లు కట్టుకుంటారు. డ్రీమ్‌ హోమ్‌ను తమకు ఇష్టమైన రీతి డిజైన్‌ చేసుకుంటారు. దీనికోసం లక్షలు, కోట్ల రూపాయలు సైతం ఖర్చు పెట్టేందుకు వెనుకడుగు వేయడం లేదు. అయితే, ఇంటి నిర్మాణ సమయంలో ప్రజలు పట్టించుకోని కొన్ని విషయాలు ఉంటాయి. ఇల్లు కట్టే సమయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే లక్షల రూపాయలు ఆదా అవుతాయి.


ఆర్కిటెక్చర్‌ నుంచి ఇంటి ప్లాన్‌
మీరు, మీ ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించే ముందు, ఖచ్చితంగా ఆర్కిటెక్చర్‌ను సంప్రదించండి. మీ స్థలం కొలతలను బట్టి, ఆర్కిటెక్చర్‌ మీ ఇంటికి సరైన డిజైన్‌ తయారు చేసి ఇస్తాడు. కొత్త ఇంట్లో ఏ గది ఎంత వైశాల్యంతో ఉండాలి, హాల్‌ ఎక్కడ ఉండాలి, గ్యాలరీ ఎక్కడ ఉంటుంది, వాష్‌రూమ్‌లు ఎక్కడ ఉంటాయి, ఇతర నిర్మాణాలను ఎక్కడ పూర్తి చేయాలి వంటి విషయాలన్నీ ఆర్కిటెక్చర్‌ ఇచ్చే ప్లాన్‌లో ఉంటాయి. దీనివల్ల మీ ఇంటి స్థలాన్ని సంపూర్ణంగా & సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. మీ ఇంటిని ముందుగానే వ్యవస్థీకృత పద్ధతిలో నిర్మిస్తే, ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు ఎలాంటి మార్పులు చేయనవసరం రాదు. ఫలితంగా మీకు చాలా డబ్బులు మిగులుతాయి.


నైపుణ్యం కలిగిన కార్మికులు
మార్కెట్‌లో ఒక వస్తువు వెయ్యి రూపాయలకు దొరుకుతుంది, అలాంటి వస్తువే వంద రూపాయలకు కూడా దొరుకుతుంది. రెండింటి ధరల్లో తేడాను నిర్ణయించేది ఆ వస్తువు 'నాణ్యత'. ఎక్కువ కాలం ఉపయోగపడే నాణ్యమైన వస్తువు కావాలంటే ఎక్కువ ధర చెల్లించాలి. ఇంటి నిర్మాణంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రస్తుతం, మార్కెట్‌లో, ఒకే పనిని చేసే కార్మికులు చాలామంది ఉన్నారు. పనితీరులో నైపుణ్యాన్ని బట్టి వాళ్లకు చెల్లించే ధర మారుతుంది. మీ డ్రీమ్‌ హౌస్‌ ఎక్కువ కాలం మన్నికగా, సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా ఉండాలంటే, నైపుణ్యం కలిగిన కార్మికులతోనే పని చేయించండి. ఎందుకంటే ఇంట్లో ఎక్కడ, ఎన్ని వసతులు అవసరమో వాళ్లకు తెలుసు. దేనికి ఎంత ముడిసరుకు అవసరమో నైపుణ్యం కలిగిన కార్మికులు సరిగ్గా అంచనా వేస్తారు. అలాంటి వ్యక్తులు మీ ఇంటి కోసం పని చేస్తే ముడిసరుకు వృథా కాదు. ఈ రూపంలో మీకు డబ్బు సేవ్‌ అవుతుంది.


నాణ్యమైన మెటీరియల్
ఇటుకలు, సిమెంట్, ఇనుము, ఉక్కు, ఇసుక, గ్లాస్‌, ప్లాస్టిక్‌ వంటి వాటిని ఇంటి నిర్మాణంలో వినియోగిస్తారు. వీటితో పాటు లైట్లు, ఫ్యాన్లు, వాటర్‌ ట్యాప్‌లు, చిమ్నీ, గీజర్‌ వంటి ఇతర గృహోపకరణాలు కూడా అవసరమవుతాయి. వీటిని కొనుగోలు చేసే సమయంలో నాణ్యతపై ఎప్పుడూ రాజీపడొద్దు. డబ్బులు మిగుల్చుకోవడానికి తక్కువ ధరలో దొరికే వస్తువులను కొంటే, ఆ తర్వాత రిపేర్ల కోసం ఖర్చు పెట్టి నష్టపోతారు. మంచి నాణ్యమైన మెటీరియల్‌ను ముందుగానే కొనుగోలు చేయడం ద్వారా భవిష్యత్‌ ఖర్చులను, చాలా సమయాన్ని మీరు ఆదా చేసుకోవచ్చు.


ప్లంబింగ్ & ఎలక్ట్రికల్ పనులు
ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులు ప్రతి ఇంటికి చాలా కీలకమైన విషయాలు. వీటిలో ఏదైనా లోపం ఉంటే ఇంటి గోడలను పగులగొట్టాల్సి వస్తుంది. అది మీకు ఖర్చు తెచ్చి పెట్టడమే కాదు, మీ దైనందిన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది, మెంటల్‌ టెన్షన్‌ పెంచుతుంది. అందుకే, ఇల్లు నిర్మించే సమయంలోనే ప్లంబింగ్ & ఎలక్ట్రికల్ పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.


కొంతమంది, ఇంటి నిర్మాణాన్ని ఒక కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. అతను డబ్బులు మిగుల్చుకోవడానికి నాణ్యత లేకుండా పనులు చేయించొచ్చు. కాబట్టి, సమయం కుదుర్చుకుని, మీ ఇంటిని మీరే దగ్గరుండి కట్టించుకోవడం ఉత్తమం. ఒకవేళ కాంట్రాక్టర్‌కు అప్పగించినా, ఇంటి నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ ఉండాలి.


మరో ఆసక్తికర కథనం: పాన్ 2.0 QR కోడ్‌ ప్రత్యేకత ఏంటి, పాత పాన్ కార్డ్‌ ఇక పనికిరాదా?