PAN Card Rules: మన దేశంలో, ఆర్థిక కార్యకలాపాలు చేసేందుకు అతి కీలక గుర్తింపు పత్రం పాన్ కార్డ్. ఇది లేకపోతే చాలా పనులు నిలిచిపోతాయి. బ్యాంక్‌ అకౌంట్‌ (Bank Account) ఓపెన్‌ చేయలేరు, పెట్టుబడులు (Investment) పెట్టలేరు, ఐటీ రిటర్న్‌ (ITR Filing) కూడా దాఖలు చేయలేరు. బ్యాంక్‌ లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి రూపాయి కూడా రుణం (Bank Loan) పుట్టదు. దేశంలోని ప్రతి వ్యక్తికి, ఈ పనుల్లో కనీసం ఒక్కటైనా అవసరం పడుతుంది. కాబట్టి, ఆదాయ పన్ను విభాగం జారీ చేసే పాన్ కార్డ్ దాదాపు అన్ని ఆర్థిక లావాదేవీల నిర్వహణకు కీలకం. 


భారత ప్రభుత్వం, ఇటీవల, పాన్ 2.0 ప్రాజెక్ట్‌ను (PAN 2.0 Project) ప్రారంభించింది. దీని కింద, ఇప్పుడు, పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసిన వ్యక్తులకు క్యూఆర్‌ కోడ్‌తో కొత్త రూపంలో పాన్‌ కార్డ్‌ను (New PAN Card With QR Code) జారీ చేస్తారు. 


పాన్‌ కార్డ్‌పై ఉండే QR కోడ్‌ ప్రత్యేకత ఏంటి?
PAN 2.0 ప్రాజెక్ట్‌ కింద ఆదాయ పన్ను విభాగం  (Income Tax Deportment) జారీ చేసే పాన్ కార్డులు కొత్తగా & పాత పాన్ కార్డ్ కంటే భిన్నంగా ఉంటాయి. కొత్త కార్డ్‌లపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఒక విధంగా చూస్తే, కొత్త పాన్‌ కార్డ్‌ మీద ఉండే  QR కోడ్ లక్షణాలు ఆధార్ కార్డ్‌ (Aadhar Card) మీద ఉండే QR కోడ్‌ లక్షణాలను పోలి ఉంటాయి. పాన్‌ కార్డ్‌ QR కోడ్‌ని స్కాన్ చేస్తే ఆ కార్డ్ హోల్డర్ గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది. 


కొత్త పాన్ కార్డును డిజిటల్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీంతో పాన్ కార్డు భద్రత పెరుగుతుంది. అంటే మీ పాన్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. మీ ఫోన్ నుంచి దాని కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా ఏదైనా ఆర్థిక లావాదేవీని పూర్తి చేయవచ్చు. కొత్త పాన్ కార్డును వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను కూడా సిద్ధం చేస్తోంది.


పాత పాన్ కార్డులు పనికిరావా?
పాత కార్డ్‌ ఉన్నప్పటికీ పాన్ 2.0 ప్రాజెక్ట్‌ కింద కచ్చితంగా కొత్త కార్డ్‌ తీసుకోవాలా, పాత పాన్ కార్డ్‌ ఇక పనికిరాదా, పాత కార్డులను ప్రభుత్వం రద్దు చేస్తుందా అనే ప్రశ్నలు ప్రజల నుంచి తరచూ వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం చాలామంది గూగుల్‌ తల్లిని అడుగుతున్నారు. వాస్తవానికి, మీ దగ్గర పాత పాన్‌ కార్డ్‌ ఉంటే PAN 2.0 కింద కొత్త పాన్‌ కార్డ్‌ తీసుకోవాల్సి అవసరం లేదు. మీ దగ్గర ఇప్పటికే ఒక పాన్‌ కార్డ్‌ ఉన్నప్పటికీ, మీరు కొత్త కార్డ్‌ తీసుకోవాలనుంటే తీసుకోవచ్చు. పాత పాన్‌ కార్డ్‌ మీద ఉండే నంబర్‌తోనే కొత్త పాన్‌ కార్డ్‌ జారీ అవుతుంది. అంటే, పాతవాళ్లు కొత్త పాన్‌ కార్డ్‌ తీసుకుంటే కొత్త నంబర్‌ రాదు. మీ పాత పాన్ కార్డ్ కూడా మునుపటిలాదే పని చేస్తూనే ఉంటుంది. మరొక విషయం.. కేంద్ర ప్రభుత్వమే ప్రజలందరికీ పాన్ 2.0ను ఉచితంగా అందజేస్తుంది. దీని కోసం ఎవరూ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. 


మరో ఆసక్తికర కథనం: కొత్త ఉద్యోగంలో చేరిన ఎన్ని రోజుల తర్వాత పాత PF అకౌంట్‌ నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు?