PF Account Rules In New Job: భారతదేశంలో, సంఘటిత రంగంలో పని చేసే దాదాపు ప్రతి ఒక్కరికి భవిష్య నిధి ఖాతా (Provident Fund Account) ఉంటుంది. ఉద్యోగి, తన జీతంలో 12 శాతాన్ని ఈపీఎఫ్ ఖాతాలో (EPF Account) జమ చేస్తాడు. అంతే మొత్తాన్ని కంపెనీ యాజమాన్యం కూడా జమ చేస్తుంది. PF ఖాతా పొదుపు ఖాతా తరహాలో పని చేస్తుంది. అత్యవసర సందర్భాల్లో ఈ అకౌంట్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగులు EPFO ​నుంచి ఈ సదుపాయాన్ని పొందుతారు. వివిధ అవసరాలకు అనుగుణంగా పీఎఫ్‌ ఖాతా నుంచి పాక్షికంగా డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి EPFO అనుమతిస్తుంది.


చాలామంది, ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ ఉద్యోగులు స్థిరంగా ఒకే కంపెనీలో పని చేయరు. ఎక్కువ జీతం, పెద్ద స్థాయి లేదా ఇతర కారణాలతో కంపెనీలు మారుతుంటారు. కొత్త కంపెనీలో చేరగానే అక్కడ మరో పీఎఫ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేస్తారు. గతంలో పని చేసిన సంస్థలో పీఎఫ్ ఖాతా కూడా అలాగే ఉంటుంది. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీలోకి మారిన తర్వాత, ఎన్ని రోజులకు పాత పీఎఫ్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చన్నది చాలా మంది ఉద్యోగుల్లో మెదిలే ప్రశ్న.


ఎన్ని రోజుల తర్వాత PF డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు?
ఎంప్లాయి ప్రావిడెంట్‌ ఫండ్‌ అకౌంట్‌కు సంబంధించిన నియమాలను EPFO నిర్ణయిస్తుంది. పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసే రూల్స్‌ను కూడా నిర్ణయించింది. ఒక వ్యక్తి, ఒక ఉద్యోగం విడిచిపెట్టిన ఒక నెల రోజుల లోపు మరొక ఉద్యోగంలో జాయిన్‌ అయితే, అతను పాత పీఎఫ్‌ ఖాతా నుంచి డబ్బు తీసుకోలేడు. ఒకవేళ, అతను ఉద్యోగం విడిచిపెట్టిన తేదీ నుంచి నెల రోజుల వరకు మరొక ఉద్యోగంలో చేరకపోతే అతనిని నిరుద్యోగిగా పరిగణిస్తారు. అతని కుటుంబ అవసరాలు తీరేందుకు, పాత PF ఖాతా నుంచి గరిష్టంగా 75% డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ, అతను పాత ఉద్యోగం మానేసిన తేదీ నుంచి రెండు నెలల పాటు నిరుద్యోగిగా ఉంటే, పీఎఫ్‌ ఖాతాలో మిగిలిన 25% మొత్తాన్ని కూడా వెనక్కు తీసుకోవచ్చు. నిరుద్యోగిగా మారిన నెల రోజుల తర్వాత ఒక్క రూపాయి కూడా తీసుకోకపోతే, రెండు నెలల తర్వాత మొత్తం 100% డబ్బును ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు.  


కొత్త ఉద్యోగంలో చేరిన తర్వాత చేయాల్సిన పని
PF ఖాతాదారుడు తన ఉద్యోగాన్ని విడిచిపెట్టిన నెల రోజుల లోపు మరొక ఉద్యోగంలో చేరితే అతని UAN (Universal Account Number) యాక్టివ్‌గా ఉంటుంది. కాబట్టి పాత ఉద్యోగానికి సంబంధించిన పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేయలేడు. దీనికి బదులుగా అతను తన పాత కంపెనీలోని PF ఖాతాను కొత్త కంపెనీ కిందకు బదిలీ చేయాలి. ఇలా చేస్తేనే అత్యవసర సందర్భాల్లో విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి దొరుకుతుంది. 


ఒక ఉద్యోగం విడిచిపెట్టిన తర్వాత మరొక ఉద్యోగంలో చేరడానికి రెండు నెలలు లేదా ఇంకా ఎక్కువ సమయం తీసుకున్న సందర్భంలో.. అతనికి ఇష్టమైతేనే పాత పీఎఫ్‌ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. కొత్త ఉద్యోగంలో చేరడానికి రెండు నెలల కంటే ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ, కొత్త కంపెనీలో చేరిన తర్వాత పాత పీఎఫ్‌ ఖాతాను కొత్త కంపెనీ కిందకు ట్రాన్స్‌ఫర్‌ చేసి యథావిధిగా కొనసాగించవచ్చు. ఎన్ని ఉద్యోగాలు మారినా ఇలాగే చేయవచ్చు. పీఎఫ్‌ ఖాతా నుంచి డబ్బు వెనక్కు తీసుకోకుండా, ఉద్యోగం మారినప్పుడల్లా కొత్త కంపెనీ కిందకు మారుస్తూ దీర్ఘకాలం పాటు కొనసాగించడం వల్ల, రిటైర్మెట్‌ నాటికి పెద్ద మొత్తంలో డబ్బు పోగవుతుంది.


మరో ఆసక్తికర కథనం: మీ బ్యాంక్‌ అకౌంట్‌లో ఇంతకుమించి డబ్బు జమ చేస్తే చిక్కులు తప్పవు!