UPI Lite Transaction Limit: కొన్నేళ్ల క్రితం, మన దేశంలో ఓ వ్యక్తి ఏదైనా వస్తువు లేదా సేవను కొంటే, దాని కోసం నేరుగా డబ్బులు చెల్లించేవాళ్లు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వంటి ఆన్‌లైన్ పద్ధతుల్లో చెల్లింపులకు అవకాశం ఉన్నప్పటికీ, మెజారిటీ ఆర్థిక కార్యకలాపాలు భౌతిక నగదుతోనే (Physical Cash) నడిచేవి. 2016 సంవత్సరంలో UPI (Unified Payments Interface) రంగ ప్రవేశం చేసింది, భారతదేశ చెల్లింపుల వ్యవస్థలో గేమ్ ఛేంజర్‌గా మారింది. అప్పటి నుంచి ప్రజలు తమ జేబులో నగదును తీసుకెళ్లడం దాదాపుగా తగ్గించారు. ఇప్పుడు, ప్రజలు ఏదైనా కొనుగోలు చేసినప్పుడు లేదా ఎవరికైనా డబ్బులు పంపాల్సి వచ్చినప్పుడు UPIని ఉపయోగిస్తున్నారు. యూపీఐ వినియోగంలోని సౌలభ్యం, డబ్బు చెల్లింపుల్లో వేగం వల్ల ఇది ప్రజల దైనందిన జీవితంలో ఒక భాగంగా మారింది.
ఇప్పుడు, 2024లోకి వస్తే, ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు మొత్తం 15,547 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ లావాదేవీల మొత్తం విలువరూ. 223 లక్షల కోట్లగా వెల్లడించింది. యూపీఐ వచ్చిన ఆరేళ్ల తర్వాత, చెల్లింపుల వ్యవస్థలో మరింత సౌలభ్యం కోసం యూపీఐ లైట్ (UPI Lite)ను 2022 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. చిన్న లావాదేవీలను యూపీఐ కంటే సులభంగా చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) దీనిని ప్రారంభించింది.
యూపీఐ లైట్ అంటే ఏమిటి?
ఇది ఆన్‌లైన్ మనీ వాలెట్‌లా పని చేస్తుంది. ఇందులోకి ముందుగానే కొంత నగదును బదిలీ చేయాలి. UPI సాయంతో కూడా ఇలా నగదు బదిలీ చేయవచ్చు. ఆ తర్వాత మీరు చిన్న లావాదేవీల కోసం యూపీఐ లైట్‌ని ఉపయోగించవచ్చు. మీరు బయటికెళ్లి ఏదైనా టిఫిన్ చేసినా, పాలు, పెరుగు, పండ్లు, ఏదైనా ఇతర చిన్న వస్తువులను కొనుగోలు చేసినా, సులభమైన చెల్లింపుల కోసం యూపీఐ లైట్‌ను ఉపయోగించవచ్చు. వీటి కోసం యూపీఐ ఉందిగా, యూపీఐ లైట్ ఎందుకు అన్న సందేహం మీకు రావచ్చు. యూపీఐ కంటే యూపీఐ లైట్ ఎందుకు మరింత సౌలభ్యంగా ఉంటుందో తెలియాలంటే, దాని ఫీచర్ల గురించి మీకు తెలియాలి.
UPI లైట్ ఫీచర్లు ఇవీ..
యూపీఐని ఉపయోగించడానికి మీకు ఇంటర్నెట్ అవసరం. కానీ యూపీఐ లైట్‌ని ఉపయోగించడానికి ఇంటర్నెట్ అవసరం లేదు. యూపీఐని ఉపయోగించడానికి మీరు యూపీఐ పిన్ (UPI PIN) ఎంటర్ చేయాలి. కానీ, యూపీఐ లైట్‌ని ఉపయోగించడానికి మీరు PIN ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. యూపీఐ లైట్‌కు e-KYC అవసరం లేదు. లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు కాబట్టి, మారుమూల ప్రాంతాల్లోనే ప్రజలకు ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది.
యూపీఐ లైట్‌లో లావాదేవీ పరిమితి
రెండేళ్ల క్రితం, యూపీఐ లైట్‌ను ప్రారంభించినప్పుడు, వాలెట్ పరిమితి కేవలం రూ. 2,000 మాత్రమే ఉండేది. ఇప్పుడు, ఆ పరిమితిని రూ. 5,000కు పెంచారు. అంటే మీరు మీ యూపీఐ లైట్ వాలెట్‌లో రూ. 5000 వరకు బ్యాలెన్స్ ఉంచుకోవచ్చు. ఇంతకు ముందు మీరు ఒక లావాదేవీలో 100 రూపాయల వరకు మాత్రమే చెల్లించగలిగేవాళ్లు. ఇప్పుడు ఆ పరిమితిని 1,000 రూపాయలకు పెంచారు. అంటే, ఒకేసారి మీరు రూ. 1,000 వరకు చెల్లించవచ్చు. అంతేకాదు, యూపీఐ లైట్ ద్వారా ఒక రోజులో (UPI lite per day transaction limit) మొత్తం రూ. 4,000 వరకు చెల్లించవచ్చు.
మరో ఆసక్తికర కథనం: యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్ - SMS వస్తే మీ ఖాతా నుంచి డబ్బులు కట్