Changes In Income Tax Rules in 2024: ఈ సంవత్సరం (2024), ఆదాయ పన్ను చట్టంలో చాలా కీలక మార్పులు జరిగాయి. దీనివల్ల, 2025 సంవత్సరంలో ఐటీఆర్ ఫైల్ చేసే విధానం కూడా మారిపోయింది. ఆదాయ పన్ను చట్టం నియమాల్లో వచ్చిన 10 ప్రధాన మార్పుల గురించి మీరు తెలుసుకుంటే.. భవిష్యత్తులో ఆదాయ పన్ను రిటర్న్‌ (ITR Filing) దాఖలు చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురుకావు.


ఈ ఏడాది ఇన్‌కమ్‌ టాక్స్‌ రూల్స్‌లో వచ్చిన 10 ప్రధాన మార్పులు


ఆదాయ పన్ను శ్లాబులో మార్పు
2024 కేంద్ర బడ్జెట్‌లో (Union Budget 2024), ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) ఆదాయ పన్ను శ్లాబ్‌లో మార్పులను ప్రకటించారు. కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వార్షిక ఆదాయంపై 5 శాతం పన్ను విధించారు. రూ.7 నుంచి రూ.10 లక్షల ఆదాయంపై 10 శాతం పన్ను, రూ.10 నుంచి రూ.12 లక్షల ఆదాయంపై 15 శాతం పన్ను ప్రతిపాదించారు. రూ.12 నుంచి రూ.15 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం, రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం పన్ను ఉంటుంది. ఈ మార్పును సద్వినియోగం చేసుకుంటే, జీతం పొందే ఉద్యోగులు సంవత్సరానికి రూ.17,500 వరకు ఆదాయ పన్నును ఆదా చేయగలుగుతారు.


స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు
కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ మొత్తాన్ని రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచారు. కుటుంబ పెన్షన్‌పై మినహాయింపును ఏడాదికి రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచారు. పాత విధానంలో జీతభత్యాల ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50,000, పెన్షనర్లకు ఫ్యామిలీ పెన్షన్‌పై మినహాయింపును రూ.15,000 నుంచి రూ.25,000కి పెంచారు. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పెరగడం వల్ల జీతాలు తీసుకునే వ్యక్తులు, పెన్షనర్లు ఎక్కువ పన్ను ఆదా చేసుకోగలుగుతారు.


NPS కంట్రిబ్యూషన్‌ పరిమితి పెంపు
ప్రైవేట్ రంగ సంస్థలకు ఎన్‌పీఎస్ కంట్రిబ్యూషన్ పరిమితిని ఉద్యోగి ప్రాథమిక వేతనంలో 10 శాతం నుంచి 14 శాతానికి పెంచాలని నిర్ణయించారు. యాజమాన్యం నుంచి మరింత సహకారం వల్ల ఉద్యోగుల పెన్షన్ కూడా పెరుగుతుంది. అయితే, ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పిఎస్, ఇపిఎఫ్, సూపర్‌యాన్యుయేషన్ ఫండ్‌లకు యజమాని కంట్రిబ్యూషన్ రూ. 7.5 లక్షలు దాటితే, దానిపై పన్ను విధించబడుతుంది. 


మూలధన లాభాలపై పన్ను సడలింపు
ఈక్విటీ FoF (ఫండ్ ఆఫ్ ఫండ్స్)పై స్వల్పకాలిక మూలధన లాభాల (STCG) పన్ను 15 శాతం నుంచి 20 శాతానికి పెరిగింది. ఆర్థిక & ఆర్థికేతర అన్ని రకాల ఆస్తులపై దీర్ఘకాలిక మూలధన లాభాల (LTCG) పన్ను 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఏడాదిలో రూ.1.25 లక్షల వరకు మూలధన లాభాలపై పన్ను ఉండదు.


TDS రేట్లలో హేతుబద్ధత
కేంద్ర బడ్జెట్ 2024లో, TDS రేట్లలోనూ మార్పులు జరిగాయి, వివిధ వర్గాలపై టీడీఎస్ రేట్లు 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గాయి. ఇందులో, ఇ-కామర్స్ ఆపరేటర్లపై TDS రేటు 1 శాతం నుంచి 0.1 శాతానికి తగ్గించారు, బీమా కమీషన్ చెల్లింపుపై 2 శాతం TDS, అద్దె చెల్లింపుపై 2 శాతం TDS తగ్గించాలని నిర్ణయించారు. 


జీతంపై TDS & TCS క్రెడిట్ క్లెయిమింగ్‌
దీని ప్రకారం, ఉద్యోగి జీతం నుంచి మినహాయించాల్సిన పన్ను భారాన్ని తగ్గించవచ్చు. దీని కోసం, ఆ ఉద్యోగి ఫామ్ 12BAAని పూరించి, కంపెనీ యాజమాన్యానికి సమర్పించాలి.


ఆస్తి అమ్మకంపై TDS
దీని కింద, రూ. 50 లక్షల కంటే ఎక్కువ విలువైన రెసిడెన్షియల్ ప్రాపర్టీని విక్రయించినప్పుడు, అమ్మకపు ధర లేదా స్టాంప్ డ్యూటీలో ఏది ఎక్కువ ఉంటే దానిపై 1 శాతం TDS వర్తిస్తుంది.


వివాదం సే విశ్వాస్ పథకం
పన్ను చెల్లింపుదారుల పాత ఆదాయ పన్ను వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2.0ని ప్రారంభించింది. ఈ స్కీమ్‌ కింద, పన్ను చెల్లింపుదారు నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించి, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న ప్రత్యక్ష పన్ను కేసులను పరిష్కరించుకోవచ్చు.


ఈ పనులకు ఆధార్ తప్పనిసరి
కొత్త ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం, ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు లేదా పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ నంబర్ అవసరం.


ఐటీఆర్ రీవాల్యుయేషన్ గడువు తగ్గింపు
పాత ఆదాయ పన్ను రిటర్న్‌లను రీఅసెస్‌మెంట్ కోసం తిరిగి ఓపెన్‌ చేసే గడువును కేంద్ర ప్రభుత్వం 6 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకు తగ్గించింది.


మరో ఆసక్తికర కథనం: విమానంలోకి ఈ 6 వస్తువులు తీసుకెళ్తే కష్టాలు కొనితెచ్చుకున్నట్లే, జైలుకు వెళ్లాల్సిందే!