Banned Electronics Gadgets In Air Travel: దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రతి సంవత్సరం విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది, విభిన్న అవసరాల కోసం విమాన ప్రయాణం చేస్తున్నారు. అయితే, విమాన ప్రయాణం సాధారణ వాహనాల ప్రయాణానికి భిన్నంగా ఉంటుంది. విమానయాన కంపెనీలు, ప్రయాణ సమయంలో ప్రయాణీకుల భద్రతకు ప్రధాన ప్రధాన్యత ఇస్తాయి & ప్రత్యేక శ్రద్ధ పెడతాయి. ఈ కారణంగా చాలా రకాల విద్యుత్ వస్తువులను విమానాల్లోకి తీసుకురాకుండా నిషేధం విధించారు. అలాంటి నిషేధిత వస్తువులతో ప్రయాణం చేయడానికి ఏ వ్యక్తినీ అనుమతించరు.


కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను ఎందుకు నిషేధించారు?


విమాన ప్రయాణంలో భద్రత చాలా ముఖ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని కొన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధించారు. వాస్తవానికి, ఎలక్ట్రానిక్స్ వస్తువులు విద్యుదయస్కాంత సంకేతాలను విడుదల చేస్తాయి, ఇవి విమానంలోని నావిగేషన్ లేదా కమ్యూనికేషన్ సిస్టమ్‌కు అంతరాయం కలిగిస్తాయి. ఇది విమానం & ప్రయాణీకుల భద్రతకు ముప్పుగా మారొచ్చు. కాబట్టి, ఎవరైనా వీటిని పొరపాటున విమానంలో తీసుకెళ్లినా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.


విమాన ప్రయాణంలో మీ వద్ద ఉంచుకోకూడని ఎలక్ట్రిక్ వస్తువులు:


1. ఇ-సిగరెట్‌ (E-cigarette): విమానంలోకి ఇ-సిగరెట్లను తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. దీని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగడంతో పాటు మంటలు చెలరేగే ప్రమాదం కూడా ఉంది.


2. శామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 7 మొబైల్‌ ఫోన్‌ (Samsung Galaxy Note 7 Mobile Phone): ఈ ఫోన్‌ మోడల్స్‌ పేలిపోవడం & బ్యాటరీ నుంచి మంటలు చెలరేగిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి, శామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 7 మొబైల్‌ ఫోన్‌ను విమానంలో తీసుకురాకుండా నిషేధించారు.


3. అధిక శక్తితో పనిచేసే లేజర్ పాయింటర్లు (Laser Pointers): విమాన ప్రయాణ సమయంలో ఇటువంటి పాయింటర్‌లను తీసుకెళ్లడం సాధ్యం కాదు. ఇవి పైలట్ దృష్టిని మరల్చే ప్రమాదం ఉంది.


4. స్పేర్ లిథియం బ్యాటరీ (Lithium Battery): ఎక్కువ కెపాసిటీ కలిగిన లిథియం బ్యాటరీలను విమానాల్లో తీసుకెళ్లడం నిషేధం. వీటి నుంచి కూడా మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. ఈ కారణంగా బ్యాటరీ, హోవర్‌బోర్డ్‌లు వంటివి కూడా నిషేధిత జాబితాలోకి చేరాయి.            


5. పోర్టబుల్ ఛార్జర్ (Portable Charger): అనేక విమానయాన సంస్థలు తమ విమానాల్లోకి పోర్టబుల్ ఛార్జర్‌లు తీసుకురాకుండా నిషేధం విధించాయి. దానిలో ఉండే లిథియం బ్యాటరీనే నిషేధానికి కారణం.             


6. స్టెన్ గన్స్‌ లేదా టేజర్ గన్స్‌ (Sten Guns or Taser Guns): ఇవి విద్యుత్‌తో పని చేసే ఆత్మరక్షణ ఆయుధాలు. విమానయాన సంస్థలు వీటిని ఆయుధాలుగా చూస్తాయి. విమాన సిబ్బంది & ప్రయాణీకుల భద్రతకు ఇవి ముప్పు కలిగించే ఆస్కారం ఉంది కాబట్టి వీటిపై నిషేధం ఉంది.          


మరో ఆసక్తికర కథనం: ఈ లక్షణాలు మీ మొబైల్‌ ఫోన్‌లో కనిపిస్తే వైరస్‌ ప్రవేశించిందని అర్ధం, బీ అలెర్ట్‌!