New Income Tax Portal 3.0 Will Be Launched: ఆదాయ పన్ను చెల్లింపుదార్లు ఇన్‌కమ్‌ టాక్స్‌ పోర్టల్‌ను సులభంగా వినియోగించుకోవడం కోసం పోర్టల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుంటారు. అయినప్పటికీ, టాక్స్‌పేయర్లకు ఏటా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా, ఆదాయ పన్ను పత్రాలు సమర్పించే (Income Tax Return Filing) చివరి తేదీల్లోనే చిక్కుముళ్లు పడుతుంటాయి. ఈ సంవత్సరం కూడా, ఆదాయ పన్ను పోర్టల్ ద్వారా ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ చేసే సమయంలో కొన్ని సమస్యలు వచ్చాయి. ITR ఫైలింగ్‌ సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యలను గణనీయంగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. టాక్స్‌పేయర్ల రిలీఫ్ కోసం, కొత్త ఐటీఆర్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేసింది. ప్రాజెక్ట్‌ IEC 3.0గా దీనిని తీసుకురానుంది.


ప్రాజెక్ట్‌ IEC 3.0 అంటే?                
IEC అంటే "ఇంటిగ్రేటెడ్ ఇ-ఫైలింగ్ అండ్‌ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్". ఇ-ఫైలింగ్ పోర్టల్, ITBA ద్వారా సమర్పించిన ITRలను ఇది ప్రాసెస్ చేస్తుంది. అంతేకాదు, బ్యాక్ ఆఫీస్ (BO) పోర్టల్‌ను కూడా అందిస్తుంది. ఇది, ఫీల్డ్ ఆఫీసర్లు పన్ను చెల్లింపుదార్ల ఫైలింగ్, ప్రాసెసింగ్ డేటాను యాక్సెస్ చేయడానికి బ్యాక్‌ ఆఫీస్‌ పోర్టల్‌ ఉపయోగపడతుంది. కొత్త ఆదాయ పన్ను ఫైలింగ్ పోర్టల్‌ను అతి త్వరలోనే లాంచ్‌ చేసే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం, ప్రాజెక్ట్‌ IEC 2.0 రన్‌ అవుతోంది. దీని హయాంలో పోర్టల్‌లో చేయడంలో ఎదురైన సమస్యలను IEC 3.0 అధిగమించగలదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.


ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్‌ ప్రకారం, IEC 3.0 విషయంలో అంతర్గతంగా ఒక సర్క్యులర్ కూడా జారీ అయింది. కొత్త ITR పోర్టల్‌ను కట్టుదిట్టంగా తయారు చేసేందుకు టెక్నాలజీ సంబంధిత పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సాంకేతికత పనులు ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ప్రాసెసింగ్‌లో కీలకంగా ఉంటాయని, మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ఇదొక పెద్ద అడుగుగా మారుతుందని సమాచారం.


మరింత సురక్షితం - యూజర్‌ ఫ్రెండ్లీ          
IEC 3.0 ఉద్దేశం ఆదాయ పన్ను దాఖలును సులభంగా మార్చేందుకు సురక్షితమైన & యూజర్‌-ఫ్రెండ్లీ పద్ధతులను ఐటీ పోర్టల్‌లో అందించడం. IEC 3.0 ప్రారంభించే ముందు.. ఐటీ అధికార్లు, టాక్స్‌ ఎక్స్‌పర్ట్స్‌, పన్ను చెల్లింపుదార్లు, ఇతర సంబంధిత వర్గాల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకోవడానికి ఒక కమిటీని కూడా ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నియమించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన ప్రతిస్పందనలను 30 నవంబర్ 2024లోపు పంపాలని ఈ కమిటీని ఆదేశించింది.


ప్రాజెక్ట్ IEC 3.0 లక్ష్యం హై స్పీడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రోత్సహించడం. ఇది, ITR ప్రాసెసింగ్‌ను మరింత వేగంగా మారుస్తుంది. పన్ను చెల్లింపుదార్లు వేగంగా రిఫండ్‌ పొందేందుకు సాయం చేస్తుంది. IEC 3.0లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడంతో పన్ను చెల్లింపుదార్ల నుంచి ఫిర్యాదులను గణనీయంగా తగ్గుతాయని ఇన్‌కమ్‌ టాక్స్‌ విభాగం భావిస్తోంది.


మరో ఆసక్తికర కథనం: దీపావళి కానుక - ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరిగిందోచ్‌