Latest Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ ఉదయం(గురువారం అక్టోబర్ 17న) తీరం దాటింది. నెల్లూరు జిల్లా తడ వద్ద తీరందాటిన వాయుగుండం అల్పపీడనంగా కొనసాగుతోంది. దాదాపు 22 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం తీరం దాటిందని అధికారులు చెబుతున్నారు. వాయుగుండం తీరం దాటినందున దక్షిణ కోస్తా రాయలసీమ, ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
మూడు రోజులుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని కొన్ని జిల్లాలు, తమిళనాడులోను పదికిపైగా జిల్లాల్లో విపరీతమైన వర్షాలు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ముందస్తు జాగ్రత్తగా లోతట్టుప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జన జీవనం స్తంభించింపోయింది. ఇప్పుడు వాయుగుండం అల్పపీడనంగా మారుతున్న టైంలో ఐదు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలతో వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ఈ ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. కృష్ణపట్నం, వాడరేవు, నిజాంపట్నం, మచిలీపట్నం పోర్టుల వద్ద పరిస్థితి అల్లకల్లోలోగా ఉంది. సముద్ర ముందుకొస్తోంది. ఈ పోర్టుల వద్ద మూడో నంబరు ప్రమాద హెచ్చరికొ కానసాగుతోంది.
తమిళనాడు, కర్ణాటకలో జోరు వానలు
వాయుగుండం బలహీన పడి అల్పపీడనంగా మారడంతో అధికారులు చెన్నై సహా 4 జిల్లాలకు జారీ చేసిన రెడ్ అలర్ట్ ఉపసంహరించుకున్నారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టులో అతి భారీ వర్షాలు మాత్రం కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గత రెండు రోజులుగా ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. అందుకే ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటిచారు.
బెంగళూరులో వాతావరణం ఎలా ఉంది?(Bangalore Weather Today)
బెంగళూరులో కూడా రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కారణంగా న్యూజిలాండ్, ఇండియా మధ్య జరగాల్సిన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటను రద్దు చేశారు. కనీసం టాస్ వేయకుండానే ఆటను రద్దు చేశారు. ఇవాళ వర్షం కాస్త తగ్గుముఖం పట్టినందు వల్ల పిచ్‌ను అవుట్ ఫీల్డ్‌ను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
ఇంకా పొంచి వాయుగండాలు
అక్టోబర్‌లోనే మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 21న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది 24 వ తేదీ నాటికి ఒడిశా తీరానికి చేరుకుంటుంది. ఇది తుపానుగా బలపడితే బంగ్లాదేశ్ వద్ద తీరం దాటవచ్చని చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే మరో ఉపరితల ఆవర్తనం 26 నాటికి బంగాళాఖాతంలో వాయుగుండంగా మార వచ్చనే అంచనా ఉంది. ఈ రెండింటి ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండకపోవచ్చని చెబుతున్నారు.
మరోవైపు కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఓడలరేవు ఓఎన్జీసీ న్యూ టెర్మినల్ ప్రమాదంలో పడింది. ఓఎన్జీసీ న్యూ టెర్మినల్ కాంపౌండ్ గోడను దాటి టెర్మినల్ వరకు సముద్రపు నీరు చేరుకోవడంతో ఓడలరేవు ప్రజలు కలవరానికి గురవుతున్నారు. ఇప్పటికే టెర్మినల్ సముద్రం వైపు ఉన్న రోడ్డు పూర్తిగా రాకాసి అలలకు ధ్వంసం కాగా ఇదే పరిస్థితి కొనసాగితే టెర్మినల్ కాంపౌండ్ వాల్ కూడా నాశనమయ్యే పరిస్థితి లేకపోలేదని స్థానికులు చెబుతున్నారు.
గతంలో ఈ ఓఎన్జీసీ టెర్మినల్‌కు చుట్టూ నిర్మించిన రోడ్డు సముద్రం వైపున పూర్తిగా కోతకు గురైంది. జియోట్యూబ్ పద్దతిలో ఇక్కడ సముద్రకోత నివారణ చర్యలు తాతాలికంగా చేపట్టారు ఓఎన్జీసీ అధికారులు. అయితే అది శాశ్వత ప్రాతిపదికన చేపట్టకపోగా కొంతమేరకు ఈ జియోట్యూబ్ పద్దతిలో రాళ్లు ఏర్పాటు చేయడంతో అది కూడా ధ్వసం అయ్యింది. ఇప్పుడు సముద్రం మరింత ముందుకు వచ్చి ఏకంగా సముద్రపు నీరు టెర్మినల్‌లోకి వెళ్లే పరిస్థితి తలెత్తింది.
ఓడలరేవు ప్రజలు ఓఎన్జీసీ తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఓడలరేవు తీరానికి శాస్వత ప్రాతిపదికన కోత నివారణ చర్యలు చేపట్టాలని, లేకుంటే ఓడలరేవు గ్రామ ఉనికికే ప్రమాదం వాటిల్లే లేకపోలేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.