3 Percent DA Hike Announced: దాదాపు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు & పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తీపి కబురు రానే వచ్చింది. డియర్‌నెస్‌ అలవెన్స్‌ (Dearness Allowance - DA) పెరిగింది. ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్ల కోసం కరవు భత్యాన్ని (Dearness Allowance) పెంచడం ఆ నిర్ణయాల్లో ఒకటి. ఇది, సుమారు 49 లక్షల మంది ఉద్యోగులు & 60 లక్షల మంది పింఛనుదార్లకు లబ్ధి చేకూర్చే విషయం. 


మన దేశంలో, పెరుగుతున్న ద్రవ్యోల్బణం (Inflation) ప్రభావం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లపై పడకుండా చూసేందుకు, కేంద్ర ప్రభుత్వం తన ప్రస్తుత సిబ్బందికి (Present Employees) డియర్‌నెస్‌ అలవెన్సును, పెన్షనర్లకు ‍‌(Retired Employees) డియర్‌నెస్ రిలీఫ్‌ను (DR) ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా DA, DR ప్రకటిస్తుంటాయి.


DA ఎంత పెరిగింది, మొత్తం ఎంతకు చేరింది?           
కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ & డియర్‌నెస్ రిలీఫ్‌ను 3 శాతం పెంచింది. పండుగల సమయంలో ప్రభుత్వోద్యోగులు సంతోషంగా ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేంద్ర ఉద్యోగుల డీఏను 3 శాతం పెంచేందుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 50 శాతం కరవు భత్యం తీసుకుంటున్నారు. 3 శాతం పెంపును కూడా కలిపితే, వచ్చే నెల నుంచి 53 శాతం డీఏను అందుకుంటారు. 


బకాయిలతో కలిపి డియర్‌నెస్ అలవెన్స్                
ప్రభుత్వ ఉద్యోగులు & పెన్షనర్లు వారి అక్టోబర్ జీతం & పెన్షన్‌లో భారీ పెరుగుదలను అందుకుంటారు. ఎందుకంటే, డియర్‌నెస్ అలవెన్స్‌ ఈ ఏడాది జులై 01 నుంచి వర్తిస్తుంది. కాబట్టి, డియర్‌నెస్ అలవెన్స్ మరియు డియర్‌నెస్ రిలీఫ్ రెండింటికీ అర్హులైన వారికి జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల బకాయిలను కూడా సర్కారు అందిస్తుంది. దీపావళి టైమ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది దీపావళిని మరింత గ్రాండ్‌గా జరుపుకుంటామని చెబుతున్నారు. ఈ నెలాఖరులో, అక్టోబర్‌ 31న దీపావళి (Deevali 2024) పండుగ ఉంది.


మరో ఆసక్తికర కథనం: గోల్డ్ బాండ్లలో రూపాయికి రూపాయి లాభం - ఈ ఇన్వెస్టర్లు వెరీ లక్కీ   


రబీ పంటల కనీస మద్దతు ధర పెంపు
కోస్టల్ షిప్పింగ్ బిల్లుకు కూడా కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. కోస్టల్ షిప్పింగ్ బిల్లు 2024 ద్వారా దేశంలోని సముద్ర తీర ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుంది. రబీ పంటల కనీస మద్దతు ధర (MSP) పెంపునకు కేంద్ర మంత్రివర్గ సమావేశం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. 6 రకాల రబీ పంటల MSPని 2 శాతం నుంచి 7 శాతం వరకు పెంచారు. గోధుమల కనీస మద్దతు ధరను గరిష్టంగా పెంచారు.


మరో ఆసక్తికర కథనం: జాన్సన్‌ బేబీ పౌడర్‌ వాసన పీల్చినా క్యాన్సర్‌!? - తస్మాత్‌ జాగ్రత్త!