Return On Sovereign Gold Bond Scheme: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఐదేళ్ల క్రితం 2019 అక్టోబర్ 15న జారీ చేసిన 2019-20 సిరీస్ V సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌కు (SGB 2019-20 Series V) సంబంధించి, ముందస్తు ఉపసంహరణ ధరను (Premature Redemption Price) ప్రకటించింది. ఈ సరీస్‌కు చెందిన సావరిన్ గోల్డ్ బాండ్ల ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ప్రైస్‌ను ఒక్కో గ్రాముకు 7 వేల 549 రూపాయలుగా (రూ.7,549) నిర్ణయించింది. దీంతో, ఈ గోల్డ్ బాండ్ సిరీస్‌లో పెట్టుబడి పెట్టిన వ్యక్తులు తమ పెట్టుబడిపై ఒక్కో గ్రాముకు 3 వేల 761 రూపాయల (రూ.3761) లాభం పొందబోతున్నారు. అంటే, SGB ఇన్వెస్టర్లు కేవలం ఐదు సంవత్సరాల్లోనే తమ పెట్టుబడికి రెట్టింపు రిటర్న్ తీసుకుంటున్నారు.
అక్టోబరు 15 నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ల ప్రీమెచ్యూర్ రీడెంప్షన్
అక్టోబరు 15, 2019న, సావరిన్ గోల్డ్ బాండ్ 2019-20 సిరీస్ Vని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేసిన ఐదు సంవత్సరాల తర్వాత, వడ్డీని చెల్లించిన తేదీ నుంచి పెట్టుబడిదార్లకు ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. ఈ రూల్ ప్రకారం, SGB 2019-20 Series V బాండ్ల ముందస్తు ఉపసంహరణకు మంగళవారం (15 అక్టోబర్ 2024) నుంచి అనుమతి లభించింది.
సాధారణంగా, సావరిన్ గోల్డ్ బాండ్ల కాల వ్యవధి 8 సంవత్సరాలు. ఈ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టినవాళ్లకు, కాల పరిమితి ముగిసిన తర్వాత, మెచ్యూరిటీ తేదీ నాడు మార్కెట్‌లో అమల్లో ఉన్న బంగారం ధరను తిరిగి చెల్లిస్తారు, దీంతోపాటు 2.50% వడ్డీ కూడా ఇన్వెస్టర్‌కు అందుతుంది.
ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ధరను ఎలా లెక్కిస్తారు?
సావరిన్ గోల్డ్ బాండ్ రిడెంప్షన్ ధరను... రిడెంప్షన్ తేదీకి ముందు మూడు ట్రేడింగ్ సెషన్లలో 999 స్వచ్ఛత గల బంగారం ముగింపు ధరల సగటు ఆధారంగా నిర్ణయిస్తారు. 'ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్' లెక్కించిన బంగారం ధరల సగటును దీనికోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఈ లెక్క ప్రకారం... సావరిన్ గోల్డ్ బాండ్ 2019-20 సిరీస్ V రిడెంప్షన్ ప్రైస్‌ను గ్రాముకు రూ.7,549గా నిర్ణయించారు. ఇది... అక్టోబర్ 10, 11, 14 తేదీల్లో బంగారం ముగింపు ధరలకు సగటు ధర.
సాధారణంగా, గోల్డ్ రేట్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి, మెచ్యూరిటీ వరకు ఎదురు చూసిన వ్యక్తులకు భారీ మొత్తంలో రిటర్న్ వస్తుంటుంది. SGBని, మెచ్యూరిటీ గడువైన 8 సంవత్సరాల వరకు కొనసాగిస్తే, మెచ్యూరిటీ సమయంలో వచ్చే డబ్బుపై ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంటే, పన్ను రూపంలోనూ బెనిఫిట్ దక్కుతుంది. అప్పటి వరకు హోల్డ్ చేయలేనివాళ్లు 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా బాండ్లను సరెండర్ చేసి పెట్టుబడిని + వడ్డీని పొందొచ్చు. అయితే, 8 సంవత్సరాల కాల పరిమితి కంటే ముందే బాండ్లను ఉపసంహరించుకుంటే, అప్పుడు వచ్చే డబ్బుపై ఆదాయ పన్ను చెల్లించాలి. సావరిన్ గోల్డ్ బాండ్లను ట్రేడింగ్ కూడా చేయొచ్చు.
మరో ఆసక్తికర కథనం: సూపర్ ఫాస్ట్ డెలివరీనే కాదు, అదే స్పీడ్‌లో రిటర్న్ అండ్ ఎక్స్ఛేంజ్ కూడా - బ్లింకిట్ కొత్త సర్వీస్