Blinkit Introduced Return And Exchange In 10 Minutes: గత కొన్ని సంవత్సరాలుగా, మన దేశంలో క్విక్‌ కామర్స్‌ కంపెనీల హవా కొనసాగుతోంది. వాటి సర్వీసుల్లో వేగం కూడా పెరుగుతోంది. ఈ కంపెనీలు తమ సూపర్ ఫాస్ట్ డెలివరీతో మెట్రో నగరాల్లోని ప్రతి ఇంట్లో తమకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇప్పుడు, ఫుడ్‌ డెలివెరీ కంపెనీ జోమాటో (Zomato) ఆధ్వర్యంలోని బ్లింకిట్‌ (Blinkit) కూడా సూపర్‌ఫాస్ట్ ఎక్స్ఛేంజ్ అండ్‌ రిటర్న్ ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ కొత్త సర్వీస్‌ కింద, ఇప్పుడు మీరు ఏదైనా వస్తువును రిటర్న్‌ చేయాలన్నా లేదా ఎక్సేంజ్‌ చేసుకోవాలన్నా ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం 10 నిమిషాల్లోనే ఆర్డర్‌ డెలివెరీ చేస్తున్న బ్లింకిట్‌, ఎక్స్ఛేంజ్ అండ్‌ రిటర్న్ పనిని కూడా కేవలం 10 నిమిషాల్లో పూర్తి చేస్తోంది. ప్రస్తుతం, దిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పుణెలో ఈ సేవలను బ్లింకిట్‌ అందిస్తోంది. సమీప భవిష్యత్‌లో మరిన్ని నగరాలు కూడా సూపర్‌ ఫాస్ట్‌ రిటర్న్‌ అండ్‌ ఎక్సేంజ్‌ ఫీచర్‌ పరిధిలోకి రానున్నాయి. 


దిల్లీ-ఎన్‌సీఆర్‌లో సూపర్‌ రెస్పాన్స్‌
సాధారణంగా, ఆన్‌లైన్‌లో వస్తువులు ఆర్డర్‌ చేసిన వినియోగదార్లు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య బట్టలు, చెప్పులు, బూట్ల దగ్గరే వస్తుంది. వాటి సైజ్‌, అమరిక సరిగ్గా ఉండకపోవచ్చు. సైజు & ఫిట్టింగ్ ఇబ్బందుల కారణంగా చాలామంది బట్టలు, చెప్పులు, బూట్ల వంటి కోసం ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికి ఇష్టపడడం లేదు. నేరుగా షాపులకు వెళ్లి వాటిని ఒకసారి ధరించి చూస్తారు, సంతృప్తి చెందాకే కొంటారు. మరికొందరు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసినప్పటికీ, సైజు & ఫిట్టింగ్ సరిపోకపోతే వాటిని రిటర్న్‌ చేస్తుంటారు లేదా మార్పిడి (exchange) చేసుకుంటారు. ఈ రెండు వర్గాలకు చెందిన కస్టమర్లను ఆకర్షించడానికి ఈ కొత్త & వేగవంతమైన సేవను పరిచయం చేసింది బ్లింకిట్‌. కొత్త సర్వీస్‌ ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే రిటర్న్‌ లేదా ఎక్సేంజ్‌ చేసుకోవచ్చు. మొదట, ఈ సదుపాయాన్ని దిల్లీ-ఎన్‌సీఆర్‌లో కంపెనీ ప్రయోగాత్మకంగా పరిశీలించింది. అక్కడ విజయవంతం కావడంతో దేశంలోని ఇతర మెట్రో నగరాలకు కూడా ఆ ఫెసిలిటీని విస్తరించింది.


అవసరమైన కస్టమర్ల కోసం, తాము కేవలం 10 నిమిషాల్లో రిటర్న్‌ ఆర్‌ ఎక్సేంజ్‌ ఫెసిలిటీని ప్రారంభిస్తున్నట్లు బ్లింకిట్‌ సీఈవో అల్బిందర్ ధిండ్సా (Blinkit CEO Albinder Dhindsa) కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ద్వారా అధికారికంగా ప్రకటించారు.


ఇన్‌వాయిస్‌ సృష్టి - ఇన్‌పుట్ క్రెడిట్ ప్రయోజనం
ఇటీవల, వ్యాపారస్తులు ఏవైనా వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు జీఎస్‌టీ నంబర్‌ను (GSTIN) యాడ్‌ చేసే సౌకర్యాన్ని కూడా బ్లింకిట్‌ కల్పించింది. దాని సహాయంతో వాళ్లు GST ఇన్‌పుట్ క్రెడిట్‌ను క్లెయిమ్‌ చేసుకుంటారు. ఈ సదుపాయాన్ని బ్లింకిట్ యాప్ ద్వారా సులభంగా పొందొచ్చు. దాని సాయంతో GST ఇన్వాయిస్ కూడా సృష్టించొచ్చు. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేసే వ్యాపారులు ఈ ఫెసిలిటీ వల్ల లబ్ధి పొందుతారని అల్బిందర్ ధిండా చెప్పారు.


మరో ఆసక్తికర కథనం: 70 కోట్ల మంది షాపింగ్‌ - ఇంత డబ్బును ఎక్కడ నుంచి తెస్తున్నారబ్బా?