Diwali 2024 Shopping: భారతదేశంలో అతి పెద్ద పండుగలు దసరా, దీపావళి. ఇప్పటికే దసరా సరదా తీరింది. మరికొన్ని రోజుల్లో దీపావళి ధమాకా మొదలవుతుంది. వెలుగుల పండుగను జరుపుకోవడానికి వ్యాపారులు, కస్టమర్‌లు ఇద్దరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఫెస్టివ్‌ సీజన్‌లో (రాఖీ పండుగ నుంచి దీపావళి వరకు) కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. 


'కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్' (CAIT) జాతీయ ప్రధాన కార్యదర్శి, చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్‌వాల్ చెప్పిన ప్రకారం... ప్రస్తుత పండుగ సీజన్‌ ముగిసేసరికి మన దేశంలో దాదాపు 70 కోట్ల మంది ప్రజలు షాపింగ్ చేస్తారు. అయితే.. రూ.500 లేదా అంతకంటే తక్కువకు కొనుగోలు చేసేవాళ్లు కోకొల్లలుగా ఉండగా, వేలు & లక్షలు ఖర్చు పెట్టే వ్యక్తులు తగ్గారట. అంటే, భారతీయ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తోంది పేద ప్రజలేనని మరోమారు స్పష్టమైంది.


ఎంత వ్యాపారం జరుగుతుంది?
CAIT, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న 70 నగరాల్లో ఇటీవల సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా వ్యాపారులు వినియోగదార్ల పండుగ కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. రాఖీ పండుగ, వినాయక చవితి, దసరా నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా మార్కెట్‌లు కస్టమర్లతో కళకళలాడాయి. జనమంతా కలిసి భారీగా కొనుగోళ్లు జరిపిన తీరును పరిశీలిస్తే, ఈ ఏడాది పండుగ సీజన్‌లో రూ. 4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. గతేడాది, ఇదే సమయంలో దాదాపు రూ. 3.50 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది.


ప్రజలు దేని కోసం ఎంత ఖర్చు చేస్తారు?
స్థూల అంచనా ప్రకారం, రూ. 4.25 లక్షల కోట్ల వ్యాపారంలో దాదాపు 13 శాతం ఆహారం & కిరాణా, 9 శాతం ఆభరణాలు, 12 శాతం వస్త్రాలు, 4 శాతం డ్రై ఫ్రూట్స్, స్వీట్లు & చిరుతిళ్లు, 3 శాతం గృహోపకరణాలు & సౌందర్య సాధనాలు, 8 శాతం ఎలక్ట్రానిక్స్ & మొబైల్స్, 3 శాతం పూజా సామాగ్రి, 3 శాతం వంటగది సామగ్రి, 2 శాతం మిఠాయిలు & బేకరీ, 8 శాతం బహుమతులు, 4 శాతం ఫర్నిచర్, మిగిలిన 20 శాతం ఆటోమొబైల్, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్, బొమ్మలు, ఇతర వస్తువులు, సేవలపై ఖర్చు చేయవచ్చని భావిస్తున్నారు.


దిల్లీలో రూ.75,000 కోట్లను మించి బిజినెస్‌
ప్రస్తుత పండుగ సీజన్‌లో, ఒక్క దిల్లీలోనే ట్రేడ్ ఫిగర్ రూ.75,000 కోట్లను దాటే అవకాశముంది. పండుగల సీజన్‌ ముగిసిన వెంటనే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది. ఆ సమయంలోనూ దేశవ్యాప్తంగా వ్యాపారులు పెద్దసంఖ్యలో లావాదేవీలను 
ఆశిస్తున్నారు. ఫెస్టివ్‌ సీజన్‌ తరహాలోనే, వెడ్డింగ్‌ సీజన్‌ (Wedding Season 2024)లోనూ గిఫ్ట్‌ ఆర్టికల్స్‌, స్వీట్లు & స్నాక్స్, డ్రై ఫ్రూట్స్, కూల్‌డ్రింక్స్‌, రెడీమేడ్ ఫుడ్‌, బొమ్మలు, కంప్యూటర్లు & ఐటీ పరికరాలు, మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వస్తువులు, హార్డ్‌వేర్‌, ఆటోమొబైల్స్, ఆభరణాలు, వస్త్రాలు, కిచెన్‌ సామగ్రి, బాణసంచా, ఫర్నీచర్, గృహాలంకరణ వస్తువులు, చెప్పులు, సౌందర్య సాధనాలు, స్టేషనరీ, పండ్లు, పూలు, పూజా సామాగ్రి, మట్టి పాత్రల వంటి సంప్రదాయ మట్టి వస్తువులు, దేవుళ్ల పటాలు, విగ్రహాలు, పెయింట్స్, ఫ్యాషన్ వస్తువులు, FMCG వస్తువులు, కిరాణా సరుకులు వంటివి భారీగా అమ్ముడవుతాయి. 


ఫెస్టివ్‌ సీజన్‌, వెడ్డింగ్‌ సీజన్‌లో దేశవ్యాప్తంగా జరిగే వేలాది ఫంక్షన్ల కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బాంకెట్ హాల్స్, క్యాటరింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, క్యాబ్ సర్వీస్, డెలివరీ సెక్టార్, ఆర్టిస్టులు, సేవల రంగానికి సంబంధించిన ఇతర వర్గాలు కూడా భారీగా లాభపడబోతున్నారు. 


మరో ఆసక్తికర కథనం: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో నష్టపోవద్దు - మీ డబ్బును పెంచే బెస్ట్‌ ఐడియాలు వేరే ఉన్నాయ్‌!