ఒక ఫ్లాప్ తర్వాత మరొక ఫ్లాప్... హిందీ సినిమా ఇండస్ట్రీకి వరుస ఫ్లాపులు ఒకదాని వెంట మరొక వస్తున్నాయి. స్టార్ హీరోలు, హీరోయిన్ల సినిమాలు ఏవీ హిట్ కావడం లేదు. ఒక్క 'స్త్రీ 2' తప్పిస్తే... ఆగస్టు 15 సినిమాలతో పాటు రీసెంట్ దసరా రిలీజులు సైతం బాక్సాఫీస్ బరిలో బోల్తా కొట్టాయి.
ఆలియా సినిమాకు జనాలు లేరు...
రాజ్ కుమార్ రావుకు కలెక్షన్స్ లేవు!
విజయ దశమి అనండి, దేవీ నవరాత్రులు అనండి... పేరు ఏదైనా ఫెస్టివల్ ఒక్కటే. దసరాకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సంబరాలు సహజం. సెలవులు కూడా! ఈ ఫెస్టివల్ సీజన్ క్యాష్ చేసుకోవడానికి హిందీలో రెండు సినిమాలు వచ్చాయి.
ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జిగ్రా' సినిమాను అక్టోబర్ 11న విడుదల చేశారు. అదే రోజు రాజ్ కుమార్ రావు, 'యానిమల్' ఫేమ్ తృప్తి దిమ్రి జంటగా నటించిన 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' కూడా విడుదల అయ్యింది. ఆ రెండూ బాక్సాఫీస్ బరిలో బోల్తా కొట్టాయి. విచిత్రం ఏమిటంటే... ఈ రెండు సినిమాలకు హాలీవుడ్ సినిమాలు ఇన్స్పిరేషన్ అని కామెంట్లు రావడం.
ఆలియా భట్ 'జిగ్రా' థియేటర్లలో జనాలు లేరని మరొక హీరోయిన్, బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ - టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ భార్య దివ్యా ఖోస్లా కుమార్ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఆవిడ నటించిన 'సావి' సినిమాకు, 'జిగ్రా'కు మధ్య చాలా పోలికలు ఉన్నాయని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఫ్రెంచ్ సినిమా 'ఎనీ థింగ్ ఫర్ హర్' రీమేక్ అయినటువంటి హాలీవుడ్ సినిమా 'ది నెక్స్ట్ త్రీ డేస్'ను బేస్ చేసుకుని 'సావి' తీశారు. ఇప్పుడు ఆ కథతో ఆలియా సినిమా చేశారని కామెంట్స్ వచ్చాయి. 'విక్కీ విద్య కా వో వాలా వీడియో' సైతం మరొక ఒక హాలీవుడ్ సినిమా 'సె... టేప్' కాన్సెప్ట్ బేస్ చేసుకుని చేసిన సినిమా.
Also Read: ఓటీటీలోకి వచ్చిన 'లెవల్ క్రాస్'... అమలా పాల్ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?
'జిగ్రా', 'విక్కీ విద్య కా వో వాలా వీడియో' ఫ్లాప్ కావడంతో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఫెస్టివల్ సీజన్ వేస్ట్ అయ్యింది. 'స్త్రీ 2' హిట్ కాకపోతే ఆగస్టు 15 లాంగ్ వీకెండ్ హాలిడేస్ సీజన్ కూడా వేస్ట్ అయ్యేది. ఆగస్టు 15కు విడుదలైన అక్షయ్ కుమార్ 'ఖేల్ ఖేల్ మే' అట్టర్ ఫ్లాప్ అయ్యింది. జాన్ అబ్రహం, శర్వరి నటించిన 'వేద' సైతం కలెక్షన్స్ రాబట్టడంలో వెనకడుగు వేసింది. ఈ తరుణంలో బాలీవుడ్ దర్శక నిర్మాతలు తమ తమ స్ట్రాటజీలు మార్చాల్సిన అవసరం ఉందనేది ట్రేడ్ పండితుల టాక్.
మల్టీప్లెక్స్ కోసం సినిమాలు తీయడం ఆపాలా?
ముంబైలోని బాంద్రా వంటి రిచ్ ఏరియా నుంచి ఫిల్మ్ సిటీ వరకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ట్రావెల్ చేస్తున్నారని, కేవలం మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారనే విమర్శ ఒకటి ఉంది. మాస్ ఆడియన్స్, బీహార్ అండ్ ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు హిట్స్ వస్తాయని బాలీవుడ్ దర్శక నిర్మాతలకు విశ్లేషకులు ఇచ్చే సలహా.