Rs 126 Crore Fine On Johnson And Johnson Company: మీ పిల్లల కోసం లేదా మీ కోసం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ బేబీ టాల్కమ్‌ పౌడర్‌ ‍‌(Johnson And Johnson baby talcum powder) వాడుతున్నారా?. అయితే ఈ వార్తను మీరు కచ్చితంగా చదవాల్సిందే. జాన్సన్‌ బేబీ టాల్కమ్‌ పౌడర్‌ను రాసుకుంటేనే కాదు, దానిని వాసన పీల్చినా క్యాన్సర్‌ ‍‌(Cancer) వస్తుందన్న వార్తలు జాతీయ & అంతర్జాతీయ మీడియాలో కనిపిస్తున్నాయి.


జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ బేబీ టాల్కమ్‌ పౌడర్‌ వినియోగిస్తే క్యాన్సర్‌ వస్తుందని గతంలోనూ కొన్నిసార్లు ఆ కంపెనీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, తమ ఉత్పత్తులు సురక్షితమైనవని, వాటి వల్ల ఎలాంటి అనారోగ్యాలు రావని ఆ కంపెనీ కూడా చాలాసార్లు చెప్పింది. అయినప్పటికీ, క్యాన్సర్‌ ఆరోపణల వల్ల జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఉత్పత్తులను ప్రపంచ దేశాల ప్రజలు ఇప్పటికీ అనుమానంగానే చూస్తున్నారు. ఫలితంగా, గ్లోబల్‌ మార్కెట్లలో ఈ కంపెనీ అమ్మకాలు తగ్గాయి.


క్యాన్సర్‌ వచ్చిందని జాన్సన్‌ కంపెనీపై రూ.126 కోట్ల జరిమానా
తాజాగా, కేన్సర్‌ ఆరోపణలకు సంబంధించిన కేసులో, ఒక అమెరికన్‌ కోర్టు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీకి అతి భారీ మొత్తంలో రూ. 126 కోట్ల జరిమానా విధించింది. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి, మూడేళ్ల క్రితం, జాన్సన్‌ కంపెనీ మీద   ఫెయిర్‌ఫీల్డ్‌ కౌంటీ, కనెక్టికట్‌ సుపీరియర్‌ కోర్టులో కేసు వేశాడు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టాల్కమ్‌ పౌడర్‌ను వాడడం వల్ల తనకు అరుదైన క్యాన్సర్‌ వచ్చిందని కోర్ట్‌ పిటిషన్‌లో ఆరోపించాడు. దీనికి సంబంధించిన వైద్య పరీక్షల రుజువులను కూడా న్యాయస్థానం ఎదుట ఉంచాడు. ఈ కేసులో విచారణ జరిపిన ఫెయిర్‌ఫీల్డ్‌ కౌంటీ, కనెక్టికట్‌ సుపీరియర్‌ కోర్టు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీకి 126 కోట్ల రూపాయల ఫైన్‌ విధించింది. 


"మెసోథెలియోమా" అనే అరుదైన క్యాన్సర్‌
అమెరికాలో నివాసం ఉంటున్న ప్లాట్‌కిన్‌ ఇవాన్‌కు (Plotkin Ivan) "మెసోథెలియోమా" అనే అరుదైన క్యాన్సర్‌ వ్యాధి (rare and aggressive cancer Mesothelioma) సోకింది. 2021లో చేయించుకున్న వైద్య పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ క్యాన్సర్‌ తన శరీరంలోకి ఎలా ప్రవేశించిందన్న విషయాన్ని కూడా ప్లాట్‌కిన్‌ ఇవాన్‌ తన పిటిషన్‌లో కోర్టుకు వెల్లడించాడు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ బేబీ టాల్కమ్‌ పౌడర్‌ వాసన పీల్చినందుకే తనకు ఆ క్యాన్సర్‌ సోకిందని న్యాయస్థానానికి తెలిపాడు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, ప్లాట్‌కిన్‌ ఇవాన్‌కు 126 కోట్ల రూపాయల పరిహారంతో పాటు కోర్టు ఖర్చులను సైతం చెల్లించాలని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది.


కంపెనీ ఏం చెబుతోంది?
ఫెయిర్‌ఫీల్డ్‌ కౌంటీ, కనెక్టికట్‌ సుపీరియర్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎరిక్‌ హాస్‌ (Erik Haas) స్పందించారు. తమ కంపెనీ వాదనలను పూర్తి స్థాయిలో వినకుండానే న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని ఆరోపించారు. దీనిని ఇక్కడితో వదిలిపెట్టబోమని, పైకోర్టుకు వెళ్లి పోరాడతామని స్పష్టం చేశారు. జాన్సన్‌ బేబీ టాల్కమ్‌ పౌడర్‌ అత్యంత సురక్షితమైనదని, మెసోథెలియోమా క్యాన్సర్‌కు అది కారణం కాదని చెప్పారు.


జాన్సన్‌ బేబీ టాల్కమ్‌ పౌడర్‌ తయారీలో ఉపయోగించే "ఆస్‌బెస్టాస్‌" వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని గతంలో కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. ఆస్‌బెస్టాస్‌ క్యాన్సర్‌ కారకంగా మారుతుందని పరిశోధకులు ప్రకటించారు. ఆ పరిశోధనల తర్వాత, దాదాపు 62 వేల మంది వివిధ కోర్టుల్లో కేసులు వేశారు. ఈ కేసుల పరిష్కారం కోసం జాన్సన్‌ కంపెనీ 9 బిలియన్‌ డాలర్లను కూడా కేటాయించింది. మరోవైపు.. ఆరోపణల కారణంగా అమెరికా, కెనడాలో 2020లోనే జాన్సన్‌ బేబీ టాల్కమ్‌ పౌడర్‌ అమ్మకాలను ఆ కంపెనీ ఆపేసింది. మన దేశంలో మాత్రం యథేచ్చగా అమ్ముతోంది.


మరో ఆసక్తికర కథనం: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురు - కాసేపట్లో లడ్డూ లాంటి వార్త