3 Percent DA Hike Announcement Possible Today: కోట్లాది మంది ఉద్యోగుల నిరీక్షణకు ఈ రోజు (బుధవారం 16 అక్టోబర్ 2024) ముగియనుంది. కేంద్ర ప్రభుత్వం, నిరీక్షణదార్లందరికీ దీపావళి కానుక అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ రోజు, కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత, ప్రభుత్వ ఉద్యోగులు & పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్ (Dearness Allowance) పెంపుపై ప్రకటన చేయవచ్చు.
చాలా కాలంగా ఎదురు చూపులు
దాదాపు కోటి మంది ప్రభుత్వ ఉద్యోగులు & పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వం నుంచి డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. గత క్యాబినెట్ భేటీ తర్వాత జరిగిన బ్రీఫింగ్‌లో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ డీఏ పెంపును ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోబోతోందని ప్రభుత్వ ఉద్యోగులు & పెన్షనర్లు గట్టిగా నమ్ముతున్నారు.
డియర్‌నెస్ అలవెన్స్ ఎంత పెంచొచ్చు?
డియర్‌నెస్ అలవెన్స్‌ను 3 శాతం పెంచడంపై నేటి కేబినెట్ భేటీలో చర్చిస్తారు. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పేరిట, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (DR) పేరిట ఈ పెంపు ఉంటుంది. ప్రస్తుతం, ప్రభుత్వ ఉద్యోగులు & పెన్షనర్లకు అందుతున్న డియర్‌నెస్ అలవెన్స్ 50 శాతంగా ఉంది. ఈ రోజు, 3 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తే, ఈ హైక్‌తో కలిపి కొత్త DA 53 శాతం అవుతుంది.
మరో ఆసక్తికర కథనం: ఫిక్స్‌డ్ డిపాజిట్లతో నష్టపోవద్దు - మీ డబ్బును పెంచే బెస్ట్ ఐడియాలు వేరే ఉన్నాయ్!
కొత్త డియర్‌నెస్ అలవెన్స్ ఎప్పటి నుంచి అందుతుంది?
కేంద్ర క్యాబినెట్ ఈ రోజు డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచితే, ఈ ఏడాది జులై, ఆగస్టు & సెప్టెంబర్ బకాయిలతో పాటు ఈ మొత్తం ఉద్యోగులకు అందుతుంది. ఎందుకంటే DA పెంపును జులై 1, 2024 నుంచి లెక్కిస్తారు. కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను ఏడాదికి రెండుసార్లు - జనవరిలో ఒకసారి, జులైలో మరోసారి పెంచుతారు. డీఏ పెంపు ప్రకటన ఆలస్యమైతే, బకాయిలతో కలిపి ఉద్యోగులు & పెన్షనర్లకు చెల్లిస్తారు. సాధారణంగా, డియర్‌నెస్ అలవెన్స్ పెంపు ప్రకటన ఆలస్యం అవుతుంటుంది. ద్రవ్యోల్బణం (Inflation) ప్రభావం నుంచి ఉద్యోగులు & పెన్షనర్లను రక్షించడానికి కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు డియర్‌నెస్ అలవెన్స్ ఇస్తాయి.
దీపావళికి ముందు జీతం పెంపు
ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ కొనసాగుతోంది. ఈ నెలాఖరులో దీపావళి పండుగ రానుంది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కరవు భత్యాన్ని (Dearness Allowance) పెంచితే, కోట్లాది మందికి ఈ రోజే దీపావళి గొప్ప బహుమతి లభిస్తుంది. దీపావళికి ముందే ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ రేట్లను పెంచి ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
మరో ఆసక్తికర కథనం: గోల్డ్ బాండ్లలో రూపాయికి రూపాయి లాభం - ఈ ఇన్వెస్టర్లు వెరీ లక్కీ