Netflix Lays Off Employees: ప్రపంచంలోని అతిపెద్ద ఓటీటీ కంపెనీ నెట్‌ఫ్లిక్స్‌ (NetFlix) మరో 300 మందిని ఉద్యోగాల్లోంచి తొలగించింది. కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో ఇది నాలుగు శాతం కావడం గమనార్హం. తొలిదశలో భాగంగా నెట్‌ఫ్లిక్స్‌ గత నెల్లో 150 మందిని తొలగించింది. దశాబ్దకాలం తర్వాత ఈ కంపెనీ తొలిసారి భారీ స్థాయిలో సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. అందుకే నెలవారీ చందా తగ్గించేందుకు ఇలా ఖర్చులను తగ్గించుకుంటున్నట్టు తెలిసింది.


'మా వ్యాపారంలో మేం మరిన్ని పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం. అందుకే మేమిలా సర్దుబాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం మా రాబడి వృద్ధిరేటు తగ్గింది. ఖర్చులు తగ్గించుకుంటున్నాం' అని నెట్‌ఫ్లిక్స్‌ మంగళవారం వెల్లడించింది.


Also Read: కస్టమర్స్ అలర్ట్‌! జులైలో బ్యాంకులకు ఏకంగా 14 రోజులు సెలవు!


Also Read: వరుసగా రెండోరోజు లాభాల కళ! భారీగా పెరిగిన సెన్సెక్స్‌, నిఫ్టీ


ఉక్రెయిన్‌ యుద్ధం, ధరల పెరుగుదల ఒత్తిడితో ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్‌ కంపెనీ అయిన నెట్‌ఫ్లిక్స్‌ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ప్రత్యర్థుల నుంచి పోటీ పెరగడంతో చందాదారులు తగ్గిపోయారు. ఈ ఏడాది తొలి క్వార్టర్లోనూ తగ్గడంతో ఈ క్వార్టర్లోనూ నష్టాలు మరింత పెరుగుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. అందుకే వారిని తిరిగి కస్టమర్లను సంపాదించుకొనేందుకు సబ్‌స్క్రిప్షన్ల రేటును తగ్గించేందుకు నెట్‌ఫ్లిక్స్‌ ప్లాన్‌ చేస్తోంది. అలాగే ప్రకటనల మద్దతు ప్రణాళికలను అమలు చేయనుంది.


'ఉద్యోగులు చేసిన సేవలకు మేం కృతజ్ఞతగా ఉంటాం. ఇలాంటి సంక్లిష్టమైన సంధి దశలో మేం వారికి అండగా ఉంటాం' అని నెట్‌ఫ్లిక్స్‌ ఉద్యోగుల గురించి మాట్లాడింది. 2022 తొలి త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్‌ 2 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. వెళ్లిపోయిన వారిని తిరిగి తెచ్చుకొనేందుకు కొత్తగా ప్లాన్లు చేస్తోంది. కంపెనీ షేరు ధర సైతం పడిపోవడంతో ఉద్యోగుల స్థైర్యం దెబ్బతింది. ఉద్యోగులకు లేఆఫ్లు ఇవ్వడంతో ఎడిటోరియల్‌ స్టాఫ్‌ను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకొని ఖర్చులు తగ్గించుకుంటోంది.