Stock Market Weekly Review: ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు చాలా రోజుల తర్వాత కళకళలాడాయి. చివరి వారం మంచి లాభాలను అందించాయి. వరుసగా నష్టపోతున్న సూచీలు ఈసారి కాస్త పుంజుకున్నాయి. చివరి 9 వారాల్లో 8 సార్లు నష్టపోయిన బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు ఈ వారం 3 శాతానికి పైగా ఎగియడంతో ఇన్వెస్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటితో నష్టాలకు చెక్‌ పడ్డట్టేనా? గత వారం ఎలా సాగింది? ఎంత లాభం వచ్చిందో చూసేద్దాం!


రూ.6.5 లక్షల కోట్ల లాభం


జూన్‌ 20తో మొదలైన ఈ వారంలో మార్కెట్లు ఐదు రోజులు నడిచాయి. ఏకంగా నాలుగు సెషన్లు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) లాభాల్లో ముగిసింది. కేవలం ఒక్కరోజే నష్టాల్ని చూసింది. 51,360 వద్ద సెన్సెక్స్‌ మొదలైంది. 51,063 వద్ద వారాంతపు కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత పుంజుకొని 52,905 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 2.66 శాతం లాభపడి 52,727 వద్ద ముగిసింది. అంటే 1364 పాయింట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపద దాదాపుగా రూ.6.5 లక్షల కోట్ల మేర పెరిగింది.


Also Read: ఆ కెప్టెన్‌ 23 ఏళ్ల కల ఇప్పుడు నిజమైంది! రంజీ విజేత మధ్యప్రదేశ్‌


లాభాల్లో నిఫ్టీ


ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం ఇదే దారి అనుసరించింది. 15,345 వద్ద సోమవారం మొదలైంది. 15,192 వద్ద వారాంతపు కనిష్ఠాన్ని తాకింది. 15,749 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. 2.65 శాతం లాభంతో 15,699 వద్ద ముగిసింది. అంటే 404 పాయింట్లు పెరిగింది. అదే కనిష్ఠంతో పోల్చుకుంటే 507 పాయింట్లు ఎగిసింది.


ట్రెండ్‌ రివర్సల్‌?


మార్కెట్లో ట్రెండ్‌ రివర్సల్‌ అయిందా అంటే చెప్పలేని పరిస్థితే! మొత్తానికి సూచీల్లో అమ్మకాలు బాటమ్‌కు చేరుకున్నాయి. ఈ వారం రిలీఫ్ ర్యాలీ వచ్చినట్టు కనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ధరల పెరుగుదల కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం గణాంకాలు ఇప్పటికే రావడంతో మదుపర్లు వాటికి అలవాటు పడినట్టు కనిపిస్తోంది. అమెరికా మాంద్యంలోకి అడుగుపెడుతున్న వార్తలు మాత్రం కలవరం కలిగిస్తున్నాయి. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసుల వల్ల సరఫరాకు ఆటంకం కలిగితే మార్కెట్లు పడే అవకాశం ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ హెచ్చుతగ్గులకు లోనవుతోంది.