Madhya Pradesh clinch maiden Ranji Trophy title: మధ్య ప్రదేశ్‌ అద్భుతం చేసింది! కొన్నేళ్లుగా ఊరిస్తున్న కలను నిజం చేసుకుంది. దేశవాళీ క్రికెట్లో తిరుగులేని ముంబయిని చిత్తు చేసింది. 2022 రంజీ ట్రోఫీ విజేతగా ఆవిర్భవించింది. 23 ఏళ్ల క్రితం జట్టును ఫైనల్‌కు చేర్చిన అప్పటి కెప్టెన్‌, ప్రస్తుత కోచ్‌కు ఊహించని బహుమతిని అందజేసింది. ఫైనల్లో ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో ఛేదించింది. కీలక ఆటగాళ్లైన అవేశ్‌ ఖాన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ లేకుండానే మధ్యప్రదేశ్‌ విజయ దుందుభి మోగించడం ప్రత్యేకం.


ఈ సీజన్లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్‌ (134) శతకానికి తోడు ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ (78) దంచికొట్టడంతో తొలి ఇన్నింగ్స్‌లో ముంబయి 127.4 ఓవర్లకు 374 పరుగులకు ఆలౌటైంది. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్‌ తిరుగులేని ఆధిపత్యం చలాయించింది. ఆ జట్టులో ఏకంగా ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు కొట్టారు. ఓపెనర్‌ యశ్‌ దూబె (133), వన్‌డౌన్‌లో శుభమ్‌ శర్మ (116), ఐపీఎల్‌ ఎలిమినేటర్లో సెంచరీ వీరుడు రజత్‌ పాటిదార్‌ (122) భారీ స్కోర్లతో ఎంపీకి 177.2 ఓవర్లకు 536 స్కోరు అందించారు.


రెండో ఇన్నింగ్స్‌లో 162 లోటుతో బరిలోకి దిగిన ముంబయిని మధ్యప్రదేశ్‌ త్వరగానే పెవిలియన్‌కు చేర్చింది. 57.3 ఓవర్లకు 269కి ఆలౌట్‌ చేసింది. స్పిన్నర్ కుమార్‌ కార్తికేయ 4 వికెట్లతో చెలరేగాడు. ముంబయిలో సువెద్‌ పార్కర్‌ (51) ఒక్కడే అర్ధశతకం చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఎంపీ 107 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్‌ హిమాన్షు మంత్రి (37), శుభమ్‌ శర్మ (30), రజత్‌ పాటిదార్‌ (30 నాటౌట్‌) విలువైన పరుగులతో 29.5 ఓవర్లకే జట్టుకు విజయం అందించారు. శుభమ్‌ శర్మ మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.