Tirumala Tickets : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను రేపు(జూన్ 27) టీటీడీ విడుదల చేయనుంది. సెప్టెంబరు నెల‌కు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆన్‌లైన్ లో టీటీడీ విడుదల చేయనుంది. మొత్తం 46,470 టికెట్లలలో.. లక్కీ డిప్ సేవా టిక్కెట్లు 8070 ఉన్నాయి. అదేవిధంగా ముందు వ‌చ్చిన వారికి ముందు అనే  ప్రాతిప‌దిక‌న‌ 38,400 టికెట్లు కేటాయిస్తాయి. ఆర్జిత సేవలైన సుప్రబాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన టికెట్లు లక్కీ డిప్‌లో కేటాయించనున్నారు. దీని కోసం భక్తులు జూన్ 27 ఉదయం 10 నుంచి జూన్ 29 ఉదయం 10 గంటల మధ్య ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి‌. ఆన్‌లైన్ లక్కీ డిప్ డ్రా తర్వాత టిక్కెట్‌ల నిర్ధారణ చేస్తారు. 


జూన్ 29న టికెట్ల జాబితా 


కేటాయించిన టికెట్ల జాబితా జూన్ 29 మధ్యాహ్నం 12 గంటల తర్వాత టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అదేవిధంగా భక్తులకు ఎస్ఎంఎస్, ఇ-మెయిల్‌ ద్వారా తెలియజేస్తారు. టికెట్లు పొందిన వారు రెండు రోజుల్లోపు టికెట్ ధ‌ర చెల్లించాల్సి ఉంటుంది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గుర్తించి సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు జూన్ 29వ తేదీ సాయంత్రం 4 గంటలకు విడుదలవుతాయి. వీటిని ముందుగా వచ్చిన వారికి ముందు అనే ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తారు. భక్తులు తమ సేవా టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు ఈ మార్గదర్శకాలను గమనించాలి టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. 


Also Read : Panchang 26June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, సంపూర్ణ ఆరోగ్యం కోసం సూర్యుడి మంత్రం


తిరుమలలో రద్దీ


తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండి వెలుపల వరకు క్యూలైన్ లో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శనివారం తిరుమల శ్రీవారిని 94,411 మంది దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. 46,283 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.41 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వారాంతం కావడంతో తిరుమలలో భక్తులు రద్దీ అధికంగా ఉంది. 


Also Read : Jagannath Rath Yatra 2022 : జులై 1న పూరీ జగన్నాథుడి రథయాత్ర, అక్కడ సగం చెక్కిన విగ్రహాలే ఎందుకుంటాయి!