15 BSE500 stocks rally up 10-29 percent this past week: అగ్రరాజ్యం అమెరికా మాంద్యం వైపు పయనిస్తోంది. ఉక్రెయిన్‌ యుద్ధంతో ఐరోపా దేశాలు విలవిల్లాడుతున్నాయి. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం ముప్పు ఇబ్బంది పెడుతోంది. ముడి చమురు ధరలైతే ఏకంగా ఏడిపించేస్తున్నాయి. దాంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు పతనం అవుతున్నాయి. భారత ఈక్విటీ సూచీలూ ఎరుపెక్కాయి! కొన్ని నెలలుగా లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. చివరి వారం మాత్రం చాలా కంపెనీలు రికవరీ బాట పట్టడం ఆనందం కలిగిస్తోంది.


చాలా సూచీల చార్టులను గమనిస్తే ఆర్‌ఎస్‌ఐ ఇండికేటర్లో డైవర్జెన్సీ చూపిస్తున్నాయి. చివరి వారం సెన్సెక్స్‌ 405 పాయింట్ల లాభంతో 15,699 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1367 పాయింట్ల లాభంతో 52,727 వద్ద క్లోజైంది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 2.38, 1.61 శాతం ఎగిశాయి. అత్యంత ముఖ్యమైన కంపెనీలు ఉండే బీఎస్‌ఈ 500 సూచీ 51౩ పాయింట్ల లాభంతో 21,223 వద్ద ముగిసింది. దాదాపుగా 340 స్టాక్స్‌ ఈ వారం గరిష్ఠ స్థాయిల్లో ముగిశాయి. 15 స్టాక్స్‌ అయితే 10-29 శాతం వరకు పెరిగాయి. కొన్ని స్టాక్స్‌ మాత్రం 22 శాతం పతనమయ్యాయి.


Also Read: వర్క్‌ ఫ్రం హోమ్‌ను చట్టబద్ధం చేయనున్న అక్కడి పార్లమెంటు!


Also Read: నీరవ్‌ మోదీ తరహా దొంగల కోసం 'బ్లాక్‌ చైన్‌' వల పన్నుతున్న ఆర్బీఐ!


బీఎస్‌ఈ 500 కంపెనీ ఐటీఐ అత్యధికంగా లాభపడింది. 28.52 శాతం ర్యాలీ చేసింది. కెమ్‌ప్లాస్ట్‌ సన్మార్‌ 19.14 శాతం పెరిగి 468, ఎంఎంటీసీ 16.22 శాతం పెరిగి రూ.39.75, అసాహి ఇండియా గ్లాస్‌, ఆప్టస్‌ వాల్యూ హౌజింగ్‌ ఫైనాన్స్‌ ఇండియా, రెస్పాన్సివ్‌ ఇండస్ట్రీస్‌ 13-16 శాతం వరకు పెరిగాయి. బైకులు, స్కూటర్ల ధర రూ.3000 వరకు పెంచుతామని ప్రకటించడంతో హీరో మోటోకార్ప్‌ షేరు 11.74 శాతం ఎగిసి రూ.2757 వద్ద ముగిసింది. రాబోయే నాలుగైదేళ్లలో మెరుగైన ఫలితాలు వస్తాయని ఏజెన్సీలు రేటింగ్‌ ఇవ్వడంతో జుబిలంట్‌ ఇంగ్రెవియా 11.43 శాతం పెరిగి రూ.492.65కు చేరింది. ఐనాక్స్‌ లీజర్‌, పీవీఆర్‌ విలీనానికి సెబీ ఆమోదం తెలపడటంతో ఐనాక్స్‌ లీజర్‌ షేరు 10.67 శాతం పెరిగి రూ.504 వద్ద స్థిరపడింది. కేఈసీ ఇంటర్నేషనల్‌ 9 శాతం పెరిగింది.


బ్రైట్‌కామ్‌ గ్రూప్‌ షేరు ఈ వారం అత్యధికంగా నష్టపోయింది. 22.25 శాతం పతనమై రూ.35.10 వద్ద ముగిసింది. వేదాంత, స్టార్‌ హెల్త్‌, ఎంఆర్‌పీఎల్‌, భారత్‌ డైనమిక్స్‌ వరుసగా 16, 14, 11, 10 శాతం పతనం అయ్యాయి. స్పైస్‌జెట్‌, కేపీఆర్‌ మిల్స్‌, నేషనల్‌ అల్యూమినియం కంపెనీ, హిందుస్థాన్‌ కాపర్‌, తన్లా ప్లాట్‌పామ్స్‌, బంధన్‌ బ్యాంక్‌ 8-10 శాతం పడ్డాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.