Work From Home Latest News: ఇంటి నుంచి పని! ఇప్పుడొక అవసరంగా మారిపోయింది. చాలా కంపెనీలు హైబ్రీడ్‌ వర్క్‌ మోడల్‌కు ఓకే చెబుతున్నాయి. ఎలాంటి ఇబ్బందీ లేకపోవడంతో వర్క్‌ ఫ్రమ్‌ను (Work From Home) ప్రోత్సహిస్తున్నాయి. ప్రస్తుతం కొవిడ్‌ సమస్య తగ్గుముఖం పట్టడంతో ఉద్యోగులు కార్యలయాలకు రావాలని కొన్ని కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్‌ పాలకులు వినూత్న ప్రతిపాదన తెరపైకి తేవడం సంచలనంగా మారింది.


ఇంటి నుంచి పని (WFH)ని చట్టబద్ధ హక్కుగా మార్చేందుకు నెదర్లాండ్స్‌ పాలకులు ఒక కొత్త చట్టాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఒకేవేళ దీనికి అక్కడి చట్టసభలు ఆమోదం తెలిపితే న్యాయబద్ధంగా రిమోట్‌ వర్కింగ్‌ ఫ్లెక్సిబిలిటీని అమలు చేస్తున్న తొలి దేశంగా రికార్డు సృష్టిస్తుంది.


Also Read: వరుసగా రెండోరోజు లాభాల కళ! భారీగా పెరిగిన సెన్సెక్స్‌, నిఫ్టీ


Also Read: నష్టాల్ని తట్టుకోలేక 300 ఉద్యోగుల్ని తీసేసిన నెట్‌ఫ్లిక్స్‌


కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల దాదాపుగా అన్ని కంపెనీలు ఇంటి నుంచి పని చేసేలా ఉద్యోగులను ప్రోత్సహించాయి. కొన్ని కంపెనీలైతే ఇన్‌సెంటివ్స్‌ సైతం ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్‌ కొనసాగింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అన్ని దేశాల్లోనే వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగవంతం కావడం, వైరస్‌ తీవ్రత తగ్గడంతో యాజమాన్యాలు ఉద్యోగులను తిరిగి రమ్మంటున్నాయి.


ఈ నేపథ్యంలో ప్రొ యూరోపియన్‌ డి-66 పార్టీకి చెందిన స్టీవెన్‌ వాన్‌ వేయెన్‌బర్గ్‌, గ్రీన్‌ పార్టీ సభ్యుడు సెన్నా మాటగ్‌  ఇంటి నుంచి పనిచేసే బిల్లును ప్రతిపాదిస్తున్నారని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. 2022, జులై 3న పార్లమెంటు మొదలవ్వగానే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. 'ఈ కొత్త చట్టానికి మార్గం సుగమం అయింది. ఉద్యోగులు, యాజమాన్య సంఘాలు మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు' అని వేయెన్‌బర్గ్‌ అన్నారు.


భారత్‌లోనూ చాలా వరకు కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను కొనసాగిస్తున్నాయి. మూడో వేవ్‌ తగ్గాక కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు పిలిపించాయి. తాజాగా నాలుగో వేవ్‌ అంచనా, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ దీనికే ఓటేసే అవకాశం కనిపిస్తోంది.