Stock Market Weekly Review:


కొన్ని వారాలుగా నిలకడగా రాణించిన భారత స్టాక్‌ మార్కెట్లలో పానిక్‌ సెల్లింగ్‌ మొదలైంది. ఏ క్షణాన చైనా జీరో కొవిడ్‌ పాలసీని ఎత్తేసిందో అంతర్జాతీయ మార్కెట్లు కుదేలయ్యాయి. డ్రాగన్‌ కంట్రీలో లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రపంచం కలవరపాటుకు గురవుతోంది. ఆసియా, ఐరోపా మార్కెట్లపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మూడు నెలల కనిష్ఠానికి చేరుకున్నాయి. ఈ వారం మార్కెట్లను సమీక్షించుకుంటే!


రూ.12 లక్షల కోట్లు ఆవిరి!


ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు రెండు వారాలుగా నష్టాల్లోనే ముగిశాయి. ఆఖరి 10 సెషన్లలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 4.85 శాతం పతనమైంది. కొన్నాళ్లుగా కొనసాగుతున్న బుల్‌రన్‌తో పోలిస్తే ఇదెంతో పెద్ద అవరోధం! డిసెంబర్‌ 11తో మొదలైన వారంలో సెన్సెక్స్‌ 1.09 శాతం నష్టపోగా ఈ వారం 3.76 శాతం కిందకు దిగింది. సోమవారం 61,770 వద్ద మొదలైన సూచీ 62,835 వద్ద వారాంతపు గరిష్ఠాన్ని తాకింది. 59,770 వద్ద కనిష్ఠాన్ని అందుకుంది. 59,845 వద్ద ముగిసింది. అంటే వారంలో 1925 పాయింట్లు కోల్పోయింది. గరిష్ఠం, కనిష్ఠంతో పోలిస్తే ఏకంగా 3065 పాయింట్లు నష్టపోయింది. డిసెంబర్‌ 11 నుంచి ఇప్పటి వరకు 2336 పాయింట్లు కోల్పోయింది. ఈ లెక్కన మదుపర్లు రూ.12 లక్షల కోట్ల వరకు నష్టపోయారు.


నిఫ్టీ మూడు వారాలుగా!


ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం బీఎస్‌ఈనే అనుసరించింది. రెండు వారాల్లో 3.76 శాతం పతనమైంది. వాస్తవంగా మూడు వారాలుగా నిఫ్టీ నష్టాల్లోనే ముగుస్తోంది. 4.8 శాతం మేర నష్టపోయింది. ఈ వారంలో 18,284 వద్ద మొదలైన సూచీ 17,780 వద్ద వారాంతపు కనిష్ఠాన్ని తాకింది. 18,475 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 17,806 వద్ద ముగిసింది. డిసెంబర్‌ 4న 18,719 వద్ద ఆరంభమైన సూచీ మూడు వారాల్లోనే ఏకంగా 913 పాయింట్లు దిగజారింది. ఏడు వారాలుగా నిలబెట్టుకున్న 18,000 స్థాయికి దిగువే ముగిసింది.


అప్రమత్తంగా ఇన్వెస్టర్లు!


స్టాక్‌ మార్కెట్లను చివరి వారం కొవిడ్‌ ఎక్కువగా ప్రభావం చేసింది. చైనాలో కేసులు పెరగడమే ఇందుకు కారణం. రెండేళ్లుగా అక్కడి ప్రభుత్వం జీరో కొవిడ్‌ పాలసీని అనుసరించింది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు రోడ్లమీదకు వచ్చి నిరసనలకు దిగడంతో లాక్‌డౌన్లను సడలించింది. అంతే ఒక్కసారిగా లక్షల్లో కేసులు నమోదువుతన్నాయి. ఒమిక్రాన్‌లోని బీఎఫ్‌7 వేరియెంట్‌ కేసులు రష్యా, జపాన్‌ ఇతర దేశాల్లోనూ నమోదవుతున్నాయి. భారత్‌లోనూ కొన్ని కేసులు వచ్చాయి. తాజా వేరియెంటుతో ప్రపంచవ్యాప్తంగా సప్లై చెయిన్‌ స్తంభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయో లేదోనన్న ఆందోళనతో మదుపర్లు తమ డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు. పెరిగిన ద్రవ్యోల్బణమూ ఇందుకు తోడైంది. కాస్త స్పష్టత వచ్చేంత వరకు మార్కెట్లు ఇలాగే తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది.


Also Read: PAN Aadhaar Link Last Date: పాన్ కార్డ్, ఆధార్ అనుసంధానానికి చివరి డెడ్‌లైన్ ఇదే, లేదంటే మీ PAN పనిచేయదు