PAN Aadhaar Link Last Date: పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడంపై ఆదాయ పన్ను విభాగం ఎప్పటినుంచో ప్రకటనలు చేస్తోంది. అయితే వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఆధార్‌తో అనుసంధానం చేసుకోని పాన్ కార్డులను పనిచేయనివిగా పరిగణిస్తామని ఆదాయపు పన్ను శాఖ శనివారం సర్క్యూలర్ జారీ చేసింది. పాన్ - ఆధార్ అనుసంధానం గడువును ఐటీ శాఖ పలుమార్లు పొడిగించింది. కానీ ఈసారి మాత్రం, ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ పాన్ కార్డ్ కలిగి ఉన్న వారిని హెచ్చరించింది.
ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మినహాయింపు కేటగిరీ కిందకు రాని పాన్ కార్డుదారులు మార్చి 31, 2023 లోపు ఆధార్‌తో పాన్ కార్డ్‌ను తప్పనిసరి లింక్ చేసుకోవాలని సూచించారు. ఎవరైనా పాన్ - ఆధార్ అనుసంధానం చేసుకోకపోతే ఏప్రిల్ 1, 2023 నుంచి వారి పాన్ కార్డు పనిచేయదు అని పేర్కొంది. కనుక కచ్చితంగా పాన్ కార్డును ఆధార్ లో లింక్ చేసుకోవాలని, లేకపోతే మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆదాయపు పన్ను శాఖ శనివారం (డిసెంబర్ 24న) ఓ ప్రకటనలో పేర్కొంది.
2023 మార్చి 31 వరకు తుది గడువు: ఐటీ శాఖ ట్విట్టర్
వచ్చే ఏడాది (2023) మార్చి 31వ తేదీ లోగా పాన్ - ఆధార్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగం చెబుతోంది. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం పాన్ - ఆధార్ అనుసంధానం తప్పనిసరని స్పష్టం చేసింది. మినహాయింపు వర్గంలోకి రాని వాళ్లంతా కచ్చితంగా పాన్- ఆధార్ లింకేజీ పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. ఈసారి మిస్సయితే మాత్రం పాన్ కార్డు పనికి రాకుండా పోతుందని, అప్పుడు తాము కూడా ఏం చేయలేమని ఆదాయ పన్ను విభాగం స్పష్టం చేసింది. పాన్ - ఆధార్ లింకేజీ పూర్తి కాకపోతే, 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆ పాన్ కార్డ్ ఇన్‌ఆపరేటివ్ (PAN Card Inactive)గా మారుతుందని ట్విటర్ తెలియజేసింది. గడువు తేదీ దగ్గరపడుతోంది కాబట్టి త్వరగా అనుసంధానం పూర్తి చేయండంటూ తన ట్వీట్‌లో ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.
వీరికి మాత్రం మినహాయింపు..
మే 2017లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మినహాయింపు వీరికి వర్తిస్తుంది. అస్సాం, జమ్మూ కాశ్మీర్, మేఘాలయ రాష్ట్రాల్లో నివసిస్తున్న వారు, ప్రవాస భారతీయులు, 80 ఏళ్లు పైబడిన వ్యక్తులకు దీని నుంచి మినహాయింపు ఇచ్చారు.
పాన్ కార్డు పనిచేయకపోతే ఆదాయపు పన్ను రిటర్న్ (IT Returns)ను దాఖలు చేయడం సాధ్యం కాదు అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT), మార్చి 30న జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. పాన్ పనిచేయకపోతే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం అన్ని పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. జరిమానాలతో పాటు కొన్ని సందర్భాలలో జైలు శిక్షకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.