Stock Market News In Telugu: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ఆప్షన్స్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual fund) ఒకటి. తక్కువ రిస్క్‌తో ఇన్వెస్ట్‌మెంట్‌ సేఫ్‌గా ఉండాలి, కొద్దిపాటి లాభాలు వచ్చినా చాలు అనుకునే వాళ్లకు మ్యూచువల్‌ ఫండ్స్‌ ఒక మంచి మార్గం. మార్కెట్ గురించి పెద్దగా అవగాహన, అనుభవం లేని పెట్టుబడిదార్లకు కూడా ఇవి బెస్ట్‌ ఛాయిస్‌. ఏ మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌నైనా ఒక ఎక్స్‌పర్ట్స్‌ టీమ్‌ నిర్వహిస్తుంది. కాబట్టి, పెట్టుబడిదారు నిశ్చితంగా ఉండొచ్చు. 


మ్యూచువల్‌ ఫండ్స్‌లో (MFs) క్రమశిక్షణతో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెడితే, ఒక పెద్ద కార్పస్‌ సృష్టించొచ్చు. ఇందుకు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (SIP) అద్భుతంగా పని చేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ఎఫెక్టివ్‌ టూల్‌ ఇది. SIP అంటే, మీకు వీలయినంత డబ్బును నెలనెలా ఫండ్‌ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం. అంటే, మీ బడ్జెట్‌ మీద పెద్ద భారం లేకుండా చిన్న మొత్తంతో MFలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లోనూ కొన్ని రకాలు ఉన్నాయి. మీకు నచ్చిన వేరియంట్‌ను ఎంచుకోవచ్చు.


సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ రకాలు: 


రెగ్యులర్ SIP 
రెగ్యులర్ SIP అనేది ఒక సాదా రకం. ఎక్కువ మంది ఫాలో అవుతున్న టైప్‌ ఇది. ఈ రూట్‌లో, నెలకు లేదా మూడు నెలలకు ఒకసారి నిర్ణీత మొత్తాన్ని క్రమపద్ధతిలో పెట్టుబడి పెట్టవచ్చు. స్థిరంగా పెట్టుబడి (Fixed Amount) పెట్టే సామర్థ్యంతో, దీర్ఘకాలం పాటు దానిని కంటిన్యూ చేయగల ఇన్వెస్టర్లకు రెగ్యులర్‌ SIP అనుకూలంగా ఉంటుంది.


స్టెప్-అప్ SIP
'నా ఆదాయం ప్రతి సంవత్సరం పెరుగుతుంది, దాని ప్రకారం పెట్టుబడిని కూడా పెంచుకుంటాను' అనుకునే ఇన్వెస్టర్‌కు ఇది ఈ రూటు సూటవుతుంది. స్టెప్-అప్ SIP ద్వారా, కాలానుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్‌ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లవచ్చు. ఆదాయాలు పెరినప్పుడల్లా పెట్టుబడిని పెంచాలనుకునే లేదా పెట్టుబడుల్లో వేగం పెంచాలనుకునే వాళ్లకు ఇది పనికొస్తుంది. SIP ఇన్‌స్టాల్‌మెట్స్‌ను ఏడాదికి లేదా ఆరు నెలలకు ఒకసారి పెంచుకుంటూ వెళ్లే ఆప్షన్‌ ఇందులో ఉంది.


ఫ్లెక్సిబుల్ SIP
మార్కెట్‌ హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్‌ మొత్తాన్ని సర్దుబాటు చేసుకునే స్వేచ్ఛను ఫ్లెక్సిబుల్‌ సిప్స్‌ పెట్టుబడిదార్లకు అందిస్తాయి. SIP మొత్తం ముందుగా నిర్ణయించిన ఫార్ములా ద్వారా నిర్ణయిస్తారు. మార్కెట్ పడిపోయినప్పుడు, దానిని అవకాశంగా తీసుకుని పెట్టుబడిదార్లు ఎక్కువ డబ్బును ఇన్వెస్ట్‌ చేయడానికి, మార్కెట్ పెరిగినప్పుడు SIP అమౌంట్‌ను తగ్గించడానికి ఈ ప్లాన్‌ వీలు కల్పిస్తుంది.


ట్రిగ్గర్‌ SIP
దీని ప్రకారం, పెట్టుబడిదార్లు ముందే పెట్టుకున్న కొన్ని కండిషన్ల ఆధారంగా SIP ఇన్‌స్టాల్‌మెంట్స్‌ ప్రారంభమవుతాయి. ఉదాహరణకు... ఒక ఇండెక్స్ ఒక స్థాయికి వచ్చినప్పుడు లేదా ఒక ఫండ్ పనితీరు ఒక లెవెల్‌కు చేరినప్పుడు పెట్టుబడి పెట్టడం లాంటి మార్కెట్ పరిస్థితులపై ఈ సిప్‌ ఆధారపడి ఉంటుంది. ట్రిగ్గర్‌ కండిషన్‌ నెరవేరినప్పుడు, మన అకౌంట్‌లో ఉన్న డబ్బు ఆటోమేటిక్‌గా ఇన్వెస్ట్‌ అవుతుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఈ దీపావళికి NRIలు బంగారం కొనొచ్చా, ఏ టైప్‌ గోల్డ్‌కు అనుమతి ఉంటుంది, వేటికి ఉండదు?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial