Loan Against Mutual Funds: చాలా మంది మ్యూచువల్ ఫండ్ ‍‌(MF) ఇన్వెస్టర్లకు మీడియం-టు-లాంగ్ టర్మ్ గోల్స్‌ ఉంటాయి. ఈక్విటీల తరహాలో షార్ట్‌ టర్మ్‌ గెయిన్స్‌ కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టరు. దీర్ఘకాలం పాటు MF స్కీమ్స్‌లో పెట్టే పెట్టుబడులు ఒక పెద్ద కార్పస్ ఫండ్‌ను సృష్టించగలవు. MFల్లో, టైమ్‌ టు టైమ్‌ తక్కువ మొత్తాలను (SIP‌) డిపాజిట్‌ చేయవచ్చు, లేదా ఒకే విడతలో పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టొచ్చు. ఇన్వెస్టర్ల వెసులుబాటును బట్టి ఇన్వెస్టింగ్‌ మెథడ్‌ మారుతుంది.


మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు, తమ MF అసెట్స్‌ను షూరిటీగా చూపించి ఏదైనా బ్యాంక్/ఫైనాన్సింగ్ కంపెనీ నుంచి లోన్‌ తీసుకోవచ్చు. సాధారణంగా, అన్‌-సెక్యూర్డ్‌ లోన్స్‌ కంటే తక్కువ వడ్డీ రేటుకే మ్యూచువల్ ఫండ్ అసెట్స్‌ ద్వారా రుణం దొరుకుతుంది.


MF ఇన్వెస్టర్లు మీడియం-టు-లాంగ్‌ టర్మ్‌ ఆలోచనతో పెట్టుబడి పెట్టినా, ఊహించని ఆర్థిక అవసరాల సమయంలో వాటిని రీడీమ్ చేయడానికి మొగ్గు చూపుతారు. ఇది, వాళ్ల లక్ష్య సాధనకు అడ్డు పడుతుంది. MF అసెట్స్‌ను వెనక్కు తీసుకోవడానికి బదులు, ఆ పెట్టుబడులపై లోన్‌ తీసుకోవాలి. దీనివల్ల ఆర్థిక అవసరం తీరుతుంది, మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి కొనసాగుతుంది. MF అసెట్స్‌ మీద లోన్‌ తీసుకుంటే, ఆ యూనిట్లు తాత్కాలికంగా ఫ్రీజ్‌ అవుతాయి, పెట్టుబడిదారు హక్కు తగ్గుతుంది. లోన్ క్లియర్‌ చేయగానే మళ్లీ పూర్తిస్థాయిలో హక్కు తిరిగి వస్తుంది.


మ్యూచువల్‌ ఫండ్‌ మీద లోన్‌ తీసుకోవడానికి అర్హతలు, ఇతర వివరాలు:


అర్హత
మ్యూచువల్ ఫండ్ ఆస్తులపై రుణాలను వ్యక్తిగత పెట్టుబడిదార్లు, NRIలు, వ్యాపారస్తులు, HUFలు, ట్రస్టులు, కార్పొరేషన్లు, ఇతర సంస్థలు తీసుకోవచ్చు. మైనర్లకు అనుమతి లేదు. బ్యాంక్/ఫైనాన్సింగ్ సంస్థ దరఖాస్తుదారు క్రెడిట్ స్కోర్‌తో సహా వివిధ ప్రమాణాల ఆధారంగా రుణ మొత్తం, కాల పరిమితి, వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. పెట్టుబడిదారుకు మెరుగైన క్రెడిట్ స్కోర్‌ ఉంటే, తక్కువ వడ్డీ రేటు కోసం బ్యాంక్‌తో బేరం ఆడవచ్చు.


ఎంత రుణం పొందవచ్చు?
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విషయంలో, నెట్‌ అసెట్‌ వాల్యూలో 50% వరకు లోన్‌ దొరుకుతుంది. స్థిర ఆదాయ మ్యూచువల్ ఫండ్స్‌లో నికర ఆస్తి విలువలో 70-80% వరకు రుణం అందుబాటులోకి వస్తుంది.


ప్రాసెస్‌ 
పెట్టుబడిదారు ఏదైనా బ్యాంక్/ఫైనాన్సింగ్ కంపెనీ బ్రాంచ్‌కు వెళ్లి మ్యూచువల్ ఫండ్స్‌పై రుణం తీసుకోవచ్చు. మీ దగ్గర అవసరమైన అన్ని పేపర్లు ఉంటే, చాలా ఫైనాన్స్ కంపెనీలు చాలా వేగంగా ప్రాసెస్‌ కంప్లీట్‌ చేస్తాయి, లోన్‌ మంజూరు చేస్తాయి. లోన్‌ కోసం ఆన్‌లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. 


రుణ వ్యయం
ఇది తాకట్టు (collateral) రుణం కాబట్టి, మ్యూచువల్ ఫండ్స్‌ రుణంపై వడ్డీ రేటు వ్యక్తిగత రుణం కంటే తక్కువగా ఉంటుంది. ప్రాసెసింగ్ లేదా ముందస్తు రుణం చెల్లింపు (foreclosure) ఛార్జీ కూడా తగ్గొచ్చు లేదా పూర్తిగా మాఫీ కావొచ్చు.


గుర్తుంచుకోవాల్సిన విషయాలు
రుణంలో కొంత భాగాన్ని చెల్లిస్తే, ఆ మేరకు మ్యూచువల్ ఫండ్ యూనిట్లు తాకట్టు నుంచి రిలీజ్‌ అవుతాయి
తాకట్టు యూనిట్లపై ఇన్వెస్టర్‌కు తాత్కాలిక హక్కు ఉన్నప్పటికీ డివిడెండ్స్‌ పొందడం, వాటిలో వృద్ధి కొనసాగుతుంది
బ్యాంక్/ఫైనాన్సింగ్ కంపెనీ ఆధీనంలో ఉన్న యూనిట్లను పెట్టుబడిదారు రీడీమ్ చేయలేడు


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: మళ్లీ భయపెడుతున్న గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial