Investment In Children Mutual Funds: పిల్లల భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగపడేలా, చిల్ర్డన్‌ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఇటీవలి సంవత్సరాలలో వేగంగా పెరుగుతున్నాయి. ఇటీవలి గణాంకాల ప్రకారం, ఆ తరహా మ్యూచువల్ ఫండ్‌ కంపెనీల 'నిర్వహణలో ఉన్న ఆస్తులు' (Assets Under Management లేదా AUM) గత 5 సంవత్సరాల్లో సుమారు 142 శాతం పెరిగాయి. ఇక్రా అనలిటిక్స్‌ (Icra Analytics) విడుదల చేసిన తాజా రిపోర్ట్‌లో ఈ డేటాను అందించింది.


నిర్వహణలోని ఆస్తుల విలువలో బూమ్‌
ఇక్రా అనలిటిక్స్‌ నివేదిక ప్రకారం, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌ AUM ఈ ఏడాది మే నెలలో రూ. 20,081.35 కోట్లకు పెరిగింది. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం, 2019 మే నెలలో ఈ మొత్తం రూ. 8,285.59 కోట్లు మాత్రమే. ఈ లెక్కన, గత ఐదు సంవత్సరాల్లోనే 'నిర్వహణలో ఉన్న ఆస్తుల' విలువ 142 శాతం పెరిగింది. 2023 మే నెల నుంచి 2024 మే నెల వరకు, ఏడాది కాలంలో AUM దాదాపు 31 శాతం పెరిగిందని నివేదిక చెబుతోంది.


మంచి లాభాలు అందించిన చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌
డేటా ప్రకారం, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌ అందించిన రాబడి కూడా గత సంవత్సరాల్లో ఆకర్షణీయంగా ఉంది. గత ఏడాది మే 31 నుంచి ఈ ఏడాది మే 31 వరకు, ఒక సంవత్సరంలో ఈ ఫండ్స్ 22.64 శాతం లాభాలను అందించాయి. చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌ తీసుకొచ్చిన రాబడులు, CAGR ప్రాతిపదికన, గత 3 సంవత్సరాల్లో 14.68 శాతంగా, గత 5 సంవత్సరాల్లో 12.71 శాతంగా ఉంది.


చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌ ఎలా పని చేస్తాయి?
పెట్టుబడిదార్లు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. సాధారణంగా, ఈ మ్యూచువల్ ఫండ్స్‌ 5 సంవత్సరాల లాక్-ఇన్ పిరియడ్‌తో ఉంటాయి. అంటే, ఐదేళ్ల వరకు వీటిని వెనక్కు తీసుకోవడానికి వీలు కాదు. అంతేకాదు, పిల్లల కోసం నిరంతర పొదుపు, పెట్టుబడులను ఇవి ప్రోత్సహిస్తాయి.


ప్రస్తుతం మన దేశంలో విద్య ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది. పిల్లల ఉన్నత చదువుల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఇక్రా అనలిటిక్స్‌ ప్రకారం, విద్య ద్రవ్యోల్బణం ప్రస్తుతం 11-12 శాతంగా ఉంది, ఇది సాధారణ ద్రవ్యోల్బణం కంటే రెట్టింపు. అంటే, పిల్లల చదువులపై ఏటా 11-12 శాతం ఖర్చు పెరుగుతోందని అర్థం. పిల్లల వివాహాల కోసం కూడా పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. కొన్ని ఊహించని పరిస్థితులు కూడా ఎదురుకావచ్చు. అలాంటి సందర్భాల కోసం డబ్బును సిద్ధం చేయడానికి పెట్టుబడిదార్లు చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకుంటున్నారు. ఇంతకుముందు కంటే ఇప్పుడు చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్‌లో ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇదే కారణం.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: వాటికి దూరంగా ఉండండి - ఖాతాదార్లకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ హెచ్చరిక