HDFC Securities Alert: మన దేశంలో, రిటైల్‌ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌ మీద ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దలాల్‌ స్ట్రీట్‌లోకి వచ్చే చిన్న పెట్టుబడిదార్ల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. దీంతోపాటే స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఎక్కువ లాభాల వలలో పడుతున్న ఇన్వెస్టర్లు చివరకు బాధితులుగా మారి నష్టాలు చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, బ్రోకరేజ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ మార్కెట్ పెట్టుబడిదార్లను అలెర్ట్‌ చేసింది.


నకిలీ వాట్సప్‌ గ్రూపుల విషయంలో అప్రమత్తత అవసరం
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్, తన కస్టమర్‌లు & మార్కెట్ ఇన్వెస్టర్లు సహా వినియోగదార్లందరినీ అప్రమత్తం చేసింది. స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులకు సంబంధించిన నకిలీ వాట్సప్‌ గ్రూపులకు దూరంగా ఉండాలని సూచించింది. మీరు ఇప్పటికే ఏదైనా గుర్తు తెలియని వాట్సప్‌ గ్రూప్‌లో ఉన్నా, మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని ఏదైనా వాట్సప్‌ గ్రూప్‌లో జాయిన్‌ చేసినా.. వెంటనే దాన్నుంచి ఎగ్జిట్‌ కావాలని కూడా హెచ్చరించింది. అంతేకాదు, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పేరుతో వాట్సప్‌లో నకిలీ గ్రూపులు నడుస్తున్నాయని వెల్లడించింది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు మంచి రాబడులు అందిస్తామనే హామీలు ఆ గ్రూపుల్లో కనిపిస్తున్నాయని, అలాంటి గ్రూపులకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. 


సదరు వాట్సప్‌ గ్రూప్‌లోని చిట్కాలు ఫాలో అయ్యాక తాము భారీ లాభాలు సంపాదించామని చెబుతూ, లాభాలు కనిపించే స్క్రీన్‌ షాట్లను కొందరు వ్యక్తులు ఆ గ్రూపుల్లో పోస్ట్‌ చేస్తుంటారని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. అలా పోస్ట్‌ చేస్తున్న వ్యక్తులంతా మోసగాళ్ల ముఠాలోని సభ్యులేనని, ఆ స్క్రీన్‌ షాట్లు ఫేక్‌ అని వివరించింది. 


విశ్వసనీయ సమాచారం, సొంత పరిశోధన అవసరం
ఎలాంటి లావాదేవీలకైనా అధికారిక ఛానెల్స్‌ను మాత్రమే ఉపయోగించాలని యూజర్లకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సూచించింది. వాట్సప్‌లో, తమ కంపెనీ పేరుతో నడుస్తున్న నకిలీ గ్రూప్‌ల్లో మంచి రాబడులను ఎరగా వేస్తున్నారని, అందులో చేరిన సభ్యుల ఆర్థిక సమాచారాన్ని చోరీ చేస్తున్నారని హెచ్చరించింది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ పేరుతో ఏదైనా సందేశం వస్తే, అది నిజమో లేదా నకిలీయో పెట్టుబడిదార్లు ముందుగా ధృవీకరించుకోవాలని చెప్పింది. పెట్టుబడికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా.. విశ్వసనీయ సమాచారం ఆధారంగా, సొంతంగా సమగ్ర పరిశోధన చేసిన తర్వాత తీసుకోవాలని ఈ బ్రోకింగ్‌ కంపెనీ సలహా ఇచ్చింది.


వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దు
వాట్సప్‌ లేదా మరే ఇతర అనధికారిక ఛానెల్ ద్వారా ఆధార్ లేదా పాన్ కార్డ్ లేదా వినియోగదారుకు సంబంధించిన ఏ వ్యక్తిగత సమాచారాన్ని తాము అడగబోమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. వినియోగదార్లను ఏ వాట్సప్‌ గ్రూప్‌లోను కంపెనీ యాడ్‌ చేయదని, అధికారిక ప్లాట్‌ఫామ్ వెలుపల చెల్లింపులు చేయమని అడగదని వెల్లడించింది. ఈ తరహా మోసాలను నివారించడానికి, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ వెబ్‌సైట్ లేదా అధీకృత యాప్ స్టోర్‌ నుంచి అధికారిక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. 


స్టాక్‌ మార్కెట్‌ ఎప్పుడూ సాఫీగా సాగదు, ఒడుదొడుకుల ప్రయాణం తప్పనిసరి. ఈ అస్థిరత కారణంగా, ఎంతటి అనుభవజ్ఞుడైనా స్టాక్‌ మార్కెట్‌లో అన్నిసార్లు లాభాలను చూపించలేడు, కచ్చితమైన లాభాలకు హామీ ఇవ్వలేడు. ఒకవేళ, మీరు పెట్టుబడి పెడితే తాము ట్రేడ్‌ చేసి కచ్చితంగా లాభాలు తీస్తామని ఎవరైనా హామీ ఇస్తే, వాళ్లు కచ్చితంగా మోసగాళ్లే. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండడమే మంచిది. అత్యాశకు పోయి అలాంటి వ్యక్తుల వలలో పడితే, మీ దగ్గర ఉన్నదంతా ఊడ్చుకెళతారు.


మరో ఆసక్తికర కథనం: రిఫండ్‌ ఫెయిల్ అయిందా? - బ్యాంక్‌ ఖాతా వివరాలను వ్యాలిడేట్‌ చేయలేదేమో?