Mutual Fund Portfolios At Record Number: కొత్త సంవత్సరం మొదటి నెలలో మ్యూచువల్ ఫండ్స్ రికార్డ్ సృష్టించాయి. స్టాక్ మార్కెట్‌లోకి, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతున్న ఇన్వెస్టర్ల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. 2024 జనవరి నెలలో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినవాళ్ల సంఖ్య మునుపెన్నడూ లేనంత స్థాయికి చేరింది.
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ సంస్థ ఆంఫి (Association of Mutual Funds in India - AMFI) రిలీజ్ చేసిన డేటా ప్రకారం... 2024 జనవరిలో, మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడుల కోసం 46.7 లక్షల కొత్త ఖాతాలు ఓపెన్ అయ్యాయి. 2023లోని అన్ని నెలల సగటు 22.3 లక్షల కంటే ఇది రెట్టింపు.
జనవరిలో 46.7 లక్షల కొత్త ఖాతాలు తెరవడంతో, మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోల (Total Portfolios in Mutual Funds) సంఖ్య 16.96 కోట్లకు చేరుకుంది, 17 కోట్ల మార్క్‌ను తాకడానికి అతి కొద్ది దూరంలో ఉంది. సరిగ్గా ఏడాది క్రితం, 2023 జనవరిలో మ్యూచువల్ ఫండ్ ఖాతాల మొత్తం సంఖ్య 14.28 కోట్లు. సంవత్సర కాలంలోనే పోర్ట్‌ఫోలియోల సంఖ్య 19 శాతం పెరిగింది.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదార్లు ఉపయోగించే ఖాతాలను పోర్ట్‌ఫోలియోలుగా పిలుస్తారు. ఒక వ్యక్తికి ఎన్ని పోర్ట్‌ఫోలియోలైనా ఉండొచ్చు.
పెరుగుతున్న ఆర్థిక అక్షరాస్యత
ఆంఫీ డేటా ప్రకారం, మ్యూచువల్ ఫండ్ ఖాతాల సంఖ్య నెలవారీగా (అంతకుముందు నెలతో పోలిస్తే) 3 శాతం పెరిగింది. 2023 డిసెంబర్‌లో మొత్తం 16.49 కోట్ల ఫోలియోలు ఉన్నాయి. డిజిటల్ పరికరాల వినియోగం, ఆర్థిక అక్షరాస్యత (Financial literacy), ఆదాయం పెరగడంతో ప్రజలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఫలితంగా స్టాక్ మార్కెట్ దిశగా వస్తున్నారు, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ మీద అవగాహన పెంచుకుంటున్నారు. నేరుగా స్టాక్ మార్కెట్‌లోకి దిగడం కంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల పెట్టుబడికి రిస్క్ తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో ఏకధాటిగా మ్యూచువల్ ఫండ్ ఖాతాలు తెరుస్తున్నారు. అంతేకాదు.. సంప్రదాయ పెట్టుబడి మార్గాలైన ఫిక్స్‌డ్ డిపాజిట్, పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్ వంటితో పోలిస్తే మ్యూచువల్ ఫండ్ పథకాల నుంచి వచ్చే రాబడి ఎక్కువగా ఉంటుందన్న ఆలోచన కూడా ఒక కారణం.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఫోలియో సంఖ్య విపరీతంగా పెంచుతున్న ఘనత జనరేషన్-Y (1981 - 1996 మధ్యకాలంలో జన్మించిన వాళ్లు) & జనరేషన్-Z (1997 – 2012 మధ్యకాలంలో జన్మించిన వాళ్లు) పెట్టుబడిదార్లకే దక్కుతుందని వైట్‌ఓక్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రతీక్ పంత్ చెబుతున్నారు.
కొత్త పెట్టుబడిదార్లలో ఎక్కువ మంది యంగ్ జనరేషన్ కాబట్టి, డిజిటల్ టెక్నాలజీలపై వాళ్లకు ఎంతో కొంత అవగాహన ఉంటోంది. మ్యూచువల్ ఫండ్స్‌లోకి ప్రవేశించడానికి డిజిటల్ ఛానెల్ మార్గాలను వాళ్లు ఉపయోగించుకుంటున్నారు. కొత్తగా ప్రారంభించిన 46.7 లక్షల కొత్త ఫోలియోల్లో 34.7 లక్షల ఖాతాలు ఈక్విటీ సంబంధిత మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టాయి. దీంతో, ఈ తరహా ఈక్విటీ ఫోలియోల సంఖ్య 11.68 కోట్లకు పెరిగింది.
రికార్డు స్థాయిలో సిప్స్
2024 జనవరిలో, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా పెట్టిన పెట్టుబడులు రికార్డు స్థాయిలో రూ.18,838 కోట్లకు చేరుకున్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌కు పెరుగుతున్న ఆదరణకు ఇది కూడా ఒక నిదర్శనం.
ప్రస్తుతం, మన దేశంలోని 45 మ్యూచువల్ ఫండ్ కంపెనీల నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (AUM) రూ.53 లక్షల కోట్లకు చేరింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: అదానీ గ్రీన్ ఘనత, ప్రపంచంలోనే అతి పెద్ద RE పార్క్ నుంచి సరఫరా షురూ