Adani Green Energy News: అదానీ గ్రూప్‌లోని పునరుత్పాదక ఇంధన విభాగమైన 'అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌', గుజరాత్‌లోని ఖవ్దా ప్రాజెక్ట్‌ నుంచి సౌర విద్యుత్‌ (Solar Power) ఉత్పత్తిని ప్రారంభించింది. ఇది, ప్రపంచంలోనే అతి పెద్ద పునరుత్పాదక ఇంధన పార్క్‌ ‍‌(World's Largest Renewable Energy Park). ఇక్కడ జనరేట్‌ అయిన విద్యుత్‌ను నేషనల్ గ్రిడ్‌కు అందించడం ప్రారంభమైంది.


గుజరాత్‌లోని కచ్‌లో ఉన్న ఖవ్దా ప్రాజెక్ట్‌ నుంచి తొలిసారిగా 551 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఈ రెన్యువబుల్‌ ఎనర్జీ (RE) పార్క్‌ పనిని ప్రారంభించినప్పటి నుంచి కేవలం 12 నెలల్లోనే విద్యుత్ ఉత్పత్తిని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సాధించింది. ఒకరకంగా, దీనిని రికార్డ్‌ స్థాయి పనితీరుగా భావించాలి.


అదానీ గ్రీన్ ఎనర్జీ ప్లాన్ ఇదీ..
ఖవ్దాలోని ఎనర్జీ పార్క్ నుంచి 30 గిగావాట్ల క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్నది అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) ప్రణాళిక. ఈ ఫ్లాంట్‌ ఏటా 81 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. 


ఖవ్దా రెన్యువబుల్‌ ఎనర్జీ ఎనర్జీ పార్క్ విశేషాలు (Features of Khavda Renewable Energy Park)


- ఈ పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్ట్‌ ద్వారా 1.61 కోట్ల ఇళ్లకు సరిపడా విద్యుత్ సరఫరా జరుగుతుంది.
- ఏటా 58 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది, భారతదేశ నెట్‌ జీరో మిషన్‌లో కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది.
- ఖవ్దా ఎనర్జీ పార్క్‌లో 8,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. సవాళ్లతో కూడిన రాన్ ఆఫ్ కచ్‌ ప్రాంతాన్ని, తన సిబ్బంది కోసం నివాసయోగ్యంగా మార్చింది అదానీ గ్రీన్ ఎనర్జీ.
- ఈ పార్క్‌లో ప్రాథమిక మౌలిక సదుపాయాలను కంపెనీ అభివృద్ధి చేసింది. రోడ్ల ద్వారా కనెక్టివిటీని పెంచడమే కాకుండా, స్థిరమైన సామాజిక పర్యావరణ వ్యవస్థను సృష్టించింది.
- ఖవ్దా పార్క్‌ ద్వారా 15,200 గ్రీన్ ఎనర్జీ ఉద్యోగాలు సృష్టి జరుగుతుంది.
- 60,300 టన్నుల బొగ్గు వినియోగం ఆదా అవుతుంది.


"అదానీ గ్రీన్ ఎనర్జీ, ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైన పునరుత్పాదక ఇంధన వ్యవస్థను నిర్మిస్తోంది. సౌర & పవన విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలని అదానీ గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా పెట్టుకుంది" - గౌతమ్ అదానీ


ఈ రోజు (బుధవారం, 21 ఫిబ్రవరి 2024) ఉదయం 10.15 గంటల సమయానికి, అదానీ గ్రీన్‌ షేర్లు BSEలో రూ.11.25 లేదా 0.58% పెరిగి రూ.1,939.15 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.


ఈ స్టాక్‌ గత ఆరు నెలల్లోనే దాదాపు 90% ర్యాలీ చేసింది. గత 12 నెలల్లో 240% జంప్‌ చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) 21% పైగా లాభపడింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: మళ్లీ కొత్త శిఖరం ఎక్కిన నిఫ్టీ బుల్‌, 10 శాతం పడిపోయిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌