Income Tax Rules On Cash Transaction Limit: ఆదాయ పన్ను విభాగం (Income Tax Department) కన్ను చాలా పెద్దది. ఇన్‌కమ్‌ టాక్స్‌ రూల్స్‌ మీరి చేసే ఎలాంటి లావాదేవీ అయినా దాని దృష్టి నుంచి తప్పించుకోలేదు. కొంతమంది తెలిసో/ తెలీకో నిబంధనలను మీరి నగదు లావాదేవీలు ‍‌(Cash Transactions) చేస్తుంటారు. అలాంటి సందర్భంలో ఐటీ నోటీస్‌ అందుకోవాల్సి వస్తుంది. సాధారణ ప్రజలకు అర్ధంకాని పదజాలంతో వచ్చే టాక్స్‌ నోటీస్‌ వాళ్ల బీపీ లెవెల్స్‌ను పెంచుతుంది. ఐటీ అధికార్ల నుంచి అనవసరంగా టెన్షన్‌ వద్దు అనుకుంటే, నిబంధనలు పాటించడం ఉత్తమమైన పని. నగదు లావాదేవీలకు సంబంధించి ఆదాయ పన్ను చట్టం నిబంధనలు తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తే, ఐటీ నోటీస్‌ బాధ తప్పుతుంది.


నిర్దిష్ట పరిమితి దాటిన ప్రతి క్యాష్‌ ట్రాన్సాక్షన్‌ మీద ఆదాయ పన్ను విభాగం నిఘా ఉంటుంది. ఒక వ్యక్తి, పరిమితికి మించి నేరుగా నగదు చేతులు మార్చినా, లేదా, ఆఫ్‌లైన్‌ మార్గంలో ట్రాన్స్‌ఫర్‌ చేసినా/ అందుకున్నా ఇన్‌కమ్‌ టాక్స్‌ నోటీస్‌ ఇంటికి వస్తుంది. దేశంలోని కోట్లాది మందిలో తనను ఏం పట్టించుకుంటారులే అనుకోవడం ఆ వ్యక్తి అమాయకత్వం అవుతుంది. ఆదాయ పన్ను అధికార్లు ముఖ్యంగా 5 రకాల నగదు లావాదేవీలను ఓ కంట గమనిస్తుంటారు. 


ఆదాయ పన్ను అధికార్ల దృష్టి పడే 5 రకాల లావాదేవీలు (5 types of transactions come under the focus of the Income Tax Department)


క్రెడిట్ కార్డ్ బిల్లు (Credit Card Bill): ఇప్పుడు, మన దేశంలో కోట్లాది మంది క్రెడిట్‌ కార్డ్‌లు వాడుతున్నారు. క్రెడిట్‌ కార్డ్‌ పరిమితి ఎంత ఉంటే అంత మొత్తానికీ మీరు కొనుగోళ్లు చేయవచ్చు. అయితే, క్రెడిట్ కార్డ్ బిల్లు రూపంలో ఒకేసారి లక్ష రూపాయల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే మాత్రం ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీస్‌ రావచ్చు. అంతేకాదు, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్లును నగదు రూపంలో చెల్లిస్తే, ఆ డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ఐటీ డిపార్ట్‌మెంట్‌ ఆరా తీస్తుంది.


ఆస్తి కొనుగోలు/అమ్మకం లావాదేవీ (Buy Or Sell A Property Property): ఏదైనా ఆస్తి కొన్నా లేదా అమ్మినా కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆస్తి రిజిస్ట్రేషన్‌ సమయంలో నగదు రూపంలో లావాదేవీ జరిపితే, ఆ వివరాలన్నీ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ నుంచి ఆదాయ పన్ను విభాగానికి చేరతాయి. రూ. 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తి లావాదేవీని (Property Transaction) నగదు రూపంలో చేస్తే ఐటీ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందుతుంది.


బ్యాంకు సేవింగ్స్ ఖాతా డిపాజిట్ (Bank Ssavings Account Deposit): రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి తన బ్యాంక్‌ పొదుపు ఖాతా/ ఖాతాల్లో ఎంత డబ్బయినా డిపాజిట్‌ చేయవచ్చు, దీనిపై ఎలాంటి పరిమితి లేదు. అయితే.. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పొదుపు ఖాతాల్లో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేస్తే మాత్రం ఆదాయ పన్ను విభాగం కాలింగ్‌ బెల్‌ మోగుతుంది. మీకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తూ ఐటీ నోటీస్‌ వస్తుంది. కరెంట్ ఖాతాల్లో గరిష్ట డిపాజిట్‌ పరిమితి రూ. 50 లక్షలు.


బ్యాంక్ ఎఫ్‌డీ (Bank FD): ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి లేదా ఎక్కువ దఫాలుగా బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో (Bank Fixed Deposit) రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో డిపాజిట్ చేస్తే, డబ్బు మూలం గురించి ఆదాయ పన్ను అధికార్లు అడుగుతారు. శాఖ మిమ్మల్ని డబ్బు మూలం గురించి అడగవచ్చు. కాబట్టి, ఆన్‌లైన్ పేమెంట్‌ లేదా బ్యాంక్‌ చెక్ రూపంలో ఎక్కువ డబ్బును ఎఫ్‌డీలో వేయడం మంచిది.


మ్యూచువల్ ఫండ్‌లు, షేర్లు, డిబెంచర్లలో పెట్టుబడులు ‍‌(Investments in Mutual Funds, Shares, Debentures): షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌, డిబెంచర్లు, బాండ్లలో పెద్ద మొత్తంలో నగదు రూపంలో లావాదేవీలు చేసినా ఐటీ నోటీస్‌ అందుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పెట్టుబడి మార్గాల్లో, ఒక ఆర్థిక సంవత్సరంలో, నగదు రూపంలో గరిష్టంగా రూ. 10 లక్షల లావాదేవీలు మాత్రమే చేసేందుకు వీలుంటుంది. దీనిని బట్టి ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ చేసుకోవాలి.


మరో ఆసక్తికర కథనం: సిప్‌లో ఈ పని చేస్తే మీ లాభాలు గోవింద, వైట్‌వోక్‌ క్యాపిటల్‌ హెచ్చరిక