IIFC IPO: ఇది ఐపీవోల సీజన్‌. వారానికి కనీసం ఒక్క ఐపీవో అయినా మార్కెట్‌లో సందడి చేస్తోంది. దాదాపుగా అన్నీ తమ ఇన్వెస్టర్లకు లిస్టింగ్‌ గెయిన్స్‌ ఇస్తున్నాయి. పరిస్థితులు బాగోలేక, గతంలో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌లను (IPO) వాయిదా వేసిన కంపెనీలు ఇప్పుడు ఒక్కొక్కటిగా పబ్లిక్‌లోకి వస్తున్నాయి. 2023 నుంచి ఐపీవో ట్రెండ్‌ కొనసాగుతోంది. కొన్ని కంపెనీల పబ్లిక్‌ ఆఫర్ల కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్న ఇన్వెస్టర్లు, అవి సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభించగానే భారీగా ప్రతిస్పందిస్తున్నారు. అందువల్లే, ఇటీవలి నెలల్లో వచ్చిన ఐపీవోలన్నీ ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అవుతున్నాయి.


ఐపీవోల్లో ప్రభుత్వ రంగ సంస్థలు మరింత ప్రత్యేకం. వీటికోసం పెట్టుబడిదార్లు ఎంతకాలమైనా ఎదురు చూస్తారు, సమయం రాగానే అవకాశాన్ని అందుకుంటారు. 2022 సంవత్సరంలో, దాదాపు రూ. 21 వేల కోట్ల విలువైన ఎల్‌ఐసీ ఐపిఓ (LIC IPO) మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు మరో ప్రభుత్వ సంస్థ కూడా ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఆ కంపెనీ పేరు "ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ" (IIFC). ఇది, ఈ ఏడాది చివరి నాటికి IPO సబ్‌స్క్రిప్షన్‌  ప్రారంభించవచ్చు.


బలంగా కంపెనీ ఆర్థిక స్థితి, IPOకు రావడానికి ఇదే సరైన సమయం
ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ ఎండీ పీఆర్ జైశంకర్ (IIFC MD P.R. Jaishankar) ఇటీవల జాతీయ మీడియాకు ముఖాముఖి ఇచ్చారు. తమ కంపెనీ ఐపీవో కోసం సన్నద్ధం అవుతోందని చెప్పారు. ఈ ఏడాదిలోనే ప్రైమరీ మార్కెట్‌లోకి తాము అడుగు పెట్టొచ్చని అన్నారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉందని. వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. IPO తీసుకురావడానికి ఇదే సరైన సమయమని జైశంకర్‌ స్పష్టం చేశారు. 


ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీని 2006 సంవత్సరంలో స్థాపించారు. దేశంలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం (రుణాలు) అందించడానికి ఈ సంస్థను ఏర్పాటు చేశారు.


ఆర్‌బీఐ కొత్త నిబంధనల ప్రభావం ఐఐఎఫ్‌సీపై ఉండదు!
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతిపాదించిన నిబంధనలపైనా జైశంకర్ మాట్లాడారు. ఆ నిబంధనలు కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపబోవని, తమ ప్రాజెక్టులు ఏవీ ప్రభావితం కావని చెప్పారు. అయితే, కొత్త నిబంధనల తుది ముసాయిదాను చూడాలని అన్నారు. ఆర్‌బీఐ కొత్త నిబంధనలపై అందరు వాటాదార్లతో చర్చిస్తున్నట్లు తెలిపారు. 


మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఇచ్చే రుణాలకు సంబంధించి నిబంధనలను కఠినం చేయబోతున్నట్లు ఆర్‌బీఐ ఇటీవలే ప్రకటించింది. దీనివల్ల ఫైనాన్సింగ్ కంపెనీల బాధ్యతలు పెరిగాయి. ఫైనాన్స్‌ కంపెనీలు, ఆయా ప్రాజెక్ట్‌ల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించవలసి ఉంటుంది. ప్రాజెక్టుల అమల్లో జాప్యం జరిగే అవకాశం ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: స్పెషల్‌ ట్రేడింగ్‌లో శుభారంభం - 74k దాటిన సెన్సెక్స్‌, బలం చూపిన స్మాల్‌ క్యాప్స్‌