Stock Market News Today in Telugu: అత్యవవసర పరిస్థితుల సన్నద్ధత కోసం సిద్ధం చేసిన DR సైట్‌ను పరీక్షించేందుకు ఈ రోజు (శనివారం, 18 మే 2024) చేపట్టిన ప్రత్యేక ట్రేడింగ్‌లో భారతీయ మార్కెట్లు శుభారంభం చేశాయి. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ తన బలాన్ని నిలబెట్టుకుంది, 74 వేల మార్క్‌ను దాటింది. శుక్రవారం యూఎస్ మార్కెట్లు సానుకూలంగా ముగియడం కూడా కలిసి వచ్చింది. గత సెషన్‌లో (శుక్రవారం) BSE సెన్సెక్స్ 73,917 దగ్గర క్లోజ్ అయింది, NSE నిఫ్టీ 22,466 దగ్గర ఆగింది.
ఈ రోజు మన మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
మన మార్కెట్ ఓపెన్ కావడానికి ముందు, గిఫ్ట్ నిఫ్టీ ఫుల్ గ్రీన్‌లో కనిపించింది, ప్రత్యేక సెషన్‌ను దాదాపు 50 పాయింట్ల (0.20 శాతం) ప్రీమియంతో ప్రారంభమవుతుందని సూచించింది. ప్రి-ఓపెన్ సెషన్‌లో, ప్రధాన సూచీలు BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ రెండూ గ్రీన్ జోన్‌లో ఉన్నాయి. నిఫ్టీ50 ప్రి-ఓపెన్‌లో దాదాపు 110 పాయింట్లు బలపడింది.
మార్కెట్ ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత, ఉదయం 9.15 గంటలకు, సెన్సెక్స్ 125 పాయింట్లకు పైగా లాభంతో 74,050 పాయింట్ల దగ్గర ఉంటే; నిఫ్టీ50 సూచీ 100 పాయింట్లకు పైగా లాభంతో 22,500 పాయింట్లు దాటింది.
విస్తృత మార్కెట్లలో... BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.48 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 0.6 శాతం చొప్పున పెరిగాయి.
మార్కెట్ ఓపెనింగ్ టైమ్‌లో, నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో.., ఓఎన్‌జీసీ 1.28 శాతం పెరిగింది. పవర్ గ్రిడ్, పవర్ గ్రిడ్, నెస్లే ఇండియా, గ్రాసిమ్ హీరో మోటార్స్ షేర్లు 0.85-0.70 శాతం మధ్య ర్యాలీ చేశాయి. మరోవైపు... జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 1.13 శాతం పడిపోయింది. దివీస్ ల్యాబ్, M&M, టాటా కన్జ్యూమర్, యాక్సిస్ బ్యాంక్ కూడా క్షీణతలో ఉన్నాయి.
రంగాల వారీగా చూస్తే.. అన్ని సెక్టార్లు గ్రీన్ జోన్‌లో కదులుతున్నాయి. నిఫ్టీ మీడియా ఇండెక్స్ 1.5 శాతం లాభాలతో అన్నిటికంటే ముందు నిలిచింది. నిఫ్టీ PSU బ్యాంక్, ఫార్మా మెటల్, ఆటో రంగాలు కూడా 0.50 శాతం పైగా బలపడ్డాయి.
ఈ రోజు ప్రత్యేక ట్రేడింగ్ 2 సెషన్లలో జరుగుతుంది. మొదటి సెషన్ ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు; రెండో సెషన్ ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు సాగుతుంది. రెండు సెషన్లలో అన్ని సెక్యూరిటీలకు 5 శాతం సర్క్యూట్ ఇచ్చారు. ఇప్పటికే 2 శాతం లేదా అంతకంటే తక్కువ సర్క్యూట్ ఉన్న షేర్లకు అదే కొనసాగుతుంది.
గ్లోబల్ మార్కెట్లు
గ్లోబల్ మార్కెట్ల పరిస్థితిని పరిశీలిస్తే, ఈ వారం అద్భుతంగా సాగింది. అమెరికన్ మార్కెట్లలో, వారం చివరి రోజు ట్రేడింగ్‌లో (శుక్రవారం), డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ తొలిసారిగా 40 వేల పాయింట్ల పైన క్లోజ్ అయింది. ఈ సూచీ 0.34 శాతం పెరిగింది. S&P 500 సూచీ స్వల్పంగా 0.12 శాతం పెరిగింది, నాస్‌డాక్ కాంపోజిట్ ఇండెక్స్ 0.07 శాతం స్వల్ప నష్టాన్ని చవిచూసింది. మొత్తం వారంలో డౌ జోన్స్ 1.24 శాతం, S&P 500 1.54 శాతం, నాస్‌డాక్ 2.11 శాతం బలపడ్డాయి.
అమెరికన్ బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ స్వల్పంగా పెరిగి 4.422 శాతానికి చేరింది. డిమాండ్ అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగాయి, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు $84 వద్ద ఉంది. చైనా, యూఎస్ ఆర్థిక డేటాలతో గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు ఒకసారిగా దూసుకెళ్లింది, ఔన్సుకు $2,419 దగ్గర ట్రేడ్ అవుతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి