TBO Tek Shares Listing: టీబీవో టెక్ ఐపీవో మంచి బజ్‌తో లిస్ట్‌ అయింది, ఇన్వెస్టర్లకు భారీ లాభాలను సంపాదించి పెట్టింది. TBO టెక్ షేర్లు, ఈ రోజు (బుధవారం, 15 మే 2024), నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ NSEలో రూ. 1426 ధర దగ్గర అరంగేట్రం చేశాయి. IPOలో ఒక్కో షేర్‌ ధర 920 రూపాయలు. ఈ లెక్కన TBO టెక్ స్టాక్‌ NSEలో 55 శాతం ప్రీమియంతో లిస్ట్‌ అయింది, పెట్టుబడిదార్లకు ఒక్కో షేర్‌ మీద రూ.506 లాభం అందించింది. అంటే, పెట్టుబడిదార్లు ప్రతి 100 రూపాయల పెట్టుబడిపై 55 రూపాయలు ప్రాఫిట్‌ సంపాదించారు.


బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ BSEలో ఒక్కో షేర్‌ రూ.1380 చొప్పున లిస్ట్‌ అయింది, ఇది 50 శాతం ప్రీమియం. ఈ ఎక్సేంజ్‌లో ఇన్వెస్టర్లు ఒక్కో షేరుకు రూ.460 చొప్పున లాభాన్ని ఆర్జించారు. 


TBO టెక్ IPO వివరాలు
TBO టెక్ ఐపీవో సైజ్‌ రూ.1550.81 కోట్లు. ఈ ఇష్యూ కోసం ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు బిడ్డింగ్ జరిగింది. కంపెనీ ప్రైస్ బ్యాండ్‌ను రూ.875 - రూ.920 మధ్య నిర్ణయించింది. ఈ పబ్లిక్‌ ఆఫర్‌కు పెట్టుబడిదార్ల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది, 86.70 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయింది. విడివిడిగా చూస్తే... అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదార్లకు (QIBs) కేటాయించిన వాటా 125.51 రెట్లు, NII కోటా 50.60 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్‌ 25.74 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయ్యాయి.


IPO ద్వారా సమీకరించిన రూ.1550.81 కోట్లలో రూ.400 కోట్ల విలువైన ఫ్రెష్‌ షేర్లు ఉన్నాయి. మిగిలిన వాటా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS)ది. ప్రమోటర్లు, ఇతర పెట్టుబడిదార్లు OFS ద్వారా 1,25,08,797 ఈక్విటీ షేర్లను అమ్మారు. కంపెనీ ప్రమోటర్లు OFS ద్వారా 52.12 లక్షల షేర్లను విక్రయించారు.


TBO టెక్ ఏ వ్యాపారం చేస్తుంది?
మన దేశంలోని అతి పెద్ద ట్రావెల్ పోర్టల్స్‌లో ఒకటి "ట్రావెల్‌ బొటిక్‌ ఆన్‌లైన్‌" (Travel Boutique Online). హౌసింగ్‌ సర్వీసులు, విమానయాన సంస్థలు, అద్దె కార్లు, క్రూయిజ్ లైన్స్‌, ఇన్సూరెన్స్, రైలు కంపెనీలతో సహా ప్రయాణ పరిశ్రమలో B2B విభాగంలో పని చేస్తుంది. ట్రావెల్ ఏజెన్సీలు, ఇండిపెండెంట్ ట్రావెల్ కన్సల్టెంట్లు వంటివి ఈ కంపెనీకి రిటైల్‌ కస్టమర్లు. కార్పొరేట్ కస్టమర్లలో టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీలు, సూపర్ యాప్స్‌, లాయల్టీ యాప్స్‌ ఉన్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: పేటీఎంకు గట్టి దెబ్బ - యెస్‌ బ్యాంక్‌, జొమాటో సహా 18 స్టాక్స్‌కు లాభం