Instagram Down: సోషల్ మీడియా వేదికల్లో ఈ మధ్యన సాంకేతిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. యాప్స్ వరుసగా డౌన్ అవుతున్నాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ మెసేజెస్ (Instagram), ఫేస్‌బుక్ మెసేంజర్ (Facebook Messenger) ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు చాలా మంది యూజర్లు పేర్కొంటున్నారు. అవతలి వారికి సందేశాలు పంపిన వెంటనే వాటంతట అవే మాయం అవుతున్నాయని ఫిర్యాదు చేశారు. దాదాపుగా 12 గంటల నుంచి ఈ ఇన్‌బాక్స్ ఇష్యూ మొదలైనట్టు తెలిసింది. బుధవారం మధ్యాహ్నానికీ కొన్ని ప్రాంతాల్లో పరిష్కారం దొరకలేదు.
సోషల్ మీడియా సమస్యలను పర్యవేక్షించే, గుర్తించే డౌన్ డిటెక్టర్ (Down Detector) ప్రస్తుత ఇష్యూని రికార్డు చేసింది. మంగళవారం రాత్రి నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన స్పైక్స్ వచ్చాయని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొన్నారని, ఫేస్‌బుక్ మెసేంజర్‌లోనూ ఇబ్బందులు వచ్చాయని డౌన్ డిటెక్టర్ పేర్కొనడం గమనార్హం.
Also Read: 18 నెలల్లో కోహ్లీ రన్స్ కన్నా 25 రోజుల్లో బెయిర్‌స్టో కొట్టిందే ఎక్కువట!
Also Read: 6 నెలల్లో ఈ అదానీ కంపెనీ షేరు కోట్లు కురిపిస్తుందట!
జులై 5, మంగళవారం రాత్రి 8 గంటలకు ఫిర్యాదుల పరంగా తొలి స్పైక్ వచ్చిందని డౌన్ డిటెక్టర్ తెలిపింది. రాత్రి 11 గంటలకు స్పైక్స్ తీవ్ర స్థాయికి చేరాయంది. 1200 మందికి పైగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిర్యాదు చేశారని వెల్లడించింది. జులై 6, బుధవారం ఉదయం 6 గంటలకు పరిస్థితి కొంత మెరుగవ్వగా ఇతర ప్రాంతాల్లో అలాగే ఉన్నట్టు గుర్తించారు.
ఇది పెద్ద సమస్యేమీ కాదు. ఇన్‌బాక్స్ వరకే పరిమితమైంది. ఇన్‌స్టాగ్రామ్‌లోని మిగతా ఫీచర్లన్నీ సాధారణంగానే పనిచేస్తున్నాయి. యాప్ యాక్సెస్, ఫీడ్ బ్రౌజింగ్‌లో ఎలాంటి ఇబ్బందుల్లేవు. ఇన్‌బాక్స్ ఇష్యూ రాగానే #instagramdown హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవ్వడం మొదలైంది. వెంటనే యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కొందరైతే ఫన్నీ మీమ్స్ షేర్ చేసుకున్నారు.
'ఎవరైనా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారా? అవతలి వారికి సందేశాలు పంపిస్తే మాయం అవుతున్నాయి. ఇది నా వరకే పరిమితం కాదనుకుంటాను. #instagramdown' అని ఒక యూజర్ ట్వీట్ చేశారు. ఈ సాంకేతిక సమస్యకు ప్రధాన కారణమేంటో తెలియలేదు. శాశ్వత పరిష్కారం ఎన్నాళ్లకు దొరుకుతుందో తెలియదు. కాగా మే 25న సైతం ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో లాగిన్ అయ్యేందుకు చాలామంది యూజర్లు ఇబ్బంది పడ్డ సంగతి తెలిసిందే.
Also Read: మరో అప్‌డేట్ ఇచ్చిన ఎన్‌పీఎస్ - ఈసారి రిస్క్‌కు సంబంధించి!!