National Pension Scheme: జాతీయ పింఛను పథకానికి (NPS) సంబంధించి పీఎఫ్‌ఆర్డీఏ (PFRDA) మరో అప్‌డేట్ ఇచ్చింది. గత నెలలో చెప్పినట్టే ఎన్‌పీఎస్ రిస్క్ ప్రొఫైల్స్‌ను ఖరారు చేసింది. అసెట్ క్లాస్, నష్టభయాల్ని బట్టి చందాదారులు మెరుగైన నిర్ణయాలు తీసుకొనేందుకు, పెట్టుబడిని కేటాయించేందుకు ఈ చర్య ఉపయోగపడుతుంది.
'ఈక్విటీ (E), కార్పొరేట్ డెట్ (C), ప్రభుత్వ సెక్యూరిటీలు (G), స్కీమ్ A వంటి అసెట్ క్లాస్‌లో టైర్ 1, టైర్ 2 ఖాతాలను ఎన్‌పీఎస్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ప్రతి స్కీమ్‌కు సంబంధించిన నష్టభయం వివరాలను (Risk Profiles) చందాదారులకు తెలియజేయాలి' అని 2022, మే 12న పీఎఫ్ఆర్డీఏ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
రిస్క్ ప్రొఫైళ్లు ఇవీ
- తక్కువ రిస్క్,
- తక్కువ నుంచి మోస్తరు రిస్క్,
- మోస్తరు రిస్క్,
- మోస్తరు నుంచి ఎక్కువ రిస్క్,
- ఎక్కువ రిస్క్,
- చాలా ఎక్కువ రిస్క్
ఎందులో చూడొచ్చు?
ఈ రిస్క్ ప్రొఫైళ్లను సంబంధిత పెన్షన్ ఫండ్ వెబ్‌సైట్లలో చూడొచ్చు. ప్రతి త్రైమాసికం ముగింపునకు 15 రోజులు ముందు 'పోర్టు ఫోలియో డిస్‌క్లోజర్' విభాగంలో వీటిని అప్‌డేట్ చేయాల్సి ఉంటుందని పీఎఫ్ఆర్డీఏ తెలిపింది.
రిస్క్ ప్రొఫైళ్లు వేటికి ఇస్తారు?
ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో టైర్ 1, టైర్ 2 ఖాతాలు నిర్వహిస్తున్నారు. వీటిని ఈక్విటీ (E), కార్పొరేట్ డెట్ (C), ప్రభుత్వ సెక్యూరిటీలు (G), స్కీమ్ A వంటి అసెట్ క్లాస్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నాలుగు విభాగాల వారు రిస్క్ ప్రొఫైళ్లను ప్రదర్శించాలి.
రేటింగ్ ఎలా ఇస్తారు?
ఈ పథకాలకు 0-12 విలువల వరకు క్రెడిట్ రిస్క్ రేటింగ్‌ను ఇస్తారు. ఉదాహరణకు క్రెడిట్ విలువ '0' ఉంటే అత్యధిక క్రెడిట్ క్వాలిటీ ఉందని అర్థం. '12'గా ఉంటే అత్యల్ప క్రెడిట్ క్వాలిటీగా పరిగణిస్తారు. పోర్టుపోలియోలో కేటాయింపు, సెక్యూరిటీల్లో పెట్టుబడుల ఆధారంగా క్రెడిట్ రిస్క్ స్కోరును ఇస్తారు.
ఎన్‌పీఎస్ ట్రస్టు ప్రతి మూడు నెలలకు రిస్క్ ప్రొఫైళ్లను సమీక్షిస్తుంది. మార్పు చేర్పులను వెబ్‌సైట్లో ఉంచుతుంది. ఏటా మార్చి 31న ఆయా స్కీముల రిస్క్ స్థాయిని ఎన్‌పీఎస్ రేటింగ్ ఇస్తుంది. ఆ తర్వాత చేసిన ప్రతి మార్పునూ వెబ్‌సైట్లో ప్రదర్శిస్తారు.
Also Read: ఎన్‌పీఎస్ కడుతున్నారా! బెనిఫిట్స్‌పై కీలక మార్పులు చేసిన పీఎఫ్ఆర్‌డీఏ!