National Pension Scheme: జాతీయ పింఛను పథకాన్ని (NPS) మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దేందుకు పింఛను నియంత్రణ సంఘం (PFRDA) నడుం బిగించింది. ఈ పథకంలో భారీ మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఈక్విటీల్లో ఎక్కువ పెట్టుబడి కేటాయింపు, ఒక ఏడాదిలో ఎక్కువసార్లు ఆస్తుల కేటాయింపులో మార్పులు, ఇష్టమైన ఫండ్ మేనేజర్లను ఎంచుకొనేందుకు అవకాశం ఇవ్వనుంది. వీటిద్వారా చందదారులకు ప్రయోజనం కలగనుంది.
ప్రస్తుతం పింఛను రంగంలో రూ.35 లక్షల విలువైన ఆస్తులను నిర్వహిస్తున్నారు. ఇందులో ఎన్‌పీఎస్ వాటా 21 శాతం. అంటే రూ.7.3 లక్షల కోట్లు. సాధారణంగా చందాదారులు తమ డబ్బును ఈక్విటీ (షేర్ మార్కెట్), ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్‌పీఎస్ (National Pension Scheme) అనుమతి ఇస్తుంది. ప్రత్యామ్నాయ ఆస్తుల్లోనూ కేటాయింపులు చేసేందుకు అనుమతి ఉంది.
ఏ రంగంలో ఎంత పెట్టుబడి పెట్టాలో చందారుడు ఏడాదిలో రెండు సార్లు మాత్రమే చెప్పేందుకు ఇంతకు ముందు ఆస్కారం ఉండేది. ఇప్పుడు టైర్ 1, టైర్ 2 ఖాతాల్లో ఆస్తుల మార్పునకు 4సార్లు అనుమతి ఇవ్వనున్నారు. టైర్ 1కు ఎక్కువ లాకిన్ పిరియడ్ ఉంటుంది. పన్ను ప్రయోజనాలతో సంబంధం ఉండటమే ఇందుకు కారణం.
ఎక్కువ సార్లు మార్చుకొనే అవకాశం ఇవ్వడం వల్ల మార్కెట్ పరిస్థితులను బట్టి ఆస్తులు కేటాయింపు చేసేకొనే అవకాశం చందాదారులకు వస్తుందని పీఎఫ్‌ఆర్‌డీఏ ఛైర్మన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ అంటున్నారు.
'ఒక ఏడాదిలో ఎక్కువసార్లు ఆస్తుల కేటాయింపు చేసుకొనే అవకాశం ఇవ్వాలని చాలామంది చందాదారులు కోరారు. దాంతో మేమిప్పుడు ఆ సంఖ్యను నాలుగుకు పెంచాం. అయితే ఎన్‌పీఎస్ సుదీర్ఘ కాలం కోసం ఏర్పాటు చేసిందన్న సంగతిని వారు గుర్తు పెట్టుకోవాలి' అని ఆయన తెలిపారు. ఆటోమేటిక్ మార్పును ఎంచుకొన్న వారు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. సందర్భం, వయసును బట్టి ఆస్తుల కేటాయింపును సమతూకం చేస్తారని వెల్లడించారు.
పెన్షన్ ఫండ్ మేనేజర్లు ప్రస్తుతం ఏడుగురే ఉన్నారు. ఇప్పుడు వారి సంఖ్య పదికి పెంచనున్నారు. యాక్సిస్, మాక్స్ లైఫ్, టాటాకు అనుమతి ఇచ్చారు. తుది ధ్రువీకరణ రాగానే వారు సేవలను ఆరంభించారు. ఇప్పుడు చందాదారులు ఎవరో ఒక్కర్నే ఫండ్ మేనేజర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. మున్ముందు ప్రైవేటు చందాదారులు ప్రతి అసెట్ క్లాస్‌కు ప్రత్యేక మేనేజర్‌ను ఎంచుకొనేందుకు ఆస్కారం ఉంది. టైర్-2 ఖాతాల్లో 100 నిధులను ఈక్విటీల్లోనే పెట్టుబడి పెట్టేందుకు పీఎఫ్‌ఆర్‌డీఏ అనుమతి ఇవ్వనుంది. ఈక్విటీల్లో రిస్క్ ఉంటుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్ తరహాలోనే చందారులకు రిస్కో మీటర్ ద్వారా అవగాహన కల్పిస్తామని సంస్థ తెలిపింది.
ఎన్‌పీఎస్ మార్కెట్ ఆధారిత రాబడి ఇస్తున్నప్పటికీ చందాదారులంతా తప్పక దానిని ఎంచుకోవాలన్న నిబంధనేమీ లేదు. ఈక్విటీ ఇష్టం లేని వారికి కనీస రాబడి అందించేలా పీఎఫ్‌ఆర్‌డీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. హామీ ఇచ్చిన రాబడి పదేళ్ల ప్రభుత్వ యీల్డుకు లింక్ చేయనుంది.