LPG Cylinder Security Deposit: ఓవైపు వంట నూనె ధరలు కొండెక్కి కూర్చుంటే మరోవైపు సిలిండర్ ధరలు సామాన్యులకు షాకుల మీద షాకులిస్తున్నాయి. ఇప్పటికే వంట గ్యాస్ ధరలు భగ్గుమంటుండగా.. మరోసారి ఎల్పీజీ సిలిండర్లకు సంబంధించి రేట్లు 50 శాతం మేర పెరిగాయి. కొత్తగా ఎల్పీజీ కనెక్షన్ తీసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్ (LPG Cylinder new connection security deposit) తప్పనిసరిగా చెల్లించాలి. సెక్యూరిటీ డిపాజిట్‌తో పాటు రెగ్యులేటర్‌కి కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కసారిగా సెక్యూరిటీ డిపాజిట్‌ను రూ.750 మేర పెంచారు. 


ఎల్పీజీ సిలిండర్ డిపాజిట్ సెగలు
వంటగ్యాస్ సిలిండర్ సెక్యూరిటీ డిపాజిట్ నగదును పెంచినట్లు ఇంధన కంపెనీలు మంగళవారం ప్రకటించాయి. దాంతో రూ.1,450 ఉన్న గృహ వినియోగ 14.2 కేజీల సిలిండర్ సెక్యూరిటీ డిపాజిటి ధర రూ.2,200లకు చేరుకుంది. 5 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై సైతం రూ.350 పెంచారు. దాంతో రూ.800 ఉన్న 5 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,150 అయింది. వీటితో పాటు రెగ్యూలేటర్‌కు ఇక నుంచి రూ.250 వసూలు చేస్తారు. అంటే రెగ్యూలేటర్‌కు రూ.100 పెంచారు. తాజాగా పెంచిన ధరలు జూన్ 16 నుంచి అమలులోకి రానున్నాయి. కొత్తగా ఎల్పీజీ కనెక్షన్లు తీసుకునే వారు 14.2 కేజీల సిలిండర్‌కు రూ.2,200 చెల్లించాలి. 


వారికి మాత్రం ఊరట..
కొత్తగా పెరిగిన ఎల్పీజీ కొత్త సిలిండర్ సెక్యూరిటీ డిపాజిట్ కొత్త ధరల నుంచి ప్రధాన మంత్రి ఉజ్వల్ భీమా యోజన లబ్ధిదారులకు మినహాయింపు కల్పించారు. వారికి పాత ధర రూ.1,450కే కొత్త 14.2 కేజీల సిలిండర్ కనెక్షన్ లభిస్తుందని ఇంధన కంపెనీలు ప్రకటించాయి. కాగా, హైదరాబాద్‌లో  14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధర రూ.1,055గా ఉంది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరలు హైదరాబాద్‌లో రూ.2425.50 గా ఉంది. ఏపీలో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1026.50, 19 కేజీల సిలిండర్ ధర 2363.50గా ఉంది. 


ప్రధాన నగరాలలో గ్యాస్ సిలిండర్ ధరలు
కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఇటీవల భారీగా తగ్గాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 135 మేర తగ్గిస్తూ, ఆయిల్ కంపెనీలు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నాయి. తగ్గించిన ధరలు జూన్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.2219కి దిగిరాగా, కోల్‌కతాలో రూ.2322, ముంబైలో రూ.2,171.50, చెన్నైలో రూ.2373కి లభ్యం కానుందని ఓ ప్రకటనలో తెలిపారు. గత నెలలో రూ.102.50 పెరగగా, తాజాగా కమర్షియల్ సిలిండర్ ధర దిగిరావడం ఊరటనిచ్చింది. 


Also Read: LPG Cylinder Subsidy : సామాన్యులకు కేంద్రం భారీ షాక్, ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ తొలగింపు 


Also Read: Gas Cylinders Explode: గ్యాస్‌ సిలిండర్‌ పేలితే బీమా పొందడం ఎలా? ఈజీ ప్రాసెస్‌ ఇదే!