Gas Cylinders Explode Insurance policy for gas cylinder blast Check coverage, process to file claim, other details: వంట గదిలో సిలిండర్లు పేలడం వల్ల కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతుంటాయి. దురదృష్టవశాత్తు చోటు చేసుకొనే ఈ ప్రమాదాల్లో ఆత్మీయులు ప్రాణాలు కోల్పుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం! ఒకవేళ అదృష్టం కొద్దీ బయటపడ్డా కాలిన గాయాలు శారీరకంగా, మానసికంగా వేధిస్తుంటాయి. తీవ్రతను బట్టి వైద్యానికి లక్షల్లో ఖర్చవుతుంటుంది. డబ్బుల్లేక చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతుంటాయి. అలాంటి వారికి ఎల్పీజీ గ్యాస్ ఇన్సూరెన్స్ అండగా ఉంటోంది.
* గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించడం వల్ల జరిగే నష్టాన్ని పూడ్చడానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs), డీలర్లు ఎల్పీజీ గ్యాస్ ఇన్సూరెన్స్ పాలసీను తీసుకుంటాయి. ఇది గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ. ప్రమాదంలో వ్యక్తులు గాయపడ్డా, మరణించినా, ఆస్తి నష్టం జరిగినా ఈ బీమా పరిహారం చెల్లిస్తుంది.
* ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ వినియోగదారుల పేరుతో ఎల్పీజీ బీమా తీసుకుంటాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి పరిహారం త్వరగా అందేలా చూస్తాయి.
* నేరుగా గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం సంభవిస్తేనే బీమా పరిహారం వర్తిస్తుంది. ఉదాహరణకు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయి దానివల్ల సిలిండర్ పేలితే బీమా రాదు. నేరుగా సిలిండర్ పేలి ప్రమాదం జరిగితేనే వర్తిస్తుంది.
* గ్యాస్ బీమా పరిహారం వివరాలను 2019 జులైలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ రాజ్యసభలో ప్రకటించింది. దీని ప్రకారం..
* గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తి మరణిస్తే రూ.6 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా వర్తిస్తుంది.
* ఒక వ్యక్తికి గరిష్ఠంగా రూ.200,000 చొప్పున మొత్తం ప్రమాద ఘనటకు రూ.30 లక్షల వరకు వైద్య ఖర్చులు చెల్లిస్తారు.
* ప్రమాదం వల్ల ఆస్తి నష్టం జరిగితే రూ.2 లక్షల వరకు పరిహారం ఇస్తారు.
* ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లందరికీ ఈ బీమా వర్తిస్తుంది. వారి పేరుతో పీఎస్‌యూ ఆయిల్ కంపెనీలు పాలసీ తీసుకుంటాయి. ప్రమాదం జరిగిన వెంటనే రాతపూర్వకంగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌కు సమాచారం అందించాలి.
* డిస్ట్రిబ్యూటర్ సంబంధిత కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ సమాచారం చేరవేస్తారు. ఫార్మాలిటీస్ పూర్తైన వెంటనే ఆయిల్ కంపెనీలు వినియోగదారుడికి అవసరమైన సాయం చేస్తాయి. ఇదే కాకుండా కస్టమర్లకు థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది.