Virat Kohli vs Jonny Bairstow: ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమ్‌ఇండియా ఓటమి పాలైంది. సిరీస్ 2-2తో సమమైంది. నిర్ణయాత్మక చివరి టెస్టులో ఇంగ్లిష్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో వరుసగా రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీలు కొట్టాడు. ఈ ఏడాది తిరుగులేని ఫామ్ కనబరుస్తున్నాడు. అయితే అతడి ఫామ్‌ను అడ్డం పెట్టుకొని విరాట్ కోహ్లీని ఇంగ్లాండ్ బార్మీ ఆర్మీ అనవసరంగా కవ్విస్తోంది. అవమాన పరిచేలా ట్వీట్లు పెడుతోంది.
గత 18 నెలల్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) చేసిన పరుగుల కన్నా చివరి 25 రోజుల్లో జానీ బెయిర్ స్టో (Jonny Bairstow) చేసినవే ఎక్కువని బార్మీ ఆర్మీ ట్వీట్ చేసింది. ఒక రకంగా అతడిని ఎగతాళి చేసింది! ప్రస్తుతం విరాట్ అంచనాలకు మించి రాణించడం లేదు. రెండున్నరేళ్లుగా ఒక్క సెంచరీ కొట్టలేదు. అతడి పేలవ ఫామ్‌ను గుర్తుచేస్తూ ఆంగ్లేయులు ట్వీట్లు చేయడం టీమ్‌ఇండియా అభిమానులను బాధిస్తోంది. ఒకప్పుడు ఇంగ్లాండ్ బౌలర్లను అతడెలా ఊచకోత కోశాడో మర్చిపోవద్దని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. అతడు టన్నుల కొద్దీ పరుగులు చేసేటప్పుడు బెయిర్‌స్టో పరిస్థితేంటో చూసుకోవాలని ఫైర్ అయ్యారు.
Also Read: ఓటమికి తోడు టీమ్‌ఇండియాకు మరో షాక్! WTC ఫైనల్ అర్హతకు ప్రమాదం!
Also Read: బాజ్ బాలా? అదేంటో తెలియదంటున్న రాహుల్ ద్రవిడ్
విరాట్ కోహ్లీ 2011లో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 102 మ్యాచులాడి 49.53 సగటు, 55.68 స్ట్రైక్‌రేట్‌తో 8,074 పరుగులు సాధించాడు. 27 సెంచరీలు, 28 అర్ధ శతకాలు అందుకున్నాడు. ఇక ఇంగ్లాండ్ గడ్డపై 16 మ్యాచులాడితే 33.32 సగటు 51 స్ట్రైక్‌రేట్‌తో 1033 రన్స్ కొట్టాడు. భారత్‌లో 46 మ్యాచులాడి 61 సగటు, 59 స్ట్రైక్‌రేట్‌తో 3847 పరుగులు చేశాడు. 2016, 2017, 2018లో 1000+ రన్స్ చేశాడు. 2012 నుంచి 2019 వరకు కనీసం 600కు తక్కువ కాకుండా విజృంభించాడు. 2020లో 3 టెస్టులాడి 116, 2021లో 11 మ్యాచులాడి 536, 2022లో 4 టెస్టుల్లో 220 సాధించాడు.
జానీ బెయిర్‌స్టో 2012లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 87 టెస్టులాడి 37 సగటు, 57 స్ట్రైక్‌రేట్‌తో 5415 రన్స్ చేశాడు. 12 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు అందుకున్నాడు. విరాట్ చేసిన 27 సెంచరీలతో పోలిస్తే ఓ లెక్కే కాదు! భారత గడ్డపై జానీ 8 మ్యాచుల్లో 29 సగటు, 49 స్ట్రైక్‌రేట్‌తో 389 పరుగులు చేశాడు. విరాట్‌తో పోలిస్తే ప్రత్యర్థి గడ్డపై సగమైనా కొట్టలేదు. సొంతదేశం ఇంగ్లాండ్ గడ్డపై 48 టెస్టుల్లో 39 సగటు, 61 స్ట్రైక్‌రేట్‌తో 3076 పరుగులు సాధించాడు. అంటే సొంతగడ్డపై కోహ్లీ కన్నా ఎక్కువ మ్యాచులాడి తక్కువ రన్స్ కొట్టాడన్నమాట. అతడి జీవితకాలంలో 1000+ రన్స్ కొట్టింది 2016లో మాత్రమే. 600+ రన్స్ చేసింది కేవలం నాలుగేళ్లే. 2016లో మూడు, 2017లో ఒకటి, 2018లో 2 సెంచరీలు కొట్టాడు. ఆ తర్వాత 2022లో 6 కొట్టాడు.
అందుకే బార్మీ ఆర్మీ ఒకసారి చరిత్రను చూసుకుంటే బెటరని కింగ్ కోహ్లీ అభిమానులు స్పందిస్తున్నారు. ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చాడంటే అతడినెవరూ ఆపలేరని సవాల్ చేస్తున్నారు. అనవసరంగా ఇలాంటి పోలికలు పెట్టొద్దని సూచిస్తున్నారు.