IND vs ENG, 5th Test: India docked two WTC points for slow overrate at Edgbaston : ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో (WTC) టీమ్‌ఇండియాకు మరో షాక్‌! ఇప్పటికే ఐదో టెస్టులో ఓటమితో సిరీస్‌ను ఇంగ్లాండ్‌తో పంచుకోవాల్సి వచ్చింది. దానికి తోడు స్లో ఓవర్‌రేటుతో ఇప్పుడు అత్యంత కీలకమైన మ్యాచ్‌ పాయింట్లను నష్టపోవాల్సి వచ్చింది.


ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో టీమ్‌ఇండియా నిర్దేశిత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేదు. కనీసం రెండు ఓవర్లను తక్కువగా వేశారు. దాంతో భారత జట్టు మ్యాచు ఫీజులో 40 శాతాన్ని రిఫరీ డేవిడ్‌ బూన్ కోసేశారు. అంతేకాకుండా 2 పాయింట్లను తగ్గించారు.


ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ సైకిల్‌లో టీమ్‌ఇండియా స్లో ఓవర్‌రేట్‌ మెయింటేన్ చేయడం ఇది మూడోసారి. దాంతో నాటింగ్‌హామ్‌ టెస్టులో రెండు పాయింట్లు, సెంచూరియన్‌ టెస్టులో ఒక పాయింటు కోల్పోయారు. ఎడ్జ్‌బాస్టన్‌లోనూ రెండు పాయింట్ల కోత విధించడంతో మొత్తంగా ఐదు పాయింట్లు నష్టపోయింది.


పాయింట్ల కోతతో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానానికి తగ్గింది. స్వల్ప ఆధిక్యంతో పాకిస్థాన్‌ నాలుగో స్థానానికి చేరుకుంది. భారత్‌కు 52.8 శాతం రేటింగ్‌ ఉండగా పాక్‌కు 52.38 శాతం ఉంది. పాయింట్ల కోతతో జట్లకు తీవ్ర నష్టం జరుగుతుంది. 2020లో బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌పై ఓవర్‌రేట్‌ తప్పిదంతో ఆస్ట్రేలియా ఫైనల్‌ చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక ఓవర్‌ తక్కువగా వేస్తే మ్యాచు ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు ఒక పాయింటును తగ్గిస్తారు.




IND vs ENG, 5th Test, Edgbaston Stadium: అనుకున్నదే జరిగింది! ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీసు గెలవాలన్న టీమ్‌ఇండియా ఆశలు అడియాసలే అయ్యాయి! ఆంగ్లేయులను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించాలన్న కోరిక నెరవేరలేదు. నిర్ణయాత్మక ఐదో టెస్టులో భారత్‌ ఓటమి చవిచూసింది. కనీసం మ్యాచును డ్రా చేసుకోలేక చేతికిందిన సిరీసును వదిలేసింది! ఎడ్జ్‌బాస్టన్‌లో 378 పరుగుల టార్గెట్‌ను స్టోక్స్‌ సేన అలవోకగా ఛేదించింది. మరో 7 వికెట్లు ఉండగానే గెలుపు తలుపు తట్టింది. ఐదు టెస్టుల సిరీసును 2-2తో ముగించింది. మాజీ కెప్టెన్‌ జో రూట్‌, జానీ బెయిర్‌స్టో తిరుగులేని సెంచరీలతో అదరగొట్టారు.