IND vs ENG 5th Test Rahul Dravid On India Edgbaston Loss Against England I do not know what BazBall is : బాజ్ బాల్ క్రికెట్ ఏంటో తనకు తెలియదని టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అంటున్నారు. ఇంగ్లాండ్ తన తరహాలోనే క్రికెట్ ఆడిందని పేర్కొన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ సరిగ్గా చేయకపోవడం, మెరుగైన బౌలింగ్ చేయకపోవడమే ఓటమికి కారణమని వెల్లడించారు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టు ఓటమి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
'మూడు రోజుల వరకు మేం ఆటను నియంత్రించాం. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం మా బ్యాటింగ్, బౌలింగ్ స్థాయికి తగ్గట్టు లేదు. ఇంగ్లాండ్ ఆటతీరుకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. జానీ బెయిర్‌స్టో, జో రూట్ అద్భుతంగా ఆడారు. మాకు 2-3 అవకాశాలు వచ్చినా వినియోగించుకోలేదు. ఏదేమైనా ప్రత్యర్థిని అభినందించాల్సిందే' అని ద్రవిడ్ అన్నారు.
'ఈ ఓటమి కచ్చితంగా మమ్మల్ని నిరాశపరిచింది. దక్షిణాఫ్రికాలోనూ మాకు అవకాశాలు వచ్చాయి. మేం సరిదిద్దుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టాలి. రెండేళ్లుగా మేం 20 వికెట్లు తీస్తున్నాం. 2, 3 నెలలుగా కాస్త ఇబ్బంది పడుతున్నాం. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఫిట్‌నెస్, ప్రదర్శన, తీవ్రతను కొనసాగించాల్సి ఉంది' అని మిస్టర్ వాల్ పేర్కొన్నారు.
'మేం బ్యాటింగ్ బాగా చేయలేదు. ఈ ఏడాది సాంతం టెస్టుల్లో మా ఛేదనలు గమనిస్తే అంతా బాగా ఆడినట్టు అనిపించలేదు. మేమీ టెస్టును మెరుగ్గా ఆరంభించాం. కానీ కోరుకున్నట్టుగా ముగించలేదు. మేం కచ్చితంగా మెరుగవ్వాల్సిందే. ఇప్పుడు క్రికెట్ జరుగుతున్న తీరు చూస్తుంటే సమీక్షించుకోవడానికి సమయమే దొరకడం లేదు (నవ్వుతూ). రెండు రోజుల తర్వాత నేను మరోటి మాట్లాడొచ్చు. ఈ మ్యాచ్ తర్వాత మాకు ఉపఖండంలోనే టెస్టులు ఉన్నాయి. బాజ్ బాలంటే ఏంటో నాకు తెలియదు. ఏదేమైనా ఇంగ్లాండ్ బాగా ఆడింది. తొలి ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్, రవీంద్ర జడేజా బాగా ఆడారు' అని ద్రవిడ్ పేర్కొన్నారు.
IND vs ENG, 5th Test, Edgbaston Stadium: అనుకున్నదే జరిగింది! ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీసు గెలవాలన్న టీమ్‌ఇండియా ఆశలు అడియాసలే అయ్యాయి! ఆంగ్లేయులను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించాలన్న కోరిక నెరవేరలేదు. నిర్ణయాత్మక ఐదో టెస్టులో భారత్ ఓటమి చవిచూసింది. కనీసం మ్యాచును డ్రా చేసుకోలేక చేతికిందిన సిరీసును వదిలేసింది! ఎడ్జ్‌బాస్టన్‌లో 378 పరుగుల టార్గెట్‌ను స్టోక్స్ సేన అలవోకగా ఛేదించింది. మరో 7 వికెట్లు ఉండగానే గెలుపు తలుపు తట్టింది. ఐదు టెస్టుల సిరీసును 2-2తో ముగించింది. మాజీ కెప్టెన్ జో రూట్, జానీ బెయిర్‌స్టో తిరుగులేని సెంచరీలతో అదరగొట్టారు.