Indian Money in Swiss Bank: భారత్‌ సహా ప్రపంచ దేశాల్లోని చాలా మంది కుబేరులకు స్విస్‌ బ్యాంక్‌ అకౌంట్స్‌ ఉంటాయి. దీనికి కారణం, అక్కడి బ్యాంక్‌ రూల్స్‌ చాలా కస్టమర్‌ ఫ్రెండ్లీగా ఉంటాయి. స్విస్‌ బ్యాంక్‌లకు డిపాజిట్‌ మాత్రమే ముఖ్యం, ఎవరు డిపాజిట్‌ చేశారన్నది అనవసరం. స్విట్జర్లాండ్ గవర్నమెంట్‌ అక్కడి బ్యాంక్‌లకు ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. ఆ అధికారాల ప్రకారం, కస్టమర్‌ పేరును స్విస్‌ బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టవు. అకౌంట్‌ ఉంటే లాకర్‌ను ఈజీగా ఇస్తాయి. ఆ లాకర్‌లో సదరు కస్టమర్‌ ఏం దాచాడన్నది బ్యాంక్‌లు పట్టించుకోవు. అసలు కస్టమర్‌ వివరాలను కూడా పూర్తి స్థాయిలో అడగవు. అంతేకాదు, కస్టమర్‌ కాకుండా వేరే వ్యక్తి/గవర్నమెంట్‌ ఆ అకౌంట్‌ను యాక్సెస్‌ చేయడం అంత సులభం కాదు. కాబట్టే, స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో డబ్బు, దస్కం దాచుకోవడానికి ప్రపంచ సంపన్నులు క్యూ కడతారు.


స్విట్జర్లాండ్ మాత్రమే కాదు, కేమాన్ ఐలాండ్స్‌ (Cayman Islands), బెలిజ్ (Belize), సింగపూర్‌లోనూ బ్యాంకులు ఈ తరహా రూల్స్‌ పాటిస్తున్నాయి. ఎక్కువ మంది అమెరికన్‌ ధనవంతుల ఫేవరెట్‌ ప్లేస్‌ కేమాన్‌ ఐలాండ్స్‌.


స్విస్‌ అకౌంట్లలో రూ.30 వేల కోట్లు
ఇప్పుడు స్విస్‌ బ్యాంక్‌ల విషయానికి వద్దాం. స్విట్జర్లాండ్ నేషనల్‌ బ్యాంక్‌ (SNB) రిలీజ్‌ చేసిన డేటా ప్రకారం, 2022 చివరి నాటికి, స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు & భారతీయ కంపెనీలకు 3.42 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ల (రూ. 30,000 కోట్లు) డిపాజిట్లు ఉన్నాయి. వాస్తవానికి, ఈ 2021తో పోలిస్తే ఈ డిపాజిట్లు 11 శాతం తగ్గాయట. 2021లో గరిష్టంగా 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లను (Swiss francs) ఇండియన్స్‌ డిపాజిట్‌ చేశారు. ఇది 14 సంవత్సరాల గరిష్టం. ఆ ఏడాది, కస్టమర్‌ డిపాజిట్‌ అకౌంట్లు కూడా 34 శాతం పెరిగాయి.


భారతీయులు, భారతీయ కంపెనీలు నేరుగా స్విట్జర్లాండ్ వెళ్లి డబ్బులు డిపాజిట్‌ చేయడంతో పాటు, భారతదేశంలో ఉన్న స్విస్ బ్యాంక్‌ బ్రాంచ్‌లు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా కూడా స్విస్ బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. అయితే స్విస్ బ్యాంకుల్లో భారతీయులు డిపాజిట్ చేసిన నల్లధనం (Black money) లెక్క SNB డేటాలో లేదు. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, NRIలు, లేదా థర్డ్‌ పార్టీ కంట్రీ ఎంటిటీల పేరుతో డిపాజిట్ చేసిన సొమ్ము గురించి కూడా వెల్లడించలేదు. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్‌కు అక్కడి బ్యాంకులు అందించిన డేటా ఆధారంగా SNB విడుదల చేసిన అధికారిక లెక్కలు ఇవి. 


2006లో డిపాజిట్ల వరద
స్విస్ నేషనల్ బ్యాంక్ ప్రకారం... మొత్తం డిపాజిట్ల విలువ 2006లో 6.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు చేరుకుంది. ఇండియన్‌ డిపాజిట్స్‌ విషయంలో ఇదే రికార్డ్‌ గరిష్ట స్థాయి. ఆ తర్వాత భారతీయ డిపాజిట్లలో తగ్గుదల కనిపించింది. 2011, 2013, 2017, 2020, 2021లో మాత్రమే జంప్‌ కనిపించింది.


స్విస్ బ్యాంకుల్లో భారతీయులు డిపాజిట్ చేసిన డబ్బును నల్లధనంగా పిలవలేమని స్విస్ అధికారులు చెప్పుకొచ్చారు. పన్నుల్లో మోసం, పన్ను ఎగవేతలను అడ్డుకోవడానికి భారత్‌తో నిరంతరం సహకరిస్తున్నామని వెల్లడించారు. 2018 నుంచి, భారత్‌-స్విట్జర్లాండ్ మధ్య పన్ను విషయాలకు సంబంధించిన సమాచార మార్పిడి ఒక అగ్రిమెంట్‌ కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, 2018 నుంచి స్విక్ బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్న భారతీయుల పేర్లు, వాళ్ల సమాచారం 2019 సెప్టెంబర్‌లో ఇండియన్‌ టాక్స్‌ అథారిటీ చేతికి అందింది. ఇప్పుడు, ఆ డేటా ప్రతి సంవత్సరం అందుతోంది. ఆర్థిక మోసాలకు పాల్పడ్డవాళ్ల పేర్లను తగిన సాక్ష్యాధారాలతో భారత ప్రభుత్వం అందించిన తర్వాత.. ఆ వ్యక్తుల పేరిట ఉన్న అకౌంట్లు, డిపాజిట్ల వివరాలను స్విస్ అథారిటీ భారత్‌కు ఇస్తోంది.


మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Eros, HDFC 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial