AP Politics: చిన్న వయసులోనే సీఎం అయ్యే అదృష్టాన్ని ఆ దేవుడు కల్పిస్తే... పేద ప్రజలకు సాయం చేయాల్సింది పోయి ఇలాగేనా పాలన సాగించేదంటూ ఏపీ సీఎం జగన్‌పై.. ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి  ఫైర్ అయ్యారు. ఏపీ సిట్టింగ్ ఎంపీలు హైదారాబాద్‌లో సెటిల్ అవుతామని చెప్పడం దారుణం అన్నారు. గతంలో టీడీపీ వాళ్లు ప్రతిపక్షాలపై దొంగ కేసులు పెడుతూ వేధించే వారని..  అదే వైసీపీ వాళ్లు కూడా నేర్చుకున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా డాక్టరేట్ కూడా పొందినట్లు పెద్ద ఎత్తున కేసులు పెట్టి వేధిస్తున్నట్లు ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ప్రతీ ఒక్క గ్రామంలో, ప్రతీ ఒక్క నియోజక వర్గంలో ఉన్నాయని అన్నారు. మరీ ఇంత దారుణమైన పాలనను తానెక్కడా చూడలేదన్నారు. మంచి పరిపాలన అందించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడుస్తూ.. మంచి పేరు తెచ్చుకోవాల్సింది పోయి ఇలా అరాచక పాలన సాగించడం దారుణం అంటూ చెప్పుకొచ్చారు. నాలుగేళ్ల పాలను సీఎం జగన్ ఏం చేశారో ఆయన చెప్పడం కాదు, ప్రజలే చెప్పాలంటూ కామెంట్లు చేశారు.


టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇచ్చే బియ్యాన్ని అమ్ముకునే వాళ్లని వారి తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ వాళ్లు రాష్ట్రాన్నే అమ్మేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి మండిపడ్డారు. రాజకీయం అనేది సేవ అయితే వైసీపీ నాయకులు దాన్ని వ్యాపారం కింద మార్చేశారని కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. మానవ సేవే మాధవ సేవ అంటారని.. అందుకే ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలంతా గుర్తు పెట్టుకుంటున్నారని చెప్పారు. పేద వారికి సేవ చేస్తున్నారు కాబట్టే.. ప్రజలు బీజేపీని అంతగా ప్రేమిస్తున్నారని వివరించారు. గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో ఈ సారి బీజేపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.