కొలంబియాలోని అడవుల్లో జరిగిన విమాన ప్రమాదం నుంచి ఇటీవల దాదాపు 40 రోజుల తర్వాత నలుగురు చిన్నారులు క్షేమంగా బయట పడిన విషయం తెలిసిందే. చుట్టూ చెట్లు, క్రూర మృగాలు, ఆకలిదప్పులు మధ్య వాళ్ళు 40 రోజుల పాటు సజీవంగా ఎలా ఉన్నారనేది ఇప్పటికీ ఆశ్చర్యమైన విషయమే. ఇంతకీ వాళ్ళు ఏం తిని బతికి ఉన్నారో తెలుసా? సరుగుడు పిండి దీన్నే కసావా పిండి అని కూడా పిలుస్తారు. ఇదే కాదు ఆ ఫారెస్ట్ లో ఉన్న కొన్ని పండ్లు కూడా వాళ్ళు తిన్నారట.


కసావా పిండి అంటే ఏంటి?


కసావాని టాపియోకా రూట్ అని అంటారు. దీన్నే మనం కర్ర పెండలం అని పిలుస్తాం. ఇది గ్లూటెన్ రహిత పిండి. కర్ర పెండలం మొక్కలో సాధారణంగా వినియోగించే భాగం దాని వేరు. ఇది బహుముఖ ప్రయోజనాలు కలిగి ఉంటుంది. దీన్ని పూర్తిగా తినొచ్చు. తురిమిన లేదా పిండి మాదిరిగా మెత్తగా చేసుకుని తీసుకుంటారు. బ్రెడ్ కాల్చేందుకు దీన్ని ఉపయోగిస్తారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. క్లిష్టమైన పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం ఈ మొక్కలకు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణ మండల ప్రాంతాల్లో పెరుగుతుంది. అత్యంత కరువు పరిస్థితులని కూడా తట్టుకుని నిలబడగలిగే పంటల్లో ఇదీ ఒకటి.


కసావా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. కార్బోహైడ్రేట్లకి గొప్ప మూలం. ఇందులో ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శక్తిని ఉత్పత్తి చేస్తుంది. జీవక్రియకు అవసరమైన ఇనుము, రాగిని సమృద్ధిగా అందిస్తుంది. కసావాకి బదులుగా గోధుమ పిండి కూడా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండింటిలో ఒకే రకమైన ఖనిజాలు ఉంటాయి. కసావా పిండి కార్బ్ రిచ్ ఫుడ్. కొవ్వు లేదా ప్రోటీన్ ఇందులో ఉండవు. రెసిస్టెంట్ స్టార్చ్ పుష్కలంగా ఉండటం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది. బరువు తగ్గించడంలో కీలకంగా సహాయపడుతుంది. ఇది ఆహార పదార్థాల జీర్ణక్రియని నెమ్మదిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నెమ్మదిగా పెరిగేలా చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.


ఐస్ క్రీమ్ గా కూడా.. 


ఈ కసావా పిండి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో పెరిగే వారికి ఇది బాగా సుపరిచితమే. భారతదేశంలోనూ కసావా పిండి సులభంగా లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్, కేరళలో దీన్ని ప్రధాన ఆహారంగా తింటారు. ఈ పిండితో గంజి, పాన్ కేక్, గ్లూటెన్ ఫ్రీ పాస్తా, పిజ్జాతో సహా ఆహార పరిశ్రమలో అనేక విధాలుగా ఉపయోగిస్తాయి. తయారీదారులు కొన్ని సార్లు దీన్ని ఐస్ క్రీమ్, సాస్, డ్రెస్సింగ్ కోసం కూడా ఉపయోగిస్తారు. అస్సాంలో కార్బో హైడ్రేట్ల కోసం ఉపయోగించే ముఖ్యమైన పిండి. పచ్చి కసావాలో సైనోజెనిక్ గ్లైకోసైడ్స్ అని పిలిచే రసాయనాలు ఉన్నందున దీన్ని పచ్చిగా లేదా సరిగ్గా ఉడికించకుండా తినకూడదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. పచ్చిగా తింటే ఇది శరీరంలోకి సైనైడ్ ని విడుదల చేస్తుంది. విషపూరితంగా మారి ప్రాణాల మీదకు తీసుకొస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఆకలి వేయడం లేదా? ప్రాణాలకు చాలా ప్రమాదం, డాక్టర్‌ను సంప్రదించండి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial