Extension of Curbs on Parboiled Rice: ప్రపంచ మార్కెట్‌లోకి బియ్యాన్ని ఎక్కువగా ఎగుమతి చేసేది మన దేశమే. మన మార్కెట్‌లో పెరుగుతున్న రైస్‌ రేట్లను కిందకు దించడానికి, బియ్యం ఎగుమతులపై భారత ప్రభుత్వం గతంలోనే ఆంక్షలు విధించింది. ముఖ్యంగా, ఉడకబెట్టిన బియ్యంపై ఎగుమతి సుంకాన్ని 20%కు పెంచింది. ఇండియా డెసిషన్‌తో, రైస్‌ ఎక్కువగా తినే ఆసియాతో సహా మొత్తం ప్రపంచ మార్కెట్‌లో బియ్యం ధరలు పెరిగాయి. ప్రస్తుత పండుగల సీజన్, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మరికొంత కాలం వరకు కంటిన్యూ చేయవచ్చు.


దేశీయ మార్కెట్‌లో బియ్యం ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయడానికి, ఈ ఏడాది జులై నెలాఖరులో, భారత ప్రభుత్వం బాయిల్డ్ రైస్‌పై 20 శాతం ఎగుమతి సుంకం విధించింది. ఈ నిర్ణయం ఈ నెల 15వ తేదీ (అక్టోబర్ 15, 2023‌) వరకు వర్తిస్తుంది. గడువు దగ్గర పడింది కాబట్టి, ఎగుమతి సుంకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతి సుంకాన్ని 40 శాతానికి పెంచొచ్చని గతంలో వార్తలు వచ్చాయి. కొందరు ప్రభుత్వ అధికారులు ఆ వార్తల్లో నిజం లేదన్నారు. బాయిల్డ్ రైస్ ఎగుమతిపై సుంకాన్ని 40 శాతం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అయితే, 20 శాతం నుంచి తగ్గించకుండా, గడువును ఇంకా పెంచే ఛాన్స్‌ ఉందని క్లూ ఇచ్చారు.


ప్రపంచవ్యాప్తంగా బియ్యం రేట్లు పెరిగే ప్రమాదం
మన దేశంలో ఈ ఏడాది చివరి నాటికి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల వేళ ప్రజాగ్రహానికి గురి కాకుండా, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితుల్లో, దేశీయ మార్కెట్‌లో రైస్‌ రేట్లను తగ్గించేందుకు ఎగుమతి సుంకాన్ని ఇంకా పెంచాలని నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం ప్రపంచంపై పడుతుంది. జులైలో 20% ఎగుమతి సుంకం విధిస్తూ భారతదేశం తీసుకున్న నిర్ణయం తర్వాత ఆసియా మార్కెట్లలో బియ్యం ధరలు 15 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరాయి. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో విస్తరించిన ప్రతికూల వాతావరణం కూడా ఈ సంవత్సరం బియ్యం ఉత్పత్తిని ప్రభావితం చేసింది.


ఎల్ నినో కారణంగా ఉత్పత్తిపై దెబ్బ
బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్‌ ప్రకారం, ప్రతికూల వాతావరణం & ఎల్ నినో ప్రభావం కారణంగా భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తి ప్రతికూలంగా ప్రభావితమైంది. బియ్యం ప్రధాన ఎగుమతి దేశాల్లో ఇండోనేషియా ఒకటి. ఈసారి తమ దేశంలో వరి దిగుబడి సాధారణం కంటే తక్కువగా ఉంటుందని అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వియత్నాం కూడా, వాతావరణ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి ఈసారి వరి నాట్లు ముందుగా వేయాలని తన దేశ రైతులకు సూచించింది.


పండుగల సీజన్, ఎన్నికల దృష్ట్యా దేశీయ ధరలను అదుపులో పెట్టడానికి ఎక్స్‌పోర్ట్‌ డ్యూటీ గడువును భారత్‌ పొడిగిస్తే, అది ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లో బాయిల్డ్ రైస్ ఎక్కువగా వినియోగిస్తారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం అనేక రకాల వరి రకాలను పండిస్తారు, వీటిలో ఉడకబెట్టిన బియ్యానిది ప్రధాన భాగం. మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న బియ్యంలో 30 శాతం ఉడకబెట్టిన బియ్యానిదే.


మరో ఆసక్తికర కథనం: మ్యూచువల్‌ ఫండ్స్‌ మీద లోన్‌ తీసుకోవచ్చు, వడ్డీ కూడా తక్కువే!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial